భారత పోటీ ప్రోత్సాహక సంఘం

‘అపోలో హెల్త్‌ కో’లో (రస్మెలి ద్వారా) అడ్వెంట్ కొనుగోలు... కీమెడ్‌లో ‘అపోలో హెల్త్‌కో’ కొనుగోలు... ‘అపోలో హెల్త్‌ కో’/కీమెడ్‌ విలీనంతో కూడిన సంయుక్త లావాదేవీలకు ‘సిసిఐ’ ఆమోదం

Posted On: 20 AUG 2024 8:16PM by PIB Hyderabad

పోలో హెల్త్‌ కో’లో (రస్మెలి ద్వారా) అడ్వెంట్ కొనుగోలు... ‘కీమెడ్‌’లో ‘అపోలో హెల్త్‌ కో’ కొనుగోలు... ‘అపోలో హెల్త్‌ కో’/కీమెడ్‌ ప్రతిపాదిత విలీనంతో కూడిన సంయుక్త లావాదేవీలకు  ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ) ఆమోదం తెలిపింది.

   రస్మెలి లిమిటెడ్ (రస్మెలి) సైప్రస్‌ దేశంలో నమోదైన సంస్థ. పెట్టుబడులను నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాల్లో ఒకటి. అయితే, భారతదేశంలో ఈ సంస్థకు ఎలాంటి కార్యకలాపాలు లేదా ఉనికి ఉండవు. కొన్ని సంస్థలు రస్మెలితో పరోక్ష వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండగా, అవి నిర్దిష్ట నిధులు/పరిమిత భాగస్వామ్యాల ద్వారా సాగుతుంటాయి. అంతిమంగా ఇవి అడ్వెంట్ ఇంటర్నేషనల్, ఎల్.పి. (అడ్వెంట్) నిర్వహణలో ఉంటాయి. వ్యాపారం, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక, చిల్లర వర్తకం, వినియోగదారు, విశ్రాంతి సదుపాయాలు, సాంకేతికత సహా నిర్దిష్ట రంగాలలో పెట్టుబడులపై అడ్వెంట్ దృష్టి పెడుతుంది.

   ఇక అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ (ఎహెచ్ఇఎల్) మన దేశంలో- (i) ఆస్పత్రుల నిర్వహణ-యాజమాన్యం సహా ద్వితీయ/తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలు; (ii) ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాతలకు హాస్పిటల్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సేవలు, బ్రాండింగ్/శస్త్రచికిత్స నిర్వహణ మద్దతు సేవలందించడం; (iii) ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ క్లినిక్‌లు, ప్రసూతి కేంద్రాలు, స్వల్ప చికిత్స కేంద్రాలు, మధుమేహం నిర్వహణ కేంద్రాలు, దంత-డయాలసిస్ కేంద్రాలు, రోగ నిర్ధారణ పరీక్షల సేవలు వంటి రిటైల్ ఆరోగ్య సంరక్షణ సేవల వ్యాపారం చేస్తుంది.

   కాగా, అపోలో హెల్త్ కో లిమిటెడ్ (ఎహెచ్ఎల్/అపోలో హెల్త్ కో) ‘‘అపోలో 24|7’’ వేదికను నిర్వహిస్తూంటుంది. డాక్టర్ సంప్రదింపులతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి వినియోగదారులు/ఖాతాదారులకు ఈ సంస్థ సహాయపడుతుంది. అలాగే ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ మేరకు ఔషధ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎమ్‌సిజి), ‘ఒటిసి’ ఉత్పత్తులు, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల టోకు పంపిణీదారుగా వ్యవహరిస్తుంది.

   ఇక కీమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ- (i) ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ‘ఒటిసి’ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, శస్త్రచికిత్స ఉత్పత్తులు, ఆస్పత్రులు/‘ఎఫ్ఎమ్‌సిజి’ సంస్థల కోసం శాస్త్రీయ ఉపకరణాలు, పరికరాల టోకు పంపిణీ; (ii) ఔషధ ఉత్పత్తుల మార్కెటింగ్/విక్రయాల వ్యాపారంలో ఉంది.

   ఈ నేపథ్యంలో ప్రతిపాదిత సంయుక్త విలీనం కిందివిధంగా సాగుతుంది:

   (i) రస్మెలీ ఇన్వెస్ట్‌ మెంట్: ‘ఎహెచ్ఎల్’ కొన్ని హక్కులతో పాటు స్వల్ప పెట్టుబడిని రెండు విడతల్లో పెట్టాలన్నది రస్మెలీ ప్రతిపాదన; (ii) కీమెడ్‌లో ‘ఎహెచ్ఎల్’ పెట్టుబడి: దశలవారీగా ప్రాథమిక, ద్వితీయ లావాదేవీల ద్వారా కీమెడ్‌లో కొన్ని షేర్ల కొనుగోలు చేయాలన్నది ‘ఎహెచ్ఎల్’ ప్రతిపాదన (iii) ‘ఎహెచ్ఎల్’లో కీమెడ్ విలీనం: రస్మెలీ ఇన్వెస్ట్‌ మెంట్ నుంచి నిర్దిష్ట వ్యవధిలో ‘ఎహెచ్ఎల్’లో కీమెడ్‌ విలీనానికి కీమెడ్/‘ఎహెచ్ఎల్’ తగు చర్యలు చేపడతాయి. (iv) ‘ఎహెచ్ఎల్’లో ‘ఎహెచ్ఇఎల్’ అదనపు పెట్టుబడి: రస్మెలి ఇన్వెస్ట్‌ మెంట్‌కు ముందుగా ‘ఎహెచ్ఎల్’ (ప్రతిపాదిత కలయిక) ద్వారా ప్రిఫరెన్షియల్ కేటాయింపు, తాజా ఈక్విటీ షేర్ల బోనస్ జారీకి అనుగుణంగా ‘ఎహెచ్ఎల్’లో నిర్దిష్ట ఈక్విటీ షేర్లకు సబ్‌స్క్రయిబ్ చేయాలన్నది ప్రతిపాదన.

 

ఈ మొత్తం లావాదేవీలకు సంబంధించి సిసిఐ త్వరలో పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీచేస్తుంది.

***



(Release ID: 2047542) Visitor Counter : 22