కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మోసపూరిత కాల్స్ పై ప్రజలకు ట్రాయ్ హెచ్చరిక

Posted On: 21 AUG 2024 6:16PM by PIB Hyderabad

ట్రాయ్ నుంచి చేస్తున్నట్లుగా చెప్పుకుంటూ ప్రజలకు రికార్డు చేసిన కాల్స్ వస్తున్నాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) దృష్టికి వచ్చింది. త్వరలోనే తమ నంబర్లను బ్లాక్ చేస్తామని, వ్యక్తిగత సమాచారం ఇవ్వాలంటూ కొందరు ప్రజలను బెదిరిస్తున్నారు. 


మెసేజ్‌లు లేదా ఇతరత్రా మార్గాల్లో మొబైల్ నంబర్ రద్దు చేయడం గురించి ట్రాయ్ ఎకాఎకి వినియోగదారులను సంప్రదించే అవకాశం లేదు. ఇలాంటి పనుల కోసం కస్టమర్లను సంప్రదించడానికి ట్రాయ్ తృతీయ పక్ష (థర్డ్ పార్టీ) సంస్థలకు అధికారం ఇవ్వలేదు. అందువల్ల ట్రాయ్ నుండి వచ్చినట్లు చెప్పుకునే, మొబైల్ నంబర్ రద్దు చేస్తామంటూ బెదిరించే ఏదైనా సమాచారం (కాల్, సందేశం, నోటీసు) మోసపూరితమైనదిగానే పరిగణించాలి, వాటిని ప్రోత్సహించకూడదు. 

 

బిల్లు, కేవైసీ, దుర్వినియోగం కారణంగా ఏదైనా మొబైల్ నంబర్ రద్దు చేయటానికి సంబంధించిన సమాచారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్(టీఎస్పీ) ద్వారా వినియోగదారులకు అందుతుంది. వీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  భయపడకుండా, మోసగాళ్ల బారిన పడకుండా చూసుకోవాలి. టెలికాం సంస్థల అధికారిక కాల్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లను సంప్రదించడం ద్వారా ఇలాంటి కాల్స్ లేదా సమాచారాన్ని నిర్ధారణ చేసుకోవాలి.

 

సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరులను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి, పౌరులు టెలికమ్యూనికేషన్ల విభాగానికి చెందిన సంచార్ సాథీ ప్లాట్‌ఫామ్‌ చక్షు సౌకర్యం ద్వారా అనుమానాస్పద మోసాల గురించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.

https://sancharsaathi.gov.in/sfc/ ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. సైబర్ నేరానికి బాధితులు అయినట్లయితే నిర్దేశిత సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ '1930'లో లేదా https://cybercrime.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వాటిని నివేదించాలి.

****



(Release ID: 2047530) Visitor Counter : 37