ఆర్థిక మంత్రిత్వ శాఖ

దిల్లీలో రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ ఎన్ ఫోర్స్ మెంట్ అధిపతుల జాతీయ సదస్సు రెండో ఎడిషన్


నకిలీ రిజిస్ట్రేషన్ల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆగస్టు 16న ప్రారంభించిన ప్రత్యేక కసరత్తు రెండు నెలల పాటు సాగుతుంది



కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ సంస్థలు ఈ ప్రత్యేక కసరత్తులో నకిలీ రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించాలి: రెవెన్యూ కార్యదర్శి



ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలు, సులభతర వాణిజ్యం మధ్య సమతుల్యత ముఖ్యం: రెవెన్యూ కార్యదర్శి



ఎన్ ఫోర్స్ మెంట్ యూనిట్లు నిజమైన ఎగవేతపై దృష్టి పెట్టాలి: సీబీఐసీ చైర్మన్

Posted On: 20 AUG 2024 8:12PM by PIB Hyderabad

దిల్లీలో రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ ఎన్ ఫోర్స్ మెంట్ అధిపతుల జాతీయ సదస్సు రెండో ఎడిషన్ నేడు జరిగింది. ఈ సదస్సుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను గుర్తించి నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కసరత్తును చేపట్టిన నేపథ్యంలో ఈ జాతీయ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఈ సదస్సులో రెవెన్యూ శాఖ, సీబీఐసీ ఉన్నత అధికారులు.. వాణిజ్య పన్నుల కమిషనర్లు, రాష్ట్రాల జీఎస్టీ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాల అధిపతులు, జీఎస్టీఎన్ సీఈవో, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఎన్ ఫోర్స్ మెంట్, (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) విభాగాలు, ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్ఐయూ-ఐఎన్డీ), కేంద్ర ఆర్థిక వ్యవహారాల నిఘా విభాగం (సీఈఐబీ) వంటి ఎన్‌ఫోర్స్‌ మెంట్, నిఘా సంబంధిత అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెవెన్యూ కార్యదర్శి మాట్లాడుతూ ఎన్‌ఫోర్స్‌ మెంట్ చర్యలు, సులభతర వాణిజ్యం మధ్య సమతూకం పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ ప్రత్యేక కసరత్తు (స్పెషల్ డ్రైవ్) సందర్భంగా నకిలీ రిజిస్ట్రేషన్లపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ సంస్థలు దృష్టి సారించాలని, నకిలీ ఐటీసీ సూత్రధారులు, లబ్దిదారులను గుర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. తద్వారా వీటిని నిరోధించేందుకు అవసరమైన కఠినమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. జీఎస్‌టీఆర్ -1ఏ వంటి జీఎస్టీ రిటర్నులలో ఇటీవల అమలు చేసిన మార్పులు జీఎస్టీ ఎగవేతను ఒక క్రమపద్ధతిలో ఎదుర్కొనేందుకు మరింత ఉపయోగపడతాయని మల్హోత్రా అన్నారు.

సదస్సు జరుగుతున్న సందర్భం గురించి కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) చైర్మన్ శ్రీ సంజయ్ అగర్వాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఈ సదస్సు మొదటి ఎడిషన్‌లో జరిగిన చర్చను గుర్తుచేస్తూ, జీఎస్టీ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించడానికి ఎన్‌ఫోర్స్‌ మెంట్ సంస్థలు ఎగవేతదారుల కంటే ముందుండాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీపై వివరణలు ఇవ్వడం, రోజువారీ చేసే పనుల కంటే నిజమైన ఎగవేతపై దృష్టి పెట్టాలని ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్లకు సూచించారు.

 

రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ స్వాగతోపన్యాసాన్ని ఇచ్చారు. సదస్సులో పాల్గొంటున్న అధికారులు వివిధ రంగాల్లో ప్రత్యేకంగా ఉండే ఎన్‌ఫోర్స్‌ మెంట్ సమస్యలు, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌లో ఎదురవుతున్న సమస్యలు, ఎగవేతను పరిష్కరించే పద్ధతులపై చర్చించడం ద్వారా అందరూ ప్రయోజనం పొందొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో చేపట్టిన చర్చల ఉద్దేశాన్ని సాధించడానికి... గుర్తించిన చర్యలపై అనుసరణ (ఫాలో అప్)కు సంబంధించిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
 

ఈ సదస్సులో జీఎస్టీ సంస్థలు వివిధ రకాల ప్రజెంటేషన్లు ఇచ్చాయి. 2024 మార్చిలో జరిగిన మొదటి సదస్సులో గుర్తించిన చర్యల నివేదికను ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ చర్యలు పూర్తయ్యేలా చూడటంలో తమ కార్యచరణను కొనసాగించాలని సంస్థలకు సూచించారు. 2024 ఆగస్టు 16న నకిలీ రిజిస్ట్రేషన్లపై ప్రారంభించిన 2 నెలల స్పెషల్ డ్రైవ్ వివరాలను వారికి తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ఈ డ్రైవ్ ను చేపట్టారు. గుర్తించిన కొన్ని ప్రాణాణికతల ఆధారంగా.. తనిఖీ, తదుపరి విచారణ కోసం సుమారు 59,000 సంభావ్య నకిలీ సంస్థలను గుర్తించారు. సులభతర వ్యాపారానికి ఇబ్బంది కలగకుండా, ఎగవేత సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చిన వివిధ సాంకేతికలపై జీఎస్టీఎన్ సీఈఓ ప్రజెంటేషన్ ఇచ్చారు.

2020 నుంచి ఇప్పటి వరకు రూ. 1,20,000 కోట్ల నకిలీ ఐటీసీ ఎగవేతను డీజీజీఐ గుర్తించిందని.. సూత్రధారులను గుర్తించడం, పట్టుకోవడం, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిండికేట్లను దెబ్బతీయడంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇలాంటి 170 మంది సూత్రధారులను ఇప్పటికే పట్టుకున్నట్లు డీజీజీఐ డీజీ తన ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. సులభతరంగా వ్యాపారం ఉండేలా చూసుకుంటూ.. కార్యాచరణలో ఏకరూపతను తీసుకురావడానికి, సాధించటానికి జారీ చేసిన కొన్ని ఉత్తమ పద్ధతులు/మార్గదర్శకాల గురించి కూడా చర్చించారు.

తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహణ వ్యవస్థ(జెమ్స్)ను మహారాష్ట్ర జీఎస్టీ కమిషనర్ ప్రదర్శించారు. ఈ వ్యవస్థ ద్వారా ఎన్‌ఫోర్స్‌ మెంట్ చర్యలను ట్రాక్ చేయటానికి వీలవుతుంది. దీనివల్ల ప్రక్రియలో పారదర్శకత వచ్చి, సహేతుకమైన సమయంలో జీఎస్టీ డిమాండ్లు పరిష్కారం అవుతాయి. తద్వారా ఎగవేసిన పన్నులను తిరిగి పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఏపీఎంసీ ఖాతాల దుర్వినియోగం, ఫిన్‌టెక్ కంపెనీలు, రహస్య అనుమతులు, ఆర్థిక రంగంలో సమస్యలు.. క్రిప్టోలు, ఎన్ఎఫ్‌టీలు, టీడీఆర్‌లు వంటి అభివృద్ధి చెందుతున్న సేవారంగం ఉత్పత్తులపై పన్ను విధించడం తదితర అంశాలపై డీజీజీఐ/సీబీఐసీ జోనల్ యూనిట్లు వివిధ కేస్ స్టడీలను ప్రదర్శించాయి.

 

గుజరాత్ చీఫ్ కమిషనర్ ట్యాక్స్(సీసీటీ) మానవ వనరుల సరఫరాకు సంబంధించి గుర్తించిన ఎగవేత విధానాలపై చర్చించారు. వాటిపై ఎలా ముందుకెళ్లాలో సూచించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికారులు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్ కేసుల గురించి చర్చించారు. కర్ణాటక ఎస్‌జీఎస్టీ అధికారులు.. ఎగవేతదారులను మెరుగ్గా గుర్తించేందుకు ఇంటర్ డిపార్ట్ మెంట్ డేటాను ఉపయోగించుకోవడంలో వారి అనుభవాన్ని పంచుకున్నారు. రాజస్థాన్‌ సీసీటీ వివిధ ఎన్‌ఫోర్స్‌ మెంట్ కేసుల అధ్యయన వివరాలను తెలియజేశారు. బిల్లు వ్యాపారాలపై రాష్ట్రవ్యాప్త ఆకస్మిక దాడులు, క్షేత్రస్థాయి సర్వేల(స్ట్రీట్ సర్వే) నిర్వహణ, కొత్త నమోదుదారులకు స్నేహపూర్వక స్వాగత లేఖలను పంపడం ద్వారా నకిలీ నమోదుదారులను గుర్తించే ప్రత్యేక ప్రక్రియ వివరాలను తమిళనాడు సీసీటీ వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని ఎన్‌ఫోర్స్‌ మెంట్ యూనిట్లకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేలా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ యాక్షన్స్ ను రూపొందించాల్సిన అవసరాన్ని పలువురు దృష్టికి తెచ్చారు. రాజస్థాన్ నిర్వహించిన 'సంవాద్' సెషన్లు, తమిళనాడు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ఫలితాల నేపథ్యంలో
  రెవెన్యూ కార్యదర్శి మాట్లాడుతూ.. వాణిజ్య, వ్యాపార సంస్థలతో నిరంతరం అనుసంధానమై ఉండటం వల్ల బలవంతమైన ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ చర్యల అవసరాన్ని తగ్గించొచ్చని, నిబంధనలకు లోబడి ఇబ్బందులు లేకుండా సంస్థలు పనిచేయటం వంటి లక్ష్యాలను సాధించొచ్చు అని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ అధికారుల మధ్య అనుభవాలను పరస్పరం పంచుకునేందుకూ, విజ్ఞాన బదిలీకి ఈ సదస్సు ఒక సమర్థవంతమైన వేదికను అందించింది.

 

***



(Release ID: 2047250) Visitor Counter : 23