వ్యవసాయ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని పూసాలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయం, అనుబంధ శాస్ర్తాల్లో ఆసియాన్-ఇండియా ఫెలోషిప్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
శతాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉంది. కోట్లాది మందికి జీవనోపాధి కల్పించడంతో పాటు స్థూల వస్తూత్పత్తికి విశేషమైన వాటా అందిస్తోంది
Posted On:
14 AUG 2024 6:42PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని పూసాలో భారత వ్యవసాయ పరిశోధనా మండలిలో ( ఐసిఏఆర్)
జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, అనుబంధ శాస్ర్తాల్లో ఆసియాన్-ఇండియా ఉన్నత విద్యా ఫెలోషిప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
సహాయ మంత్రులు శ్రీ భగీరథ్ చౌధరి, శ్రీ రామ్ నాథ్ ఠాగూర్ సమక్షంలో జరిగింది.
భారతదేశంలో వ్యవసాయ విద్యకు రూపకల్పన చేయడంలోను, నాణ్యతకు హామీ ఇవ్వడంలోను ఐసిఏఆర్ ముందువరుసలో ఉందని శ్రీ చౌహాన్ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా
వ్యవసాయ విద్యాభివృద్ధికి కావలసిన నిబంధనలు, విధానాలు, ప్రమాణాలను రూపొందించడంతో పాటు వ్యవసాయ రంగం సుస్థిరాభివృద్ధికి ఐసిఏఆర్ ఎంతో కృషి చేస్తోందన్నారు.
‘‘ప్రస్తుతం దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 135 మంది విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆసియాన్ ఏర్పాటైన నాటి నుంచి భారతదేశం ఆసియాన్ దేశాలతో బలమైన భాగస్వామ్యం కలిగి ఉంది. భారతదేశం అనుసరిస్తున్న “యాక్ట్ ఈస్ట్ పాలసీ”కి మూలస్తంభం ఆసియాన్. “ఇండో-పసిఫిక్ విజన్” కూడా దాని ఆధారంగానే రూపొందించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆసియాన్ ఐక్యత, ఆసియాన్ కేంద్ర స్థానం, ఆసియాన్ దృక్పథానికి భారతదేశం పూర్తి మద్దతు ఇస్తోంది.
వ్యవసాయం, అనుబంధ శాస్ర్తాల్లో అభివృద్ధి చెందుతున్న వివిధ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుకేట్ విద్య అభ్యసిస్తున్న వారికి ఆసియాన్-ఇండియా ఫెలోషిప్ మద్దతు ఇస్తుందని వ్యవసాయ మంత్రి ప్రకటించారు. ఇందులో భాగస్వాములయ్యే భారత ఫ్యాకల్టీ సభ్యులను ఆసియాన్ సభ్యదేశాల సందర్శనలకు పంపుతామని, ఇది ఆసియాన్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని, ఆసియాన్ దేశాల్లో వ్యవసాయం, అనుబంధ శాస్ర్తాల వృద్ధికి అవసరమైన మానవవనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
భారతదేశంలోని దీర్ఘకాలిక డిగ్రీ కోర్సులు ఉభయ ప్రాంతాలకు చెందిన పరిశోధకులు దీర్ఘకాలం అనుసంధానం అయి ఉండేందుకు, ఆసియాన్ దేశాల్లోను, భారతదేశంలోను వ్యవసాయ సంబంధిత సమస్యలపై మెరుగైన అవగాహన ఏర్పరచుకునేందుకు వీలు కల్పిస్తాయన్నారు.
ఆసియాన్ లో వ్యవసాయ, అనుబంధ శాస్ర్తాల్లో నిపుణులైన మానవ వనరుల అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదకారి అవుతుందని భారతదేశంలో ఫిలిప్పీన్స్ రాయబారి, భారతదేశ (ఆసియాన్) కంట్రీ కోఆర్డినేటర్ జోసెల్ ఎఫ్ ఇగ్నాసియో అన్నారు. ఆసియాన్-ఇండియా ఫెలోషిప్ కార్యక్రమంలో సహకార స్ఫూర్తి, పరస్పర వృద్ధి అంతర్గతంగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.
ఆసియాన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార భద్రతా సమస్యలకు పరిష్కారాలు చూపడంలో ఐసిఏఆర్ పాత్రను అదనపు కార్యదర్శి (డేర్), కార్యదర్శి (ఐసిఏఆర్) శ్రీ సంజయ్ గార్గ్ వివరించారు. భారతదేశంలో ఆసియాన్ దేశాల ప్రాధాన్యత, సహకారంపై సవివరంగా ప్రస్తావించారు.
అదనపు కార్యదర్శి (డేర్), ఆర్థిక సలహాదారు (ఐసిఏఆర్)
అల్కా నంగియా అరోరా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఓషియానా, ఇండో-పసిఫిక్ విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీమతి పరమితా త్రిపాఠీ ఆసియాన్ సహకార ప్రాజెక్టు గురించి చర్చించడంతో పాటు భారతదేశం అనుసరిస్తున్న “యాక్ట్ ఈస్ట్ పాలసీ”ల గురించి పరిచయం చేశారు. అంతకు ముందు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వ్యవసాయ విద్య) శ్రీ ఆర్.సి.అగర్వాల్ తన స్వాగతోపన్యాసంలో ఆసియాన్-ఇండియా ఫెలోషిప్ గురించి వివరించారు.
ఆసియాన్ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, రాయబార కార్యాలయాల డిప్యూటీ చీఫ్ లు, ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్; డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాష్ర్ట వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్-చాన్సలర్లు, ఆసియాన్ సభ్య దేశాల ప్రతినిధులు; ఆసియాన్ సెక్రటేరియట్ , ఆసియాన్ లో భారత కార్యాలయ ప్రతినిధులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాస్టర్స్ ప్రోగ్రామ్ లో భారతదేశ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న అత్యాధునిక పరిశోధనలో విద్యార్థులు పాల్గొనేందుకు, భవిష్యత్ ఆవిష్కరణలకు సిద్ధం అయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. దీనికి తోడు భారతదేశం అందిస్తున్న దీర్ఘకాలిక డిగ్రీ కోర్సుల ద్వారా ఉభయ ప్రాంతాలకు చెందిన పరిశోధకులుఉ దీర్ఘకాలం పాటు అనుసంధానం అయి ఉండేందుకు; ఆసియాన్, భారతదేశాల్లో వ్యవసాయ సంబంధిత సమస్యలపై మెరుగైన అవగాహనకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించి వ్యవసాయం, అనుబంధ శాస్ర్తాల్లో ఆసియాన్ సభ్యదేశాల విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీలో 50 ఫెలోషిప్ లను (ఏడాదికి 10) అందచేస్తారు. ఆసియాన్-ఇండియా ఫండ్ కింద అయిదు
సంవత్సరాల కాలానికి ఈ ప్రాజెక్టును ఆమోదించారు. విద్యార్థులకు ఫెలోషిప్, అడ్మిషన్ ఫీజు, జీవన వ్యయాలు, ఇతర ఖర్చులకు మద్దతు లభిస్తుంది. ఆసియాన్ సభ్య దేశాల విద్యార్థులు నాణ్యమైన పరిశోధనాత్మక విద్య అందుకునేందుకు; ఆసియాన్ భారత సమాజం మరింత చేరువయ్యేందుకు, ఆసియాన్ దేశాల విద్యార్థుల మధ్య అంతర్ సాంస్కృతిక, అంతర్జాతీయ పరిజ్ఞాన మార్పిడికి ఇది దోహదకారి అవుతుంది.
***
(Release ID: 2046505)
Visitor Counter : 65