పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

బాగ్దోగ్రా, బిహ్తా విమానాశ్రయాల్లో కొత్త ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం


భవిష్యత్తు అవసరాలను తీర్చడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ఈ నూతన ప్రాజెక్టుల లక్ష్యం - శ్రీ రామ్మోహన్ నాయుడు

Posted On: 16 AUG 2024 9:49PM by PIB Hyderabad

బాగ్‌డోగ్రా, బిహ్తా విమానాశ్రయాల్లో కొత్తగా పౌర విమానయాన సదుపాయల అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్చం చేశారు. "బాగ్దోగ్రా బిహ్తా విమానాశ్రయాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలియజేసేందుకు నేను సంతోషపడుతున్నాను. రూ.2962.00 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు.. ప్రాంతీయ అనుసంధాన్ని మెరుగుపరచటం, దేశమంతటా విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చటం అనే ప్రభుత్వ విస్తృత వ్యూహంలో అంతర్భాగం" అని వ్యాఖ్యానించారు.

రూ.1549.00 కోట్ల వ్యయంతో బాగ్దోగ్రాలో రానున్న కొత్త పౌర విమానయాన సదుపాయంలో భాగంగా 70,390 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టర్మినల్ నిర్మించనున్నారు. ఇది ఏకకాలంలో 3,000 మందిని(పీక్అవర్ ప్యాసెంజర్స్) నిర్వహించగలదు. దీనికి 10 మిలియన్ల వార్షిక సామర్థ్యం ఉండనుంది. ఏ-321 రకం విమానాల కోసం 10 పార్కింగ్ బేలు, రెండు వాహన(లింక్ ట్యాక్సీ వే)మార్గాలు, బహుళ అంతస్థుల వాహన పార్కింగ్ సదుపాయాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు. సుస్థిరత విషయంలో ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించటం, సహజ వెలుతురును గరిష్టంగా వాడటం ద్వారా ఈ టర్మినల్‌ను ఒక హరిత భవనంగా తీర్చిదిద్దనున్నారు.

పాట్నా విమానాశ్రయంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా బిహ్తా విమానాశ్రయంలోని కొత్త పౌర విమానయాన సదుపాయాన్ని నిర్మించనున్నారు. రూ.1413 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న కొత్త టెర్మినల్ 66,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రానుంది. ఏకకాలంలో 3,000 మంది(పీక్ అవర్ ప్యాసింజర్స్), 5 మిలియన్ల వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యంతో దీన్ని ప్రారంభించనున్నారు. వార్షిక సామర్థ్యాన్ని 10 మిలియన్లకు విస్తరించే విధంగా తీర్చిదిద్దనున్నారు. ఏ-321/బీ-737-800/ఏ-320 రకం విమానాల కోసం 10 పార్కింగ్ బేలు, రెండు వాహన(లింక్ ట్యాక్సీ వే) మార్గాలతో కూడిన నిర్మాణం ఈ ప్రాజెక్టులో ఉంది.

ఈ ప్రాజెక్టులు కేవలం మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించినవి కావని కేంద్ర మంత్రి అన్నారు. ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి, చుట్టుపక్కల  ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే ముందుచూపును ఇవి సూచిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులను సకాలంలో, అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని.. ప్రస్తుత, భవిష్యత్తు డిమాండ్లను తీర్చేలా వీటిని రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

***



(Release ID: 2046497) Visitor Counter : 21


Read this release in: English , Urdu , Hindi