శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆహార పరిశ్రమలో సింథటిక్ తలతన్య పదార్థాలకు సురక్షిత అతిసూక్ష్మ జీవ ప్రత్యామ్నాయం
Posted On:
14 AUG 2024 4:49PM by PIB Hyderabad
ఆహార తయారీ పరిశ్రమలో వినియోగించే సింథటిక్ తలతన్య (సర్ఫాక్టంట్) పదార్థాలకు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా వ్యవసాయ-పారిశ్రామిక వ్యర్థాల్లోని హరిత పొరల నుంచి తక్కువ ఖర్చుతో అతిసూక్ష్మ జీవ (మైక్రోబియల్) తలతన్య పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చు.
‘సర్ఫాక్టంట్’ అంటే- చమురు-నీరు, నీరు-నూనె, నూనె-వాయువు కలిసిపోకుండా చేసే అణువులు. ఈ పదార్థాలను ఆహార తయారీ పరిశ్రమలో రాపిడి తగ్గించేవి (లూబ్రికెంట్)గా, పిండిలోని కొవ్వును జారుడుగా చేసే ఫోమర్’ (నురగ తెప్పించేది)గా, పదార్థాల నిల్వకాలం పెంచేవిగా, తేమను నిలిపేవిగా వినియోగిస్తారు. అయితే ఈ ప్రక్రియలలో సింథటిక్ పదార్థ సమ్మేళనాలు, ఎమల్సిఫయర్ల వినియోగం మితిమీరుతోంది. దీనివల్ల మానవ శరీరంలోని సూక్ష్మజీవ సమూహంలో అసమతౌల్యం ఏర్పడి, ఉదర సంబంధ రుగ్మతలకు దారితీస్తుంది. అంతేకాకుండా పేగులలో సూక్ష్మజీవ వ్యాప్తిని నియంత్రించే పొర దెబ్బతిని మంచి సూక్ష్మజీవ సమూహం క్షీణతకు కారణమవుతాయి. కాబట్టి, వీటికి ప్రత్యామ్నాయం ఎంతయినా అవసరం.
ఈ నేపథ్యంలో వివిధ సూక్ష్మజీవ మూలాల నుంచి సేకరించే బయో-సర్ఫాక్టంట్లు అధిక జారుడుతనం, కరిగిపోయే గుణం, నురగ తెప్పించే లక్షణం, పీల్చుకునే శక్తి తదితర భౌతిక లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే ఆమ్లత్వం, ఉష్ణోగ్రత, లవణీయత పరంగా విస్తృత శ్రేణిలో చాలా స్థిరంగా ఉంటాయి. అందువల్ల ఆహార తయారీలో వినియోగానికి అనువైనవి. అంతేగాక పర్యావరణ హిత జీవాణువులు కాబట్టి విష ప్రభావాలు ఉండవుగనుక అవి మానవ వినియోగానికి సురక్షితమైనవిగా పరిగణిస్తారు.
ఈ నేపథ్యంలో గువహటిలోని ‘ఐఎఎస్ఎస్‌టి’ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్ కె.ముఖర్జీ, ప్రొఫెసర్ ఎం.ఆర్.ఖాన్, అనుశ్రీ రాయ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఆహార పరిశ్రమలలో బయో-సర్ఫాక్టంట్ల వినియోగాన్ని సునిశితంగా విశ్లేషించడంతోపాటు భారీ వాణిజ్యీకరణకుగల సవాళ్లను కూడా ఎత్తిచూపారు. ఆహార తయారీ పరిశ్రమలలో బేకరీలు, సలాడ్ డ్రెస్సింగ్ వంటివాటిలోపాటు చేపలలో రోగనిరోధక శక్తి పెంచే కూరగాయల నుంచి భార లోహాల తొలగింపు దిశగా కూడా బయో-సర్ఫాక్టంట్లను ఉపయోగించవచ్చు. ఇది వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణలో ప్రభావశీలం కాగలదు. అలాగే ఆహార ఉత్పత్తులు త్వరగా చెడిపోకుండా సహజ యాంటీ-ఆక్సిడెంట్‌గా వీటిని వాడవచ్చు. ఈ పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఫర్ ఫుడ్ కంట్రోల్’ (ఎల్సీవర్)లో ప్రచురించారు.
వ్యవసాయ-పారిశ్రామిక వ్యర్థాల్లోని హరిత పొరల నుంచి తక్కువ ఖర్చుతో బయో-సర్ఫాక్టంట్ల ఉత్పత్తితోపాటు ‘జన్యు ఇంజనీరింగ్, రీకాంబినెంట్ డిఎన్ఎ’ సాంకేతికతలు, నానో-టెక్నాలజీ వినియోగం ద్వారా దిగుబడుల మెరుగుదలకుగల అవకాశాలను ఈ అధ్యయనం అన్వేషించింది. ఆహారంలో బయో-సర్ఫాక్టంట్ల వినియోగానుమతి విధివిధానాల రూపకల్పనకు వీలుగా ఇతర ఆహార పోషకాలతో జోడిస్తే కలిగే విష ప్రభావాలపై లోతైన అధ్యయనంతోపాటు అంచనా మోతాదు, సమ్మేళనల ప్రభావం గురించి కూడా ఈ పరిశోధనాధ్యయనం సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో బయో-సర్ఫాక్టంట్ల ఉత్పత్తి పెంపు, మార్కెట్ విస్తరణ దిశగా పారిశ్రామికవేత్తలతో సమన్వయం చేసుకుంటూ భద్రతపై అంచనాలతో, తక్కువ వ్యయంతో అత్యాధునిక సాంకేతికతల రూపకల్పనపై పరిశోధకులు దృష్టి పెట్టాల్సి ఉంది.
****
(Release ID: 2045522)