ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

స్వాతంత్య్ర దినం నేపథ్యంలో దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

Posted On: 14 AUG 2024 5:07PM by PIB Hyderabad

   భారత 78వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ ఉపరాష్ట్రపతి శ్రీ జ‌గ్‌దీప్ థ‌న్‌కడ్‌  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశమిస్తూ-

   ‘‘సార్వభౌమాధికార భారతదేశానికి పునాది వేసిన అసంఖ్యాక వీరుల నిస్వార్థ త్యాగాన్ని, అమేయ ధైర్యసాహసాలను మనకు గుర్తుకు తెచ్చే ఒక పవిత్ర సందర్భమిది. అలాగే ప్రపంచంలో మన అతిపెద్ద చైతన్యభరిత ప్రజాస్వామ్యానికి బలమైన మూలస్తంభాలుగా నిలిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ పండుగ చేసుకొనే రోజు.

   మన స్వాతంత్య్ర ఉద్యమం పరిరక్షించిన సమున్నత విలువలకు మనను మనం పునరంకితం చేసుకుందాం రండి. మన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని మనం గౌరవించుకొంటున్న క్రమంలో 2047కల్లా ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమిస్తూ ఒక జాతిగా మనం నేటిదాకా సమష్టిగా సాగించిన పయనాన్ని మరోసారి స్ఫురణకు తెచ్చుకుందాం’’ అని పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి సందేశంలో మరికొన్ని ముఖ్యాంశాలిలా ఉన్నాయి:

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు.

   ఈ చరిత్రాత్మక దినం భార‌త్‌ను ఒక సర్వసత్తాక దేశంగా స్థాపించిన అసంఖ్యాక సేనానుల అమేయ సాహసాన్ని, వారి ప్రాణత్యాగాలను గుర్తుకు తెస్తున్నది. స్వాతంత్య్ర దినమంటే అది ప్రపంచంలో కెల్లా అత్యంత విశాలమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉంటున్న న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాత్రం వంటి మన విలువలపై గర్వించే సందర్భం.

   రండి... మన స్వాతంత్య్ర సంగ్రామం తాలూకూ ఉన్నతాదర్శాలపై మన నిబద్ధతను సుదృఢం చేసుకుందాం. అలాగే, స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని సంరక్షించుకోవడంతో పాటు ఒక దేశంగా మన సామూహిక పయనాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకొని 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసుకునే కృషిని కొనసాగిద్దాం.

 

****



(Release ID: 2045464) Visitor Counter : 16