గనుల మంత్రిత్వ శాఖ
దేశ ఖనిజాన్వేషణ రంగం బలోపేతానికి కేంద్ర గనులశాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కీలక చర్యలు
Posted On:
12 AUG 2024 8:13PM by PIB Hyderabad
భారతదేశ ఖనిజాన్వేషణ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ ( నేషనల్ మినరల్ ఎక్స్ ప్లొరేషన్ ట్రస్ట్ , ఎన్ ఎం ఇటి) 6వ పాలకమండలి సమావేశాన్ని న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24కు సంబంధించి ఎన్ ఎం ఇటి నిర్వహణను మంత్రి సమగ్రంగా సమీక్షించారు.
ఎన్ ఎం ఇటి 2023-24 వార్షిక నివేదికను కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే పాల్గొన్నారు. ఖనిజాన్వేషణలో ఎన్ ఎంఇటి సాధించిన ప్రధాన విజయాలను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేశ ఖనిజ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్ ఎంఇటి చూపుతున్న అంకితభావాన్ని ఈ నివేదికలో తెలియజేశారు.
కీలకమై మార్పులు
1. ఎన్ జి డి ఆర్ పోర్టల్ బలోపేతం
వనరుల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేయడానికి, దేశాభివృద్ధికోసం చేపట్టిన వ్యూహాత్మక చర్యల్లో భాగంగా నేషనల్ జియోసైంటిఫిక్ డేటా రిపాజిట్రీ ( ఎన్ జి డి ఆర్) పోర్టల్ ను బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కారణంగా కేంద్ర గనుల శాఖ మార్గదర్శకత్వంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైడ్రో కార్బన్స్ డైరెక్టేరేట్, అణుశక్తి విభాగం మధ్యన ఎలాంటి అవాంతరాలు లేని సహకారం కొనసాగి జియో సైంటిఫిక్ సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది. దేశ ప్రయోజనాలకోసం జియో సైంటిఫిక్ సమాచార వినియోగం జరగడంలో ఈ సహకారం కీలకం.
2. రీ ఎంబర్స్ మెంట్ పథకాలు
ఖనిజాన్వేషణ ఖర్చుల పాక్షిక రీ ఎంబర్స్ మెంట్ కోసం సవరించిన పథకాన్ని ఎన్ ఎం ఇటి పాలక మండలి ఆమోదించింది. ఈ నిర్ణయంతో కాంపోజిట్ లైసెన్స్ దారుల రీ ఎంబర్స్ మెంట్ పరిమితి రూ.8 కోట్లకు చేరుకుంటుంది. జూనియర్ మైనింగ్ కంపెనీలను ప్రోత్సహించడంకోసం నూతన రీ ఎంబర్స్ మెంట్ పథకానికి శ్రీ కిషన్ రెడ్డి ఆమోదం పలికారు. తద్వారా ఖనిజాన్వేషణ లైసెన్స్ దారులకోసం రూ.20 కోట్లను ఆఫర్ చేశారు. దేశవ్యాప్తంగా ఖనిజాన్వేషణ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, ముందుకు తీసుకుపోవడానికి ఈ నిర్ణయాలు చాలా ముఖ్యం.
3. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు, స్టార్టప్ లకు మద్దతు
వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో ఖనిజాన్వేషణను చురుగ్గా ముందుకు తీసుకుపోవడం కోసం ఎన్ ఎం ఇటి ఆయా కంపెనీలకు నిర్దేశిత ఛార్జీలకంటే 1.25 రెట్ల ఎక్కువ చెల్లిస్తోంది. అంతే కాదు కేంద్ర గనుల శాఖకు చెందిన ఎస్ అండ్ టి ప్రిజమ్ పథకం కింద స్టార్టప్ లు, ఎంఎస్ ఎంఈలకు అవసరమైన కీలక సహాయాన్ని ఎన్ ఎం ఇటి కొనసాగిస్తోంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలైన కృత్రిమ మేధ, ఆటోమేషన్, డ్రోన్ సాంకేతికతలపైన దృష్టి పెట్టడం జరుగుతుంది.
4. కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజాన్వేషణ కోసం ప్రోత్సాహకాలు
ఖనిజాన్వేషణ రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కీలకమైన, వ్యూహాత్మకమైన ఖనిజాల అన్వేషణలో పని చేస్తున్న సంస్థలకు 25 శాతం ఖనిజాన్వేషణ ప్రోత్సాహకాలను కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రకటించారు. కీలకమైన ప్రాంతాల్లో ఖనిజాన్వేషణ కార్యక్రమాలను గణనీయంగా పెంచడానికి ఈ ప్రోత్సాహకాలు దోహదం చేస్తాయి. తద్వారా దేశానికి ఖనిజ వనరుల్లో స్వయంసమృద్ధి కలుగుతుంది.
ఎన్ ఎం ఇటి విధానాల ప్రకారం మైనర్ ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడంకోసం ఆయా రాష్ట్రాలు ఖనిజాన్వేషణ సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటుందని, అలాంటి వ్యవస్జలను ఇప్పటికే ప్రారంభించిన రాష్ట్రాల నమూనాలను అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు ఆయన సూచించారు.
గనుల రంగంలో స్టార్టప్ లనుప్రోత్సాహించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో ఈ పని చేయాలని అన్నారు. ఎన్ ఎం ఇటికి చెందిన వివిధ పథకాలపైన చైతన్యాన్ని పెంపొందించడంకోసం వర్క్ షాపులను, రోడ్ షోలను నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్ ఎం ఇటి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చూడాలని అన్నారు. .
జమ్ము కశ్మీర్ లోను, ఖనిజ సంపద అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనూ చేపట్టిన అన్ని ఖనిజాన్వేషణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అన్నారు. స్వయంసమృద్ధి సాధనలో భారత్ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని సహకార సమాఖ్య విధానాన్ని శ్రీ కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే వివిధ ఖనిజాన్వేషణ సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశంలో ఖనిజాన్వేషణను తర్వాతి దశకు తీసుకుపోయిన ఘనత ఎన్ ఎం ఇటిదేనని ప్రశంసించారు. గనులరంగంలో ఆత్మనిర్భరతను తీసుకురావడానికి భాగస్వాములందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్ ఎంఇటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికిగాను రాష్ట్రాల స్థాయిలో సెమినార్లను, వర్క్‌షాపులను నిర్వహించాల్సిన ఆవశ్యకత వుందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఖనిజాన్వేషణ రంగం బలోపేతానికి కావాల్సిన దృఢమైన వ్యూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. తద్వారా సుస్థిర అభివృద్ధి, సమర్థవంతమైన వనరుల వినియోగం జరుగుతుంది. ఆవిష్కరణల్ని, ఆధునిక సాంకేతికతల్ని ప్రోత్సహించడానికి కేంద్ర గనుల శాఖ నిబద్దతతో కృషి చేస్తోంది. దేశాభివృద్ధికి అవసరమైన కీలక ఖనిజాల అన్వేషణను చేపడుతోంది.
***
(Release ID: 2044931)
Visitor Counter : 54