కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికామ్ సేవలందించే సంస్థ‌ల రెగ్యులేట‌రీ విభాగాధిపతుల‌తో ట్రాయ్ ఛైర్మ‌న్‌ స‌మావేశం

Posted On: 08 AUG 2024 7:56PM by PIB Hyderabad

   టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశంలోని అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (టిఎస్‌పి) రెగ్యులేటరీ అధిపతులతో ఇవాళ సమావేశమైంది. ట్రాయ్‌ ఛైర్ ప‌ర్స‌న్ అద్య‌క్ష‌త‌న సాగిన ఈ స‌మావేశంలో ఎయిర్ టెల్, బిఎస్ ఎన్ ఎల్‌, క్వాడ్రెంట్ టెలివెంచ‌ర్స్ లిమిటెడ్ (క్యుటిఎల్‌), రిల‌య‌న్స్ జియో, టాటా స‌ర్వీసెస్ లిమిటెడ్‌, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌, వి-కాన్ మొబైల్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల చీఫ్ రెగ్యులేట‌రీ ఆఫీస‌ర్లు పాల్గొన్నారు. అయితే, ఎంటిఎన్ ఎల్‌, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరు కాలేదు.

ఈ సందర్భంగా కింది అంశాలపై సమావేశం చర్చించింది:

  1. పిఆర్ఐ/ఎస్ఐపి లేదా బ‌ల్క్ క‌నెక్ష‌న్ల ద్వారా అధిక మొత్తంలో వాణిజ్య స‌మాచారం పంపుతున్న సంస్థ‌ల స్పామ్ కాల్స్‌.
  2. డిఎల్ టి ప్లాట్ ఫామ్‌కు బ‌ల్క్ కాల్స్ చేస్తున్న టెలిమార్కెట‌ర్లు, సంస్థ‌ల మైగ్రేష‌న్‌.
  3. సందేశాల‌ జాడ‌కోసం ఎంటిటీ అండ్ టెలిమార్కెట‌ర్ చెయిన్ బైండింగ్‌
  4. మోసపూరిత లింకులుగల సందేశాల నిరోధం కోసం యుఆర్ఎల్ వైట్ లిస్టింగ్‌.

అన్ని అంశాలపై లోతుగా చర్చించిన అనంతరం సమావేశం కింది నిర్ణయాలు తీసుకుంది:

  1. స్పామ్ కాల్స్ ద్వారా ఏ సంస్థ‌యినా త‌న ఎస్ఐపి/పిఆర్ఐ లైన్ల‌ను దుర్వినియోగం చేస్తే సదరు సంస్థ‌ సంబంధిత అన్ని టెలికామ్ వ‌న‌రుల‌ను సంబంధిత టెలికామ్ సేవ‌ల సంస్థ (టిఎస్ పి) నిలిపివేసి, బ్లాక్ లిస్ట్ లో వుంచాలి. ఈ స‌మాచారాన్ని స‌ద‌రు టిఎస్ పి ఇత‌ర టిఎస్ పిల‌తో పంచుకోవాలి. త‌ద్వారా ఇత‌ర టిఎస్ పిలు కూడా ఆ సంస్థ‌కు తమ టెలికామ్ సేవ‌లన్నింటినీ నిలిపివేసి, రెండేళ్లపాటు బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఈ వ్యవధిలో ఎలాంటి కొత్త టెలికామ్ వ‌న‌రుల‌నూ ఆ సంస్థ‌కు ఏ టిఎస్ పి అందించ‌రాదు.
  2. ఇకపై 2024 సెప్టెంబ‌ర్ 1 నుంచి వైట్ లిస్ట్ కాని యుఆర్ఎల్ లు, ఏపీకెల‌నుంచి ఏ సందేశాన్నీ అనుమ‌తించ‌రాదు.
  3. సందేశ ప్ర‌వాహ జాడ‌ను పసిగట్టేలా ఎంటిటీ అండ్ టెలిమార్కెట్ ఛైన్ బైండింగ్ సాంకేతిక విధానాన్ని 2024 అక్టోబ‌ర్ 31నాటికి టిఎస్ పి లు అమలులోకి తేవాలి.

   వాయిస్ కాల్స్/ రోబో కాల్స్/ ప్రి రికార్డెడ్ కాల్స్ కోసం  ఆర్ఐ/ఎస్ఐపి క‌నెక్ష‌న్ల‌ను వాడే స్పామ‌ర్లపై ఎలాంటి జాప్యం లేకుండా అత్యవసర ప‌టిష్ట‌ చర్య‌లు చేప‌ట్టాల‌ని ట్రాయ్ స్పష్టం చేసింది. అలాగే స్పామ్ కాల్స్ స‌మ‌స్య‌ పరిష్కారం దిశగా ట్రాయ్ కృషికి పూర్తి మద్దతిస్తామని అన్ని టిఎస్ పీలు హామీ ఇచ్చాయి. ట్రాయ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌న్నిటినీ నిర్దేశిత గడువులోగా అమ‌లు చేస్తామ‌ని తెలిపాయి.

***


(Release ID: 2044184) Visitor Counter : 42


Read this release in: English , Urdu , Hindi