బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గ్యాసిఫికేషన్

Posted On: 07 AUG 2024 4:18PM by PIB Hyderabad

   ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లో బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సంపోషక ఆర్థిక సహాయం (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్-విజిఎఫ్) దిశగా ప్రభుత్వం రూ.8500 కోట్లతో ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇది మూడు కేటగిరీ ప్రాజెక్టులకు వర్తిస్తుంది:

  • కేటగిరీ 1: ఇది ప్రభుత్వరంగ సంస్థలకు ఉద్దేశించినది. ఈ కేటగిరీ కింద కేటాయించిన రూ.4050 కోట్ల నుంచి ఆ సంస్థలు ఆర్థిక సహాయం కోసం ప్రతిపాదనలు పంపవచ్చు. తదనుగుణంగా ఎంపిక చేసుకున్న 3 ప్రాజెక్టులపై గరిష్టంగా రూ.1350 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం గ్రాంటు... ఏది తక్కువైతే ఆ మొత్తం మంజూరవుతుంది.
  • కేటగిరీ 2: ఇది ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలు రెండింటికీ ఉద్దేశించినది. దీనికింద రూ.3,850 కోట్లదాకా సహాయం అందించేందుకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఇందులో నుంచి ప్రాజెక్టు వ్యయం కింద రూ.1,000 కోట్లు లేదా మొత్తం వ్యయంలో 15 శాతం... ఏది తక్కువైతే ఆ మొత్తం మంజూరవుతుంది.
  • కేటగిరీ 3: ఇది చిన్నతరహా ప్రాజెక్టులకు ఉద్దేశించినది. దీనికింద రూ.600 కోట్లదాకా ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. ఆ మేరకు ఒక్కొక్కటి రూ.100 కోట్లు లేదా మొత్తం వ్యయంలో 15 శాతం... ఏది తక్కువైతే ఆ మొత్తం మంజూరవుతుంది.

   ఈ విధానానికి అనుగుణంగా 3 కేటగిరీల కింద బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు (ఆర్ఎఫ్‌పి) పంపాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ‘ఆర్ఎఫ్‌పి’లు ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద ఒప్పందం అమలు తేదీ నుంచి 5 సంవత్సరాలపాటు చెల్లుబాటవుతాయి. నిర్దేశిత వ్యవధి ప్రకారం- బిడ్‌ సమర్పణ తేదీ 2024 నవంబర్ 11 కాగా, ఒప్పందం అమలు తేదీ 2025 మే 13గా ఉంటుంది. తద్వారా 2030 మే నెల నాటికి దేశంలో వాణిజ్య స్థాయి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు రూపొందుతాయని అంచనా.

   కేంద్ర బొగ్గు-గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

***


(Release ID: 2043406) Visitor Counter : 76