సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లింగమార్పిడి వ్యక్తుల సంక్షేమం

Posted On: 07 AUG 2024 3:03PM by PIB Hyderabad

   లింగ మార్పిడి వ్యక్తుల (ట్రాన్స్‌ జెండర్) సమస్యల పరిష్కారం దిశగా వారి హక్కులు, సంక్షేమం కోసం ‘ట్రాన్స్‌ జెండర్ల (హక్కుల పరిరక్షణ) చట్టం-2019తో పాటు సంబంధిత నియమావళిని కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వారి ఆత్మగౌరవానికి భంగం కలగని రీతిలో, సమాజంలో గౌరవ స్థానం లభించేందుకు భరోసా ఇచ్చేవిధంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను రూపొందించాలని ఈ చట్టం, నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అలాగే విద్యాసంస్థలు, ఉపాధితోపాటు ఆరోగ్య సంరక్షణ సేవల్లోనూ వివక్షకు తావుండరాదని ఆదేస్తున్నాయి. దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ‘ఇతర’ వర్గం కింద లింగ మార్పిడి వ్యక్తుల సంఖ్య 4,87,803 కాగా, ఇందులో వారితోపాటు ఆ వర్గంలో తమనూ చేర్చాలని కోరినవారు కూడా అంతర్భాగంగా ఉన్నారు.

ట్రాన్స్‌ జెండర్ల సంక్షేమంతోపాటు వారిని ప్రధాన సామాజిక స్రవంతిలో చేర్చేదిశగా అమలు చేస్తున్న ప్రణాళికలు-పథకాలు కిందివిధంగా ఉన్నాయి:

  1. ‘జాతీయ ట్రాన్స్‌ జెండర్ల మండలి’ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 16.11.2023న ప్రకటన జారీ చేసింది. వారికి సంబంధించిన విధానాలు, చట్టాల రూపకల్పనతోపాటు సమానత్వం, సంపూర్ణ భాగస్వామ్యంపై ఈ మండలి సూచనలు, సిఫారసులు చేస్తుంది. అలాగే ఆయా విధానాల ప్రభావంపై పర్యవేక్షణ సహా అన్ని ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థలు/విభాగాల కార్యకలాపాలపై సమీక్ష-సమన్వయం బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంది.
  2. ట్రాన్స్ జెండర్ల సంక్షేమంలో భాగంగా ‘‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ (ఎస్ఎమ్ఐఎల్ఇ) పథకాన్ని’’ ప్రభుత్వం రూపొందించింది. దీనికింద ఉప పథకంగా ‘ట్రాన్స్‌ జెండర్ల సంక్షేమ-సమగ్ర పునరావాసంపై కేంద్ర ప్రాయోజిత పథకం’ అమలవుతోంది. దీంతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య బీమా దిశగా ‘కాంపోజిట్ మెడికల్ హెల్త్’, ‘గరిమ గృహం’ పేరిట సురక్షిత ఆశ్రయాలు, ధ్రువీకరణ జారీ కోసం జాతీయ పోర్టల్, పరిరక్షణ సమితుల ఏర్పాటు, ఇతర సంక్షేమ చర్యలు వంటివి ప్రధాన పథకంలో భాగంగా అమలువుతున్నాయి.
  3. ప్రధానమంత్రి జనారోగ్య యోజన (పిఎం-జెఎవై) కింద ఆరోగ్య సేవల కోసం ‘ఎన్‌హెచ్ఎ‘ ఆధ్వర్యంలోని ‘ఆయుష్మాన్ భారత్ పథకం’ జోడించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
  4. అనాథలైన ట్రాన్స్‌ జెండర్ల కోసం ఢిల్లీ, ఒడిషా, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, బిహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ (2), మహారాష్ట్ర (3) తదితర 9 రాష్ట్రాల్లో 12 గరిమ గృహాలను మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది.
  5. ట్రాన్స్‌ జెండర్లకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డుల జారీకి జాతీయ పోర్టల్ ఏర్పాటైంది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా దరఖాస్తు నుంచి జారీ అయిన ధ్రువీకరణ పత్రం డౌన్‌లోడ్ దాకా ఈ ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తవుతుంది. ఈ పోర్టల్‌ను ఇప్పటిదాకా 45 లక్షల మందికిపైగా సందర్శించిన నేపథ్యంలో 21,330 ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి.
  6. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, అండమాన్- నికోబార్, సిక్కిం, పంజాబ్, మిజోరం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటిదాకా 11 ట్రాన్స్‌ జెండర్ పరిరక్షణ సమితులు ఏర్పాటయ్యాయి.
  • VII. అలాగే రాజస్థాన్, మిజోరం, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బిహార్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, అస్సాం, తమిళనాడు, జమ్ముకశ్మీర్, అండమాన్-నికోబార్ తదితర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటిదాకా 19 ట్రాన్స్‌ జెండర్ సంక్షేమ బోర్డులు (టిడబ్ల్యుబి) ఏర్పాటయ్యాయి.
  1. ఫిర్యాదుల పరిష్కార అధికారి నియామకం, ట్రాన్స్‌ జెండర్లపై వివక్షను నిరోధం దిశగా లింగ సంబంధ సమాచార సేకరణలో పురుషులు-మహిళల వర్గంతోపాటు ‘ట్రాన్స్‌ జెండర్’ వర్గం జోడింపు వంటి అంశాలపై కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలతోపాటు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచనాత్మక ఆదేశాలు జారీ అయ్యాయి.
  2. ట్రాన్స్‌ జెండర్లకు సమాజంలోని ఇతరులందరితో సమాన ఉపాధి అవకాశాల కల్పన దిశగా ‘లింగమార్పిడి వ్యక్తులకు సమానావకాశాల కల్పన విధానం’ కూడా మంత్రిత్వశాఖ ద్వారా అమలవుతోంది.

   కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

***


(Release ID: 2043084) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi , Tamil