కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మరణించిన రోగి అవయవాలను తీసి వాటిని ఇతరులకు తిరిగి అమర్చే ప్రక్రియను సంస్థలోనే మొట్టమొదటిసారి చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిన హైదరాబాద్, సనత్ నగర్ లోని ఇఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
Posted On:
07 AUG 2024 1:37PM by PIB Hyderabad
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న ఇఎస్ఐసి లో ఒక రోగి, మరో ముగ్గురు రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించారు. సనత్ నగర్ లోని ఇఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య విజ్ఞాన శాస్త్ర రంగంలోను, ఒక వ్యక్తి అవయవాలను మరో వ్యక్తి శరీరంలో అమర్చడంలోను ప్రతిష్టాత్మకమైన ఘనకార్యాన్ని సాధించింది. మంగళవారం (2024 ఆగస్టు 6న) ఈ ఆసుపత్రి లో మరణించిన ఒక వ్యక్తి శరీరంలో నుంచి అవయవాలను విజయవంతంగా వెలికితీసి వాటిని ఇతర వ్యక్తుల శరీరాల్లో అమర్చే ప్రక్రియను విజయవంతంగా ముగించింది. ఇది ఈ ఆసుపత్రిలో లభించే వైద్య చికిత్స సంబంధ సేవల సామర్థ్యాలలో గణనీయ పురోగతి ని, రోగుల ప్రాణరక్షణ లో సంస్థ నిబద్ధతను సూచిస్తోంది.
హైదరాబాద్, సనత్ నగర్ లోని ఇఎస్ఐసి ఆసుపత్రిలో ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించిన 45 ఏళ్ళ పురుషుడు అవయవ దాత. రోగి యొక్క అటెండెంట్ లతో డాక్టర్ శాంసన్ నాయకత్వంలోని నాడీ శస్త్ర చికిత్స వైద్యబృందం మాట్లాడి, పవిత్రమైన అవయవ దానాన్ని గురించి వారికి అర్థమయ్యేటట్లు చెప్పి వారిని ఒప్పించి, సదరు అవయవ దానానికి అవసరమైన సమ్మతిని పొందింది. ఇఎస్ఐసి కి అవయవాల కేటాయింపు ‘జీవన్ దాన్’ మాధ్యమం ద్వారా వీలైంది. ఒక మూత్రపిండాన్ని 50 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళా రోగి స్వీకరించారు. ఇఎస్ఐసి లబ్ధిదారులలో ఆమె ఒకరు. ఆమె గత నాలుగు సంవత్సరాలుగా రక్తశుద్ధి చికిత్సను పొందుతున్నారు. మరొక మూత్రపిండంతో పాటు, కాలేయాన్ని ఉస్మానియా సార్వజనిక ఆసుపత్రికి కేటాయించగా అక్కడ మరో ఇద్దరు, దాత అవయవాల తాలూకు ప్రయోజనాన్ని స్వీకరించారు. ఫలితంగా వారికి కూడా ప్రాణదానం చేసినట్లు అయింది.
అవయవాలను స్వీకరించి, అమర్చే ప్రక్రియలో డాక్టర్ మధు, డాక్టర్ సందీప్ లు సహా వారి బృందాలు శ్రమించాయి. సనత్ నగర్ ఇఎస్ఐసి ఆసుపత్రిలో దాత శరీరం నుంచి అవయవాలను సేకరించే కార్యాన్ని చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ లు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పాండు రంగారావు లు పూర్తి చేశారు. అనస్థీషియా బృందానికి డాక్టర్ నాగార్జున, నెఫ్రాలజీ బృందానికి డాక్టర్ ధనలక్ష్మి లు నాయకత్వం వహించారు.
ఇఎస్ఐసి లో ఇప్పుడు మరొక దారి తెరచుకొందన్నమాట; ‘జీవన్ దాన్’ నుంచి ఇఎస్ఐసి తన వంతుగా అవయవాల కేటాయింపును ఇక పొంద గలుగుతుంది, తద్ద్వారా మరింత మంది రోగులు వారికి తప్పనిసరైన అవయవాల అమరిక కు సిద్ధమై ఆరోగ్యప్రదమైన సాధారణ జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మేలు మలుపు ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో, శ్రద్ధతో నిర్వహించడమైంది. దీనిలో భాగంగా మృతుని శరీరంలో నుంచి మూత్రపిండాన్ని వేరు చేసి, తరువాత దానిని ఆ శరీర భాగం తప్పనిసరి అవసరమైన, బీమా సదుపాయాన్ని కలిగివున్న వ్యక్తి కి అమర్చారు. ఈ కార్యసాధన అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు, ఆ అవయవాలను ఇతర అవసరార్థులకు అమర్చడానికి ఆసుపత్రి చాటుకొంటున్న తన అంకితభావాన్ని స్పష్టం చేయడం ఒక్కటే కాకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన జటిల వైద్య చికిత్స ప్రక్రియలను నిర్వహించడంలో ఆసుపత్రికి ఉన్న శక్తియుక్తులను కూడా నిరూపించింది. మృత వ్యక్తి శరీరం నుంచి అవయవాల సేకరణ ప్రక్రియ ను వైద్యులు, పాలన యంత్రాంగం, నర్సులు, పారా- మెడికల్ సిబ్బంది ల మధ్య ప్రణాళికా కౌశలం, సమన్వయం ల కలబోత తో సంస్థలోనే (in-house) పూర్తి చేయగలిగారు. దీనికి అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు, అంకిత భావం కలిగిన వైద్య వృత్తి నిపుణుల ప్రావీణ్యం అవయవాల సేకరణ మొదలు పున:ప్రాప్తి (retrieval) వరకు యావత్తు ప్రక్రియను అత్యంత సమర్థంగా, కరుణామయ దృష్టితో చేపట్టి కొలిక్కి తేవడమైంది.
ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, వినూత్న విధానాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇఎస్ఐసి లబ్ధిదారులకు సేవలను మెరుగుపరచడానికి హైదరాబాద్, సనత్ నగర్ లోని ఇఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుబడి ఉంది. ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేయడంతో ఆసుపత్రి సామర్ధ్యాలను పెంచుకొనే దిశలో, జనసముదాయానికి అత్యున్నత వైద్య సేవలను అందించడంలో తాను చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పట్టినట్లు అవుతోంది.
***
(Release ID: 2042897)
Visitor Counter : 67