సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఇండియన్ కన్జర్వేషన్ ఫెలోషిప్ కార్యక్రమం (ఐసిఎఫ్‌పి)
Posted On:
05 AUG 2024 2:02PM by PIB Hyderabad
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ న్యూయార్కులోని ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ (ఎంఎంఎ), నెదర్లాండ్స్‌లోని ‘స్టిచింగ్ రెస్టారటి అట్లియర్ లింబుర్గ్’ (ఎస్ఆర్ఎఎల్)ల సహకారంతో ‘ఇండియన్ కన్జర్వేషన్ ఫెలోషిప్ పైలట్ కార్యక్రమం (ఐసిఎఫ్‌పిపి) చేపట్టింది. ఈ మేరకు ‘ఎంఎంఎ’తో రెండేళ్ల కాలానికిగాను 19.03.2013న ఒక ఒడంబడిక (ఎంఒఎ) కుదుర్చుకుంది.
ఆ ఒడంబడికకు కాలం తీరిపోయిన నేపథ్యంలో ‘ఎంఎంఎ’ సహకారంతో 2016 నుంచి 2021 వరకు ‘ఐసిఎఫ్‌పి’ నిర్వహణ కోసం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 27.06.2016న కొత్త అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అమలులో భాగంగా ‘ఎంఎంఎ’తోపాటు ‘ఎస్ఆర్ఎఎల్’ నెదర్లాండ్స్ సహా ‘రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్’, బ్రసెల్స్ (కెఐకె-ఐఆర్‌పిఎ); ‘ఫ్రీర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్’; ‘ఆర్థర్ ఎం సాక్లర్ గ్యాలరీ’; ‘ది స్మిత్సోనియన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్’, వాషింగ్టన్ డి.సి (ఎఫ్‌జి)ల సహకారం, ఆండ్రూ డబ్ల్యు.మెలాన్ ఫౌండేషన్ మద్దతుతో
‘ఐసిఎఫ్‌పి’ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ వచ్చింది.
ఈ మేరకు ‘ఐసిఎఫ్‌పి’ కింద ఇప్పటిదాకా భారత్ నుంచి 36 మంది (వీరిలో 17 మందికి ప్రయోగాత్మక కార్యక్రమం కింద శిక్షణ) మ్యూజియంల సంరక్షకులు శిక్షణ పొందారు. స్వదేశీ మ్యూజియంలలోని కళాఖండాల మెరుగైన సంరక్షణ దిశగా వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా అంతర్జాతీయ అనుసంధానం ద్వారా ఈ రంగంలోని నిపుణులతో భారతదేశంలో ధృడమైన సంరక్షక సమూహాన్ని రూపొందించాలన్నది దీని ధ్యేయం.
ఈ పరిశోధక సభ్యత్వ శిక్షణ పొందినవారికి సంరక్షణ నైపుణ్యం, విజ్ఞాన భాగస్వామ్యం, నెట్‌వర్కింగ్, నాయకత్వ వికాసం, వ్యవస్థాగత సామర్థ్యం, సామాజిక సంబంధాలు, పరిశోధన-పత్రాల రూపకల్పన, ప్రాజెక్టుల ప్రామాణీకరణ, మార్గదర్శకత్వం, వృత్తిపరంగా ప్రగతి తదితర అంశాల్లో పరిణతి లభిస్తుంది. వారినుంచి ఈ సామర్థ్య ఫలితాలు రాబట్టడం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ‘ఐసిఎఫ్‌పి’ గణనీయ ప్రభావం ప్రస్ఫుటమవుతుంది.
ఈ కార్యక్రమం కింద నైపుణ్య శిక్షణ పొందినవారి ద్వారా మ్యూజియంలకు ఒనగూడే మరికొన్ని ప్రయోజనాలు:
- సేకరించిన ఫొటోల పునర్వ్యవస్థీకరణ
- ఎగ్జిబిషన్ నిర్వహణలో మద్దతు
- పరిశోధనల పెంపు
- రిసోర్స్ సెంటర్
- విపత్తు నుంచి కోలుకునే విధానాల మెరుగుదల
- సిబ్బందికి సాధికారత
- విభిన్న కమ్యూనికేషన్ మార్గాలు
కాగా, ‘ఎంఎంఎ’, న్యూయార్క్‌తో 27.06.2016నాటి అవగాహన ఒప్పందం 2016 నుంచి 2021 వరకు ‘ఇండియన్ కన్జర్వేషన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్’ నిర్వహణకు మాత్రమే పరిమితం.
ఈ వివరాలను కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ వెల్లడించారు.
***
(Release ID: 2042082)
Visitor Counter : 51