జల శక్తి మంత్రిత్వ శాఖ
పైపులైన్ల ద్వారా కొళాయి నీటి సరఫరా
దాదాపు 1.28 లక్షల గ్రామాలకు ‘హర్ ఘర్ జల్’ ధ్రువీకరణ
Posted On:
05 AUG 2024 1:54PM by PIB Hyderabad
వివిధ రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇంటింటికీ కొళాయి నీరు’ (హర్ ఘర్ నల్ జల్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కాగా, 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంభమయ్యే నాటికి దేశంలో 3.23 కోట్ల (16.8శాతం) గ్రామీణ గృహాలకు మాత్రమే కొళాయి నీరు అందేది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల గణాంకాల ప్రకారం- 01.08.2024 నాటికి అదనంగా సుమారు 11.80 కోట్ల ఇళ్లకు ఈ సదుపాయం కలిగింది. ఆ మేరకు 01.08.2024 నాటికి మొత్తం 19.32 కోట్ల గ్రామీణ గృహాలకుగానూ 15.03 కోట్లకుపైగా (77.83 శాతం) ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు.
ప్రస్తుతం 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘ఇంటింటికీ కొళాయి నీరు’ (హర్ ఘర్ నల్ జల్) కార్యక్రమం 100 శాతం పూర్తయినట్లు ధ్రువీకరణ పొందాయి. మిగిలిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మిషన్ లక్ష్యాల సాధనకు చేరువలో ఉన్నాయి. ఈ పథకం అమలుపై ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారీ గణాంకాలను జెజెఎం డ్యాష్‌బోర్డులో ఈ లింక్ ద్వారా చూడవచ్చు: https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
నీటి ఎద్దడి, కరవు పీడిత, ఎడారి ప్రాంతాల్లో సరిపడా తాగునీటి వనరులు లేకపోవడం, భూగర్భ జలాల్లో భౌగోళిక కలుషితాలు చేరడం, అసమాన భూభాగం, చెల్లాచెదురుగాగల గ్రామీణ ఆవాసాలు, కొన్ని రాష్ట్రాల్లో వాటా నిధుల విడుదలలో జాప్యం, పనులు చేపట్టే సంస్థలు/గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా పథకాలపై తగిన ప్రణాళిక/నిర్వహణ/యాజమాన్య సామర్థ్యం లోపించడం, ముడి సరుకుల ధరలు పెరగడం, చట్టపరమైన/ఇతరత్రా అనుమతులు పొందడంలో జాప్యం వంటి అనేక సమస్యలు ఈ పథకానికి అవరోధాలుగా మారాయి.
ఈ సవాళ్లన్నిటి సమగ్ర పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తదనుగుణంగా మూలధన పెట్టుబడి ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రిత్వశాఖ ద్వారా 50 ఏళ్ల వ్యవధితో వడ్డీ రహిత రుణం రూపంలో రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందిస్తోంది. చట్టపరమైన/ఇతరత్రా అనుమతుల దిశగా కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, సంస్థలతో సమన్వయం కోసం ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్ అధికారి నియామకం, రాష్ట్ర/జిల్లా స్థాయి కార్యక్రమ నిర్వహణ యూనిట్ల (ఎస్‌పిఎంయు/డిపిఎంయు) ఏర్పాటు, సాంకేతిక నిపుణుల కొరత పరిష్కారానికి స్థానిక నిపుణుల లభ్యత, కార్యక్రమ నిర్వహణకు మానవ వనరుల అధికారి నియామకం దిశగా ‘నల్ జల్ మిత్ర’ కార్యక్రమం అమలు వంటి చర్యలు తీసుకుంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్‌జిఎస్), ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ (ఐడబ్ల్యుఎంపి), ఆర్ఎల్‌బీలు, పీఆర్ఐలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు సహా రాష్ట్ర పథకాలు, ‘సిఎస్ఆర్’ నిధులు వంటివాటిని సమన్వయం చేసుకుంటూ బోరుబావుల పునరుద్ధరణ కోసం ప్రత్యేక నిర్మాణాలు, వర్షజల పునఃపూరకం, ఇప్పటికేగల జలవనరుల పునరుద్ధరణ, గృహ వినియోగ నీటి పునర్వినియోగం తదితర చర్యలు చేపట్టి జల వనరుల మూలాల పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో జల సంరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా జల్ శక్తి అభియాన్: వర్షాన్ని ఒడిసిపట్టండి (క్యాచ్ ది రెయిన్-జేఎస్ఏ:సీటీఆర్) కార్యక్రమాన్ని 2019లో దేశంలోని 256 నీటి ఎద్దడి జిల్లాల్లో జలశక్తి మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ముఖ్యంగా తాగునీటి లభ్యతలో సుస్థిర నీటి నిర్వహణ ప్రాధాన్యాన్ని గురిస్తూ ‘తాగునీటి కోసం జల వనరుల మూలాల సుస్థిరత’ ఇతివృత్తంగా ‘జెఎస్ఒ-సిటీఆర్’ను 2023లో అమలులోకి తెచ్చింది. అలాగే జల సంరక్షణలో మహిళల కీలక పాత్రను నొక్కిచెబుతూ 2024లో ‘నారీశక్తి నుంచి జలశక్తిదాకా’ ఇతివృత్తంతో 09.03.2024 నుంచి 30.11.2024 వరకు ‘జెఎస్ఎ’ను అమలు చేస్తుంది.
‘జెజెఎం’ మార్గదర్శకాల ప్రకారం- ఒక గ్రామంలో అన్ని ఇళ్లకూ కొళాయి నీటి కనెక్షన్లు ఇవ్వడం పూర్తయ్యాక ఈ పథకం బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ విభాగం ఆ గ్రామంలో పనులు పూర్తయినట్లు పంచాయతీకి ధ్రువీకరణ ఇస్తుంది. తద్వారా ఆ గ్రామాన్ని ‘జెజెఎం-ఐఎంఐఎస్’ ఇంటింటికీ కొళాయి నీటి సరఫరా అవుతున్న గ్రామంగా (హర్ ఘర్ నల్ జల్) గుర్తిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా గ్రామాలు తమ గ్రామసభ సమావేశంలో పని పూర్తి నివేదికను చదివి వినిపించి, ఇంటింటికీ కొళాయి నీరు సరఫరా అవుతున్న గ్రామంగా స్వీయ ధ్రువీకరణను పంచాయతీలు అధికారికంగా తీర్మానిస్తాయి. ఈ పథకాన్ని అమలుచేసిన ప్రభుత్వ విభాగం ధ్రువీకరణ పత్రం, గ్రామసభ ఆమోదిత తీర్మానం, గ్రామసభ నిర్వహణ.. అన్నిటికీ సంబంధించిన ఒక చిన్న వీడియోను ‘జెజెఎం’ డ్యాష్‌బోర్డులో ఉంచుతారు. తర్వాత ఆ గ్రామాన్ని ‘జెజెఎం-ఐఎంఐఎస్’లో ధ్రువీకరిస్తారు.
దేశవ్యాప్తంగా 01.08.2024 నాటికి సుమారు 2.31 లక్షల గ్రామాలు ఇంటింటికీ కొళాయి నీరు సరఫరా అవుతున్నవిగా నమోదయ్యాయి. వీటిలో సుమారు 1.28 లక్షల గ్రామాలు సంబంధిత గ్రామసభ ద్వారా స్వీయ ధ్రువీకరణ తీర్మానం ఆమోదించాయి.
కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
(Release ID: 2042080)
Visitor Counter : 65