ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆహార తయారీ రంగంలో అంకుర సంస్థలకు కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేయూత
Posted On:
02 AUG 2024 7:20PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఆహార తయారీ రంగంలో అంకుర సంస్థలకు చేయూతనిచ్చేందుకు
కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ‘సుఫలాం’ (స్టార్టప్ ఫోరమ్ ఫర్ యాస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటార్స్) పేరిట న్యూఢిల్లీలో 2024 ఫిబ్రవరి 13-14 తేదీల్లో అంకుర సంస్థల సదస్సును నిర్వహించింది. ఇందులో భాగంగా అవగాహన గోష్ఠి, నిపుణులతో చర్చలు, నెట్‌వర్కింగ్-పిచింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంకుర సంస్థలు తయారుచేసిన వినూత్న ఆహార ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
కాగా, ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ హర్యానాలోని కుండ్లి, తమిళనాడులోని తంజావూరులోగల తన పరిధిలోని ‘‘జాతీయ ఆహార సాంకేతిక వ్యవస్థాపన-నిర్వహణ సంస్థ’’ల ద్వారా 38 అంకుర సంస్థలను ప్రోత్సహించింది. వీటిలో 6 సంస్థలు నిరుడు జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’ విజేతలుగా నిలిచి, తలా రూ.3 లక్షల వంతున నగదు బహుమతి పొందాయి.
ఇక మంత్రిత్వశాఖ పరిధిలోని రెండు స్వయంప్రతిపత్త సంస్థలు సంబంధిత అంకుర సంస్థలకు ప్రోత్సాహక, శిక్షణాత్మక చేయూతనిస్తాయి. దాంతోపాటు ప్రయోగాత్మక ప్లాంట్, ‘ఎన్ఎబిఎల్’ గుర్తింపు పొందిన ఆహార పరీక్ష ప్రయోగశాలల సౌకర్యం కూడా కల్పిస్తాయి. అలాగే ఇంక్యుబేషన్ సేవలు, నాణ్యత పరీక్షలతోపాటు పరిశోధన-అభివృద్ధి మద్దతు, నెట్ వర్కింగ్ అవకాశాలు తదితరాలను చేరువ చేస్తాయి.
ఆహార, అనుబంధ రంగాల్లోని ఈ అంకుర సంస్థలు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వినూత్న సాంకేతికతల అనుసరణ, ఆహార తయారీలో ఉత్పాదకత-సామర్థ్యం పెంపు, వ్యవస్థాపనకు ప్రోత్సాహం, ఉద్యోగావకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు తదితర రూపాల్లో తమవంతు కృషి చేస్తాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థలు బలోపేతమై, సార్వజనీన వృద్ధికి దోహదం చేస్తాయి.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ ఈ సమాచారమిచ్చారు.
***
(Release ID: 2041204)
Visitor Counter : 101