ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భూటానీయుల ఎస్.ఎమ్.ఇ.ల కోసం నిర్వహిస్తున్న సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌ సందర్భంగా కీలకమైన రెగ్యులేటరీ, టెస్టింగ్ అవసరాలను సూచించిన ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ.


కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వాణిజ్య విధానం, నిబంధనలు, విధానాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించిన వర్క్‌షాప్

భూటాన్ ఆహార, వ్యవసాయ ఎగుమతులు భారతదేశం యొక్క భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారిస్తూ, రెండుసార్లు తనిఖీ చేయవలసిన అవసరాన్ని తొలగించడం ద్వారా భూటాన్ వ్యాపారాలకు అనుమతుల ఖర్చులను తగ్గించు లక్ష్యంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భూటాన్ బి.ఎఫ్.డి.ఎ మరియు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ.

Posted On: 01 AUG 2024 7:33PM by PIB Hyderabad

2024, జూలై 29 నుండి 2024, ఆగస్టు 1వ తేదీ వరకు భూటాన్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన నాలుగు రోజుల సమగ్ర సామర్థ్య-నిర్మాణ వర్క్‌షాప్‌లో భాగంగా ఆహార దిగుమతి నిబంధనలు, అవసరాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ.) నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. గౌరవనీయ భూటాన్ ప్రధాన మంత్రి శ్రీ షెరింగ్ టోబ్గే, ఆర్థిక మంత్రి లియోన్పో నామ్గే దోర్జీల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. వారు భారత ప్రభుత్వ పలు మంత్రిత్వ శాఖల నిపుణులతో వ్యక్తిగతంగా సమావేశమై, ఆయా అంశాలను గురించి విస్తృతంగా సమీక్షించారు.

ఈ కార్యక్రమం పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఒక ప్రకటనలో, భూటాన్ ప్రధాన మంత్రి శ్రీ టోబ్గే ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనను, విశ్వాసాన్ని పెంపొందించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సహకారం వాణిజ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భూటాన్‌లోని వ్యాపారవేత్తలు, తయారీదారులు, రైతులకు సాధికారత కల్పించి, వారు ఈ సంక్లిష్టమైన నియంత్రణల మార్గంలో ముందుకుసాగడానికి అలాగే భారతదేశంతో అధికారిక వాణిజ్యాన్ని నిర్వహించడానికి వారికి తగిన సహకారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించినందుకు భారత రాయబార కార్యాలయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశానికి వ్యవసాయ ఎగుమతులను సులభతరం చేయడానికి, మెరుగుపరచడానికి భూటాన్‌లోని చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎస్.ఎమ్.ఇ.లు), ఉత్పత్తిదారులకు కీలకమైన పరిజ్ఞానం, నైపుణ్యాలతో సాధికారత కల్పించు లక్ష్యంతో నిర్వహించబడిన ఈ వర్క్‌షాప్‌లో పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధుల బృందంలో ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. భాగంగా ఉంది. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. సహా కీలకమైన భారత ప్రభుత్వ సంస్థల సహకారంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ (సి.బి.ఐ.సి.) ఈ వర్క్‌షాప్ నిర్వహించబడింది.

యాపిల్స్, నారింజ, బంగాళదుంపలు, వక్క పలుకులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మరియు కలప వంటి కీలక వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వాణిజ్య విధానం, నిబంధనలు, విధానాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ వర్క్‌షాప్‌లో చర్చించారు. వర్తకం మరియు అంతర్జాతీయ సహకార విభాగం డైరెక్టర్ శ్రీ మాన్వేష్ కుమార్ వర్క్‌షాప్‌లో ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. ప్రతినిధిగా ఆహార దిగుమతి విధానం గురించి, నియంత్రణ మరియు పరీక్షల అవసరాలకు సంబంధించిన ప్రధాన సమస్యలను గురించి అవగాహన కల్పించారు.

ఇటీవల, భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (బి.ఎఫ్.డి.ఎ.) మరియు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ.)లు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి, దీని ద్వారా ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరుదేశాలు కీలక ముందడుగు వేశాయి. భూటాన్ ఆహార, వ్యవసాయ ఎగుమతులు భారతదేశం యొక్క భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం, రెండుసార్లు తనిఖీ చేయవలసిన అవసరాన్ని తొలగించి భూటాన్ వ్యాపారాలకు అనుమతి ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.

ఈ కార్యక్రమం థింఫు, ఫుయంత్‌షోలింగ్, గెలెఫు మరియు సంద్రుప్ జోంగ్‌ఖార్‌ సహా భూటాన్‌లోని పలు ప్రదేశాలలో నిర్వహించబడింది.

***



(Release ID: 2040624) Visitor Counter : 30


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP