బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల నీటిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సానుకూల మార్పు కోసం మైనింగ్ యొక్క పర్యావరణ ప్రభావాలను పరిష్కరించవచ్చు: శ్రీ జి. కిషన్ రెడ్డి
బొగ్గు, లిగ్నైట్ మైనింగ్ ప్రాంతాలలో సంప్రదాయిక నీటి వనరుల పునరుద్ధరణ కోసం మార్గదర్శకాలను విడుదల చేసిన బొగ్గు, గనుల మంత్రి
Posted On:
01 AUG 2024 3:55PM by PIB Hyderabad
బొగ్గు, గనుల శాఖ మంత్రి, శ్రీ జి. కిషన్ రెడ్డి బొగ్గు, లిగ్నైట్ మైనింగ్ ప్రాంతాలలో సంప్రదాయిక నీటి వనరుల పునరుద్ధరణ కోసం సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనాల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా, శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అమూల్యమైన సహజ వనరుగా నీటికి గల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. గనుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే సానుకూల మార్పు కోసం ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ మైనింగ్ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వినూత్నమైన విధానంలో, గనుల్లో నిండిన నీటిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.ల) మహిళలకు సాధికారత కల్పించడం వంటి వివిధ వ్యూహాలు భాగంగా ఉన్నాయన్నారు. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ స్థానికంగా పర్యాటకాన్ని మెరుగుపరుస్తూ స్థానికుల కోసం కొత్త ఆర్థికపరమైన అవకాశాలను అందిస్తాయని పేర్కొన్నారు.
పారిశ్రామిక అవసరాలు, భూగర్భ జలాల పెంపు, అధునాతనమైన సాగు, చేపల పెంపకం సహా విభిన్న అవసరాల కోసం గని నీటిని పునరుపయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. మైన్ టూరిజం, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ వంటి కార్యక్రమాలు విలువైన వనరుగా గనుల నీటి బహుళ ఉపయోగాలను తెలియజేస్తాయని తెలిపారు. పునరావాస ప్రదేశాలలో నీటి వనరులను సృష్టించడం ద్వారా పర్యావరణ ప్రభావాలను తగ్గించడమే కాకుండా సమాజ సర్దుబాటు సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ సమగ్ర వ్యూహం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ నీటి వనరులను పునరుద్ధరించడం ద్వారా, బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక జీవనోపాధిని మెరుగుపరచడం, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.
బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ, బొగ్గు గనుల సవాళ్లను ఎదుర్కోవడంలో వినూత్నమైన నీటి నిర్వహణ పద్ధతుల పాత్ర ముఖ్యమైనదని చెప్పారు. సమాజ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ సహా వివిధ ఉపయోగాల కోసం గనుల నీటిని పునరుపయోగించడం వనరుల నిర్వహణలో ప్రగతిశీల విధానాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. వినోద ప్రదేశాలుగా, స్థానిక సంస్థల ప్రాజెక్టుల వంటి విలువైన ఆస్తులుగా గనుల నీటిని మార్చే కార్యక్రమాలకు ఊతమివ్వడం ద్వారా, పర్యావరణ నిర్వహణతో ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేయుటను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది అన్నారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా మాట్లాడుతూ, బొగ్గు గనుల ప్రాంతాల పరిసరాల్లో తాగునీరు, సాగునీరు, చేపల పెంపకం, వాటర్ స్పోర్ట్స్ అలాగే మైన్ టూరిజం వంటి ప్రయోజనాల కోసం గనుల నీటిని పునరుపయోగించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందన్నారు. అంతేగాకుండా, ఈ ప్రయత్నాలు జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఒక ఉప ఉత్పత్తిని బహుళ ప్రయోజన వనరుగా మార్చడం ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ సుస్థిర అభివృద్ధి, సమాజ శ్రేయస్సు పట్ల తన నిబద్ధతను చాటుతున్నదని, బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణకు ఒక ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని పేర్కొన్నారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో నీటి వనరుల కీలక పాత్రను గుర్తెరిగి, బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు/లిగ్నైట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సి.పి.ఎస్.యు.లు), జిల్లా పరిపాలనా యంత్రాంగాలు, గ్రామ పంచాయతీల సహకారంతో “బొగ్గు/లిగ్నైట్ మైనింగ్ ప్రాంతాలలో సాంప్రదాయిక నీటి వనరుల పునరుజ్జీవనం” పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మిషన్ అమృత్ సరోవర్ (2022) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది అలాగే ఇది కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.), ఎన్.ఎల్.సి ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎల్.సి.ఐ.ఎల్) సహా బొగ్గు/లిగ్నైట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సి.ఎస్.ఆర్ కార్యక్రమంగా సేవలందిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ రాబోయే ఐదేళ్లలో (2024-25 ఆర్థిక సంవత్సరం నుండి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు) బొగ్గు, లిగ్నైట్ మైనింగ్ ప్రాంతాలు, వాటి పరిసర ప్రాంతాలలో కనీసం 500 నీటి వనరులను పునరుద్ధరించి, ఏర్పాటు చేయు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. లీజు కలిగి ఉన్న ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నీటి వనరులను నిర్వహిస్తాయి, అయితే లీజు కలిగి ఉన్న ప్రాంతం వెలుపల ఉన్న నీటి వనరులను జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తారు. ప్రతి కొత్త నీటి వనరు కనీసం 0.4 హెక్టార్ల చెరువు విస్తీర్ణాన్ని, సుమారు 10,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం యొక్క జల్ శక్తి అభియాన్‌తో అనుసంధానించబడి క్రియాశీలమైన, నిరుపయోగంలో ఉన్న గనుల నుండి నీటిని ఉపయోగించుకుంటుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో, బొగ్గు/లిగ్నైట్ గనులు గల రాష్ట్రాల్లోని 981 గ్రామాలకు సుమారుగా 4,892 లక్షల కిలోలీటర్ల శుద్ధి చేయబడిన గనుల నీటిని అందించారు. గత ఐదేళ్లలో 18,513 లక్షల కిలోలీటర్ల గనుల నీటిని సాగునీరు, త్రాగునీటి అవసరాలు సహా సమాజ వినియోగానికి అందుబాటులోకి తెచ్చారు.
సుస్థిరమైన మైనింగ్ పద్ధతులను అభివృద్ధి చేయడంలో ఈ మార్గదర్శకాల విడుదల కీలకమైన ముందడుగు అవుతుంది. సాంప్రదాయిక నీటి వనరుల పునరుజ్జీవనం కోసం స్పష్టమైన ఆదేశాలను అందించడం ద్వారా, బొగ్గు మంత్రిత్వ శాఖ సమర్థవంతమైన పర్యావరణ నిర్వహణ, సమాజ భాగస్వామ్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మార్గదర్శకాలు కీలకమైన నీటి వనరులను పునరుద్ధరించడానికి నిర్మాణాత్మకమైన, ప్రభావవంతమైన విధానాన్ని నిర్ధారిస్తాయి, తద్వారా మైనింగ్ ప్రాంతాలలో పర్యావరణ సమతుల్యత, మెరుగైన జీవన నాణ్యతకు తోడ్పడుతాయి.
***
(Release ID: 2040518)