మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ల రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి నోడల్ అధికారులకు సాఫ్ట్ వేర్, బ్రీడ్స్ పై ఇరవై ఒకటో పశుసంతతి గణనకు సంబంధించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన పశుపాలన- పాడి విభాగం
భారతదేశంలో పశుగణం రంగం ఒక ముఖ్య ఆర్థిక స్తంభంగా ఉంది; ఇది లక్షల కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తోంది; స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో 5.5 శాతాన్ని సమకూర్చుతోంది: శ్రీమతి అల్కా ఉపాధ్యాయ
Posted On:
31 JUL 2024 5:53PM by PIB Hyderabad
భారత ప్రభుత్వంలో మత్స్యపాలన, పశుపాలన, పాడి మంత్రిత్వ శాఖకు చెందిన పశుపాలన- పాడి విభాగం (డిఎహెచ్‌డి) మరియు ఆతిథ్య రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లు కలసికట్టుగా ‘ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక లకు చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి నోడల్ అధికారుల (ఎస్ఎన్ఒ/డిఎన్ఒ) లకు సాఫ్ట్ వేర్ (మొబైల్, వెబ్ అప్లికేషన్/డాష్ బోర్డ్), బ్రీడ్స్ లపై ఇరవై ఒకటో పశుధన గణన అనే అంశంలో ప్రాంతీయ శిక్షణ కార్యక్రమాన్ని’ నిర్వహించాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో జరపాలని నిర్ణయించిన 21వ పశుధన గణన (లైవ్ స్టాక్స్ సెన్సస్) ను నిర్వహించడానికి ఇటీవలే రూపొందించిన మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్స్ ను ఉపయోగించడంలో ఆ యా రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర స్థాయి/జిల్లాల స్థాయి నోడల్ అధికారులకు శిక్షణను ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యశాల (వర్క్ షాప్) ను బుధవారం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో నిర్వహించారు.
భారత ప్రభుత్వంలో పశుపాలన మరియు పాడి విభాగం కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇరవై ఒకటో పశుధన గణనను పురస్కరించుకొని తన శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటు అభినందనలను కూడా వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై పశుగణ రంగం ప్రభావంతో పాటు, పశుగణ రంగం ఉత్పాదనలకు సంబంధించిన ప్రపంచ వ్యాపారం పరంగా చూసినప్పుడు భారతదేశం ఏ స్థితిలో ఉన్నదనే అంశాలపైన ఆమె తన ఆలోచనలను వెల్లడించారు. భారతదేశ పశుగణ రంగం ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన స్తంభంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ రంగం లక్షల కొద్దీ ప్రజలకు బ్రతుకు తెరువును అందిస్తూ, దేశ జిడిపికి 5.5 శాతం సమకూర్చుతూ, అతి ముఖ్యమైన ప్రొటీన్ లను భర్తీ చేస్తోందని ఆమె వివరించారు. పశుగణం పరంగా భారీ సంతతిని కలిగి ఉంటూ, పాల ఉత్పత్తి లోను (ఒకటో స్థానం), గుడ్ల ఉత్పత్తి లోను (రెండో స్థానం) ప్రపంచంలో నాయకత్వ స్థానాన్ని వహిస్తూ, ఈ రంగం ఒక పవర్ హౌస్ గా ఉంది అని ఆమె అన్నారు. అయితే ఈ రంగం పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి మరియు ఎగుమతులకు ఉన్న ఆశాజనక అవకాశాలను వినియోగించుకోవడానికి ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు, మార్కెట్ లభ్యతలలో సవాళ్ళను పరిష్కరించవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఈ కార్యశాలను భారత ప్రభుత్వ పశుపాలన- పాడి విభాగం సలహాదారు (గణాంక శాస్త్రం) శ్రీ జగత్ హజారిక, భారత ప్రభుత్వంలో డిఎహెచ్‌డి కి చెందిన ఎహెచ్ఎస్, డైరెక్టర్ శ్రీ వి.పి. సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పశుపాలన- పాడి అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ ల సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పశుపాలన- పాడి అభివృద్ధి విభాగం కార్యదర్శి శ్రీ ఎమ్.ఎమ్. నాయక్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం జాతీయ గీతం ఆలాపనతో పాటు సాంప్రదాయిక జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైంది. విశిష్ట అతిథుల ప్రసంగాలు ప్రారంభ కార్యక్రమంలో ఆకర్షణగా నిలచాయి. ఈ కార్యక్రమం పశుధన గణనను చేపట్టడంలో రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి నోడల్ అధికారులకు శిక్షణను విజయవంతం చేసే దిశలో ఒక సహకారపూర్వక కృషికి రంగాన్ని సిద్ధం చేసింది.
వర్క్ షాప్ ను ఉద్దేశించి శ్రీ ఎమ్.ఎమ్. నాయక్ ప్రసంగిస్తూ, క్షేత్ర స్థాయిలో సమగ్ర శిక్షణ సామర్థ్య నిర్మాణం ల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో ఒక లైవ్ స్టాక్ పవర్ హౌస్ గా ఆంధ్ర ప్రదేశ్ ఉందని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకల సంఖ్య చెప్పుకోదగ్గదిగా ఉందని, ఈ కేటగిరీలన్నింటిలోనూ అగ్రగామి రాష్ట్రాల సరసన ఆంధ్ర ప్రదేశ్ స్థానాన్ని సంపాదించుకొందని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఒక ప్రముఖ పాల ఉత్పత్తిదారు రాష్ట్రంగా ఉంటూ, జాతీయ ఉత్పత్తికి గణనీయ స్థాయి తోడ్పాటును అందిస్తోందన్నారు. అంతేకాకుండా, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ ది అగ్రస్థానమని, అలాగే పశుమాంసం రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన రాష్ట్రంగా ఉందని ఆయన వివరించారు. పశుగణం సంబంధ ఉత్పాదనలకు విలువను జోడించే ప్రక్రియ అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండడం అనేది ఈ విషయంలో ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతూ ఉండటాన్ని సూచిస్తోందన్నారు. పశుధనం గణన ప్రక్రియలో అత్యంత శ్రద్ధతో ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీని ద్వారా సేకరించే డేటా రాబోయే కాలంలో అమలు చేయడానికి కార్యక్రమాలను రూపొందించడంలోను, ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడంలోను ఒక కీలక పాత్రను పోషిస్తుందని ఆయన అన్నారు.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సలహాదారు (స్టాటిస్టిక్స్) శ్రీ జగత్ హజారికా మాట్లాడుతూ, ఈ వర్క్ షాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఖచ్చితమైన,సమర్థవంతమైన డేటాసేకరణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి డిపార్ట్ మెంట్ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. పశుసంవర్ధక రంగం భవిష్యత్తు విధానాలు, కార్యక్రమాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే 21వ పశుగణన విజయవంతం కావడానికి భాగస్వాములందరి సమిష్టి బాధ్యత అవసరమని ఆయన చెప్పారు పశు గణన విజయవంతం కావడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని వారిని కోరారు.
పశుసంవర్ధక రంగంలో సుస్థిర పద్ధతులను ఏకీకృతం చేయాలని డాక్టర్ అమరేంద్ర కుమార్ అన్నారు. పశుగణన అనంతరం సేకరించిన డేటాను విశ్లేషించడం, తెలివిగా వినియోగించడం వల్ల భవిష్యత్ శాఖాపరమైన విధానాలను రూపొందించడానికి, కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, పశుపోషణ రంగంలో రైతులకు ప్రయోజనం కల్పించే కొత్త పథకాలను రూపొందించి ఉపాధి కల్పనకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన ఆయన శిక్షణ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ వర్క్ షాప్ లో పశుసంవర్ధక గణాంక విభాగం ద్వారా 21వ పశుగణన సంక్షిప్త వివరణ మొదలుకొని, పశు గణనలో కవర్ చేయాల్సిన జాతుల బ్రీడ్ వివరాలపై ఐసిఎఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ బిఎజిఆర్) బృందం వివరణాత్మక ప్రజంటేషన్ వరకు పలు సెషన్ లు ఉన్నాయి. వివిధ పశు సంవర్ధక రంగ కార్యక్రమాలలోనూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి) ) నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఎఫ్) కోసం ఉపయోగించే ఖచ్చితమైన గణాంకాలను తయారు చేయడానికి ఖచ్చితమైన బ్రీడ్ గుర్తింపు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.
రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారుల కోసం మొబైల్ అప్లికేషన్, డ్యాష్ బోర్డ్ సాఫ్ట్ వేర్ పై శిక్షణ పొందిన కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖకు చెందిన సాఫ్ట్ వేర్ బృందం ద్వారా 21వ పశుగణన పద్ధతులు , సాఫ్ట్ వేర్ లైవ్ అప్లికేషన్ పై ఈ వర్క్ షాప్ లో వివరణాత్మక సెషన్లు కూడా ఉన్నాయి. ఈ నోడల్ అధికారులు ఎన్యూమరేటర్లకు ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలోని పశుసంవర్ధక గణాంక విభాగం డైరెక్టర్ శ్రీ వి.పి.సింగ్ వందన సమర్పణ తో వర్క్ షాప్ ముగిసింది. వర్క్ షాప్ కు హాజరైన ప్రముఖులు భాగస్వాములందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పశు గణన కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. .
*****
(Release ID: 2040079)
Visitor Counter : 108