సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వృద్ధుల సంక్షేమం
Posted On:
31 JUL 2024 3:07PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ(డిఓఎస్‌జేఈ), మెయింటేనెన్స్, వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్(ఎండబ్ల్యూపీఎస్‌సీ) చట్టం, 2007 ను రూపొందించింది. 2019-20లో మంత్రిత్వ శాఖ ఈ చట్టం పనితీరు, సమర్ధతను నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్ ద్వారా పలు రాష్ట్రాలు, కీలక భాగస్వాముల నుంచి సమాచారాన్ని తీసుకుని పరిశీలించింది. ఎండబ్ల్యూపీఎస్‌సీ చట్టం, 2007 లోని సెక్షన్ 22 నిబంధనల ప్రకారం, చట్టం అమలును రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మేజిస్ట్రేట్ కు అధికారాలు, విధులను అప్పగించింది. వయోవృద్ధుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కూడా సూచిస్తుంది.
వృద్ధాప్య సంరక్షణ సౌకర్యాలు, ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి, అటల్ వయో అభ్యుదయ్ యోజన (ఎవివైఎవై) కింద 'వృద్ధాప్య సంరక్షకుల శిక్షణ'ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. వృద్ధుల సంరక్షకుల రంగంలో సరఫరాలో ఉన్న అంతరాన్ని తొలగించడం, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వృత్తిపరమైన సేవలను అందించడంతో పాటు వృద్ధాప్య రంగంలో వృత్తిపరమైన సంరక్షకుల వ్యవస్థను సృష్టించడం దీని లక్ష్యం. వృధ్దుల కోసం స్టేట్ యాక్షన్ ప్లాన్ (ఎస్ఏపీఎస్ఆర్సీ)కు కూడా మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తోంది. దీని కింద 'వృద్ధాప్య సంరక్షకుల శిక్షణ' కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేయబడతాయి.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ఎపి) ను అమలు చేస్తోంది. దీని కింద దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) ఉండి, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే వృద్ధాప్య పింఛను లభిస్తుంది. మరే ఇతర కేటగిరీకి చెందిన వయోవృద్ధులకు ఎన్ఎస్ఏపీ పింఛను ప్రయోజనాలు వర్తించవు. ఎన్ఎస్ఏపీలో 60-79 ఏళ్ల మధ్య వయసు వారికి నెలకు రూ.200, 80 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం (ఎన్‌పీహెచ్‌సీఈ) పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సంరక్షణ స్థాయిలలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సులభంగా అందుబాటులో, సరసమైన ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు- సబ్ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు/ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వృద్ధుల సంరక్షణను కూడా ఆరోగ్య సేవల ప్యాకేజీలో చేర్చారు. అన్ని స్థాయిలలో, వృద్ధులతో సహా రోగులకు మందులను, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఉచితంగా అందిస్తారు.
జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద దేశంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లా స్థాయిలోని డీఎంహెచ్‌పీ బృందాల్లో మానసిక ఆరోగ్య నిపుణులు, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాట్రిక్ నర్స్, కమ్యూనిటీ నర్స్ ఉంటారు. జిల్లా ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ), ఇన్ పేషెంట్ విభాగం (ఐపీడీ) సేవలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఉపకేంద్రాల్లో ఔట్ రీచ్ ఓపీడీ సేవలను డీఎంహెచ్‌పీ బృందం అందిస్తుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో, రోగుల ఇళ్లకు సమీపంలో కమ్యూనిటీ, ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీలో మానసిక ఆరోగ్యాన్ని చేర్చారు.
మెయింటెనెన్స్, వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (ఎండబ్ల్యూపీసీ) 2007 కింద వృద్ధులకు న్యాయసేవలు సులభంగా అందుబాటులోకి వచ్చేందుకు నిబంధనలు ఉన్నాయి. న్యాయశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) వృద్ధులకు లీగల్ సర్వీసెస్ పథకం-2016ను ఏర్పాటు చేసింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కింద అర్హులైన వృద్ధులకు ఈ పథకం ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుంది. ఇందులో ట్రైబ్యునళ్లు, వృద్ధాశ్రమాల్లో లీగల్ సర్వీస్ క్లినిక్‌లను ఏర్పాటు, చట్టపరమైన విధానాల్లో సహాయపడే శిక్షణ పొందిన పారాలీగల్ వాలంటీర్లను నియమించడం వంటివి ఉన్నాయి. వృద్ధులకు ప్రభుత్వ పథకాలు, పింఛను ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చూడటంలో క్లీనిక్ లు కీలక పాత్ర పోషిస్తాయి.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2040072)