గనుల మంత్రిత్వ శాఖ
హరిత పరివర్తన కోసం కీలకమైన ఖనిజాలు
Posted On:
31 JUL 2024 3:46PM by PIB Hyderabad
ఆర్థిక వ్యవస్థ హరిత పరివర్తన కోసం లిథియం, రాగి, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి కీలక ఖనిజాలు, ఇతర ముఖ్య ఖనిజాలు అవసరం. ఈ ఖనిజాలు క్లీన్ ఎనర్జీ, తక్కువ-కర్భన ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన కోసం సమగ్రమైనవి అయిన సౌర ఫలకాలు, పవన శక్తిని ఉత్పత్తిచేయు టర్బైన్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి హరిత సాంకేతికతలో ఉపయోగించుటకు అవసరమైనవి. లిథియం, రాగి, కోబాల్ట్, గ్రాఫైట్ అలాగే ఇతర ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనం, బ్యాటరీలు, గాజుసామాను, పింగాణి వస్తువులు, ఇంధన తయారీ, లూబ్రికెంట్లలో ఉపయోగించబడతాయి. పొటాష్, గ్లాకోనైట్, ఫాస్ఫేట్ వంటి ఖనిజాలను రసాయనాలు, ఎరువుల పరిశ్రమలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా ఖనిజాల అన్వేషణ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నోడల్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ క్లాసిఫికేషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ వివిధ దశలలో ఖనిజ అన్వేషణలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టింది, ఆమోదిత యాన్యువల్ ఫీల్డ్ సీజన్ ప్రోగ్రామ్ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో లిథియంతో సహా వివిధ ఖనిజాల ముడిపదార్థాల వనరులను పెంచే లక్ష్యంతో వాటిలో మరిన్ని సవరణలు చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌ఘఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఈ కీలకమైన ఖనిజాల నిక్షేపాలు కనుగొనబడ్డాయి.
కీలకమైన ఖనిజాల వేలం ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేవు. వేలం కోసం గుర్తించబడిన కీలకమైన ఖనిజాల 38 గనులలో 14 గనుల వేలం విజయవంతంగా పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కీలక ఖనిజాల నిల్వలు ప్రధానంగా ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చైనా, చిలీ, కెనడా, కాంగో, మొజాంబిక్, దక్షిణాఫ్రికా మొదలైన దేశాల్లో నిక్షిప్తం అయి ఉన్నాయి.
24 కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల కోసం ప్రత్యేకంగా వేలం వేయు అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించడానికి గానూ 2023లో “గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957”ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇప్పటి వరకు 14 గనుల వేలం విజయవంతంగా పూర్తయింది. కీలకమైన, భూమి లోలోతు పొరల్లో నిక్షిప్తమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడానికి, భూమి లోలోతు పొరల్లోని చాలా వరకు కీలక ఖనిజాలు సహా 29 ఖనిజాల కోసం అన్వేషణ లైసెన్స్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టబడింది, ఇది లైసెన్స్‌దారులు ఖనిజాల అన్వేషణ కోసం పరిశోధనలు, శోధన కార్యకలాపాలను చేపట్టడానికి అనుమతిస్తుంది. జి.ఎస్.ఐ రాష్ట్ర ప్రభుత్వాలకు అన్వేషణ లైసెన్స్ కింద 20 గనులను వేలం కోసం అప్పగించింది, వీటిలో 12 గనులను రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాలు వేలం కోసం నోటిఫై చేశాయి. అన్వేషణలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, గనుల మంత్రిత్వ శాఖ 22 ప్రైవేట్ అన్వేషణ ఏజెన్సీలను (ఎన్.పి.ఇ.ఎ.లు) నోటిఫై చేసింది. ఈ ఏజెన్సీలు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్.ఎమ్.ఇ.టి) అందించే నిధుల ద్వారా అన్వేషణ ప్రాజెక్టులను నిర్వహిస్తాయి.
భారత ప్రభుత్వం కీలకమైన ఖనిజాల 14 గనుల వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసింది, వాటిలో 12 గనులు కాంపోజిట్ లైసెన్స్ కోసం గలవి. కీలక ఖనిజాలు గల మరో 21 గనులు వేలం కోసం నోటిఫై చేయబడ్డాయి, వాటిలో 20 కాంపోజిట్ లైసెన్స్ కోసం నోటిఫై చేయబడినవి. కాంపోజిట్ లైసెన్స్ గనులను దక్కించుకున్న బిడ్డర్ గనుల తవ్వకం ప్రారంభించే ముందు గనిని అన్వేషిస్తారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఈరోజు లోక్‌సభలో సమర్పించిన లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 2040060)
Visitor Counter : 96