బొగ్గు మంత్రిత్వ శాఖ
కాలుష్య ప్రక్రియలను తగ్గిస్తూనే బొగ్గు ఉత్పత్తిని పెంచుతూ సమతుల్యం చేస్తున్న భారత్
స్వయం సమృద్ధ భారతదేశం, పర్యావరణ అనుకూల భవిష్యత్తు
Posted On:
22 JUL 2024 6:16PM by PIB Hyderabad
బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించిన కాలుష్య కారణ ప్రక్రియలను వ్యూహాత్మకంగా తగ్గించడం, బొగ్గు తవ్వకాల్లో ఉత్పత్తిని పెంచడం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని భారతదేశం సమర్థంగా పాటిస్తున్నది. విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూనే, పర్యావరణపై పడే ప్రభావాన్ని తగ్గించడమే దీని లక్ష్యం.

వరల్ట్అట్లాస్.కామ్ విడుదల చేసిన ప్రపంచంలోనే 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన చత్తీస్‌గఢ్ కేంద్రంగా పని చేసే సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్ఈసీఎల్)కు చెందిన గెవ్ర, కుసుమండ బొగ్గు గనులు, 2వ, 4వ స్థానంలో నిలిచాయి.
ఈ రెండు గనులు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి ఏడాదికి దాదాపు 100 మిలియన్ టన్నుల బోగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం భారతదేశ బొగ్గు ఉత్పత్తిలో ఈ రెండింటి వాటా దాదాపు 10 శాతం ఉంటుంది. పర్యావరణ అనుకూల మైనింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ పేలుడు జరపకుండానే బొగ్గును వెలికితీసి, ప్రాసెస్ చేయడం కోసం సర్ఫేస్ మైనర్ అనే అత్యాధునిక సాంకేతికతను వీటిల్లో వినియోగిస్తుండటం విశేషం.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారీ తోడ్పాను అందిస్తున్న బొగ్గు గనుల తవ్వకాలు
పెట్టుబడులు కొనసాగించడంతో పాటు అధునాతన సాంకేతికతలపై ప్రధానంగా దృష్టి సారిస్తుండటం ద్వారా భారతదేశ బొగ్గు ఉత్పత్తి 2022-23లో 893.19 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2023-24లో 11.65 శాతం వృద్ధితో 997.25 మిలియన్ టన్నులకు పెరిగింది. సమగ్ర అధ్యయనాల ప్రకారం 2030 నాటికి బొగ్గు డిమాండ్ 1462 మిలియన్ టన్నులకు, 2047 నాటికి 1755 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.

దేశానికి, బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బొగ్గు గనుల తవ్వకాలు భారీ తోడ్పాటును అందిస్తున్నాయి. బొగ్గు విక్రయ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీగా 14 శాతం అందుతుంది. కాప్టీవ్ లేదా వాణిజ్య గనులకు సంబంధించి కూడా పారదర్శకమైన వేలం ప్రక్రియలో గనులను పొందిన వారు పేర్కొన్న మేరకు ఆదాయంలో వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు పొందుతాయి.
వీటితో పాటు ఉద్యోగ కల్పన, భూమికి నష్టపరిహారం, ఇతర ఆర్థిక ప్రయోజనాలతో పాటు రైల్వేలు, రోడ్డు వంటి ఇతర అనుబంధ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరగడం వంటి వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ధి కలుగుతుంది.
వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టాసారించడం నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఆదాయాన్ని పొందడానికి ఉపయోగపడుతోంది. బొగ్గు ఉత్పత్తయ్యే ప్రాంతాల్లో మూలధన వ్యయం చేయడం ద్వారా మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి.
బొగ్గు గనుల్లో సుస్థిరత
మైనింగ్ పరిశ్రమ చాలాకాలంగా పర్యావరణానికి నష్టం చేసేదిగా, వనరులను క్షీణింపజేసేదిగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో హరిత మైనింగ్ అనే విధానం సుస్థిరమైన భవిష్యత్తుకు ఆశాదీపంగా మారింది.
హరిత మైనింగ్‌తో సుస్థిర భవిష్యత్తు
పర్యావరణపై ప్రభావాన్ని తగ్గించేలా మైనింగ్ పరిశ్రమలో పర్యావరణ అనుకూల పద్ధతులు, సాంకేతికతలను వినియోగించడాన్ని హరిత మైనింగ్ అంటారు. పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడం, గని వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, తవ్వకాల్లో సుస్థిరమైన సాంతికేకతలను ఉపయోగించడం వంటివి హరిత మైనింగ్‌లో భాగం.
మైనింగ్ పరిశ్రమలో కార్బన ఉద్గారాలను తగ్గించడం, బాధ్యతాయుత మైనింగ్‌ను ప్రోత్సహించడం అనేవి హరిత మైనింగ్‌ను అమలు చేయడానికి ప్రధాన లక్ష్యాలు. పర్యావరణ సుస్థిరతను అందుకోవడానికి గానూ బొగ్గు గని ప్రాంతాల్లో బొగ్గు/లిగ్నైట్ పీఎస్‌యూలు అనుసరిస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యల గురించి క్లుప్తంగా వివరణ ఇదీ..
1. గాలి నాణ్యత నిర్వహణ
కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, సుస్థిరమైన మైనింగ్ కార్యకలాపాలు జరిగేందుకు గానూ బొగ్గు గనుల్లో సమర్థవంతమైన గాలి నాణ్యత నిర్వహణ చాలా ముఖ్యం. బొగ్గు తవ్వకాల వల్ల ఉత్పత్తయ్యే ధూళి, వ్యర్థాలు గనుల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి.
ధూళి స్థాయిలను తగ్గించడం, వ్యర్థాలపై పర్యవేక్షణ, కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికతలను వినియోగించడం వంటి పటిష్టమైన గాలి నాణ్యత నిర్వహణ పద్ధతులను పాటించడం ద్వారా గాలి నాణ్యతపై పడే ప్రభావాలను తగ్గించవచ్చు.
ధూళి ఉత్పత్తిని తగ్గించడానికి తడి డ్రిల్లింగ్ పద్ధతిని వినియోగిస్తున్నారు. ధూళిని తగ్గించడం డ్రిల్ యంత్రాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉపరితల మైనర్లు, బీడబ్ల్యూఈలను ఎక్కువగా వినియోగించడం ద్వారా డ్రిల్లింగ్ అవసరం, పేలుళ్ల అవసరం తగ్గుతుంది. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది. తయారీదారు నిర్దేశాలకు తగ్గట్టుగా వాహనాలు ఉండేలా ఎప్పటికప్పుడు నిర్వహణ చర్యలు తీసుకుంటారు.
2. గని మూసివేత, జీవ-పునరుద్ధరణ, భూవినియోగ నిర్వహణ
పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, సుస్థిరమైన భూవినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ బాధ్యతాయుతమైన బొగ్గు గని తవ్వకాల్లో గని మూసివేత, జీవ-పునరుద్ధరణ, భూవినియోగ నిర్వహణ అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఏదైనా బొగ్గుగనిలో తవ్వకాలు చివరి దశగా వచ్చినప్పుడు ఆ ప్రాంతం సురక్షితంగా, సమర్థవంతంగా పునరుద్ధరణ జరిగేలా క్రమబద్ధమైన విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది.
జీవ-పునరుద్ధరణ అంటే.. అక్కడి వృక్ష, జంతుజాలాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను తీసుకురావడం. భూవినియోగ నిర్వహణ అనేది ప్రధానంగా గని మూసివేసిన ప్రాంతంలోని భూమిని వ్యవసాయ లేదా ఇతర అవసరాలకు పునర్వినియోగించుకోవడంపై దృష్టి సారిస్తుంది. మైనింగ్ కార్యకలాపాల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని తగ్గించడానికి, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణను సహకరించడానికి, మూసివేసిన గని ప్రాంతాలను దీర్ఘకాలం వినియోగించుకోవడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి.
విద్యుత్ ఉత్పత్తిని మించి ఆర్థిక ఆవశ్యకతగా మారిన బొగ్గు రంగం
రైల్వే సరుకు రవాణాకు అతిపెద్ద సహకారి: రైల్వే సరుకు రవాణాకు అతిపెద్ద సహకారిగా బొగ్గు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు సరుకు రవాణా ద్వారా పొంది మొత్తం ఆదాయంలో సగటున దాదాపు 49 శాతం, అంటే రూ.82,275 కోట్లు కేవలం బొగ్గు రవాణా ద్వారా వచ్చింది. రైల్వే మొత్తం ఆదాయంలో 33 శాతానికి పైగా బొగ్గు రవాణా నుంచే వచ్చింది. తద్వారా భారతీయ రవాణా వ్యవస్థలో బొగ్గు రంగం ప్రభావం స్పష్టమవుతోంది.
ప్రభుత్వ ఆదాయం: రాయల్టీలు, జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొగ్గు రంగం ప్రతియేటా దాదాపు రూ.70,000 కోట్ల వరకు ఆదాయాన్ని అందిస్తోంది. బొగ్గు ఉత్పత్తయ్యే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొగ్గు ఉత్పత్త గణనీయ ఆదాయాన్ని అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాలకు రాయల్టీ రూపంలో దాదాపు రూ.23,184.86 వసూలైంది.
ఉద్యోగ కల్పన: బొగ్గు రంగం అపారమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాల్లోని బొగ్గు ఉత్పత్తయ్యే రాష్ట్రాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్), దాని అనుబంధ సంస్థల్లో 2,39,210 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దీనికి అదనంగా కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ కార్మికులతో కలిపి వేలాది కుటుంబాలకు ఈ రంగం జీవనోపాధి కల్పిస్తోంది. అదనంగా, సీఐఎల్‌లో 65,000 మంది కాంట్రాక్టు కార్మికులు మైనింగ్ కార్యకలాపాల్లో పని చేస్తున్నారు. 37,000 మంది కార్మికులు సెక్యూరిటీ, డ్రైవర్, హౌజ్‌కీపింగ్ వంటి పనుల్లో ఉన్నారు. బొగ్గు రవాణాకు దాదాపు 24,000 ట్రక్కులు పని చేస్తుండగా, వీటిపై దాదాపు 50,000 మంది ఉపాధి పొందుతున్నారు. కాప్టీవ్/వాణిజ్య బొగ్గు గని సంస్థల్లో మరో 20,000 మంది వరకు పని చేస్తున్నారు.
డివిడెంట్ చెల్లింపులు: కేంద్ర ప్రభుత్వానికి కోల్ ఇండియా గత ఐదేళ్లుగా ఏడాదికి సగటున రూ.6,487 కోట్లు డివిడెంట్ల రూపంలో చెల్లిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా రూ.9,475.85 కోట్లు చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాలకు ఈ రంగం ఇస్తున్న ఆర్థిక స్థిరత్వాన్ని, సహకారం స్పష్టమవుతోంది.
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్): బొగ్గు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) చొరవలకు ప్రాధాన్యతను ఇస్తూ గత ఐదేళ్లుగా ఏటా సగటున రూ.608 కోట్ల వరకు ఖర్చి చేస్తున్నాయి. కేవలం కోల్ ఇండియానే సీఎస్ఆర్ కార్యక్రమాల కోసం సగటున ఏడాదికి రూ.517 కోట్లు కేటాయించింది. ఇందులో దాదాపు 90 శాతం వరకు బొగ్గు ఉత్పత్తయ్యే ప్రాంతాల్లో విద్య, వైద్యసేవలు, నీటి సరఫరా, నైపుణ్యాభివృద్ధి వంటి సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది.
మూలధన వ్యయం: బొగ్గు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల సద్వినియోగం కోసం గత ఐదేళ్లుగా ఏటా సగటున రూ.18,255 కోట్లను మూలధన వ్యయంపై పెట్టుబడి పెట్టాయి. ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి, సుస్థిరాభివృద్ధికి అనువైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఈ పెట్టుబడి ఉపయోగపడుతుంది.
అభివృద్ధిపథంలో సాగుతున్న భారతదేశంలో బొగ్గు రంగం.. ఆర్థిక సుసంపన్నత, ఉద్యోగ కల్పన, సామాజిక శ్రేయస్సుకు దోహదపడుతూ దేశ ప్రగతిలో మైలురాయిగా నిలుస్తోంది.
సారాంశం
బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు కాలుష్యాన్ని దశలవారీగా తగ్గించడం ద్వారా సమతుల్యం చేసే భారతదేశ విధానం.. ఆర్థిక వృద్ధి, పర్యావరణ బాధ్యతపై నిబద్ధతను చాటుతోంది. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను అందుకునేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచుతూనే కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా మరింత సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్ పరిశ్రమ కోసం భారత్ పని చేస్తోంది. బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడమనే రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, గాలి నాణ్యతను పెంచడంతో పాటు బొగ్గు రంగం దీర్ఘకాలం స్థిరంగా ఉండేలా భారత్ భవిష్యత్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
***
(Release ID: 2036734)
Visitor Counter : 151