హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త చట్టాలపై అవగాహన

Posted On: 24 JUL 2024 5:11PM by PIB Hyderabad

   కొత్త నేర విచారణ చట్టాలు- ‘‘భారతీయ న్యాయ సంహిత-2023 (బిఎన్ఎస్‌), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023 (బిఎన్ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం-2023 (బిఎస్‌ఎ)పై సామాన్య ప్రజానీకంలో అవగాహన పెంచేందుకు చేపట్టిన కార్యకలాపాల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

   ఈ మేరకు పత్రికా సమాచార సంస్థ (పిఐబి) విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. తదనుగుణంగా కొత్త నేర విచారణ చట్టాలపై సూచన పత్రాలు, పత్రికా ప్రకటనలు, సమాచార చిత్రాలు (ఇన్ఫోగ్రాఫిక్స్) వగైరాల ద్వారా సామాజిక మాధ్యమ వేదికలలో ప్రాచుర్యం కల్పించింది. అలాగే కొత్త చట్టాల్లోని ప్రధానాంశాలపై చర్చకు వీలుగా దేశంలోని 27 రాష్ట్రాల రాజధాని నగరాల్లో... ముఖ్యంగా ప్రాంతీయ మాధ్యమాల కోసం చర్చాగోష్ఠులు (వార్తాలాప్) కూడా నిర్వహించింది.

   అంతేకాకుండా ఆకాశవాణి (ఆలిండియా రేడియో), దూరదర్శన్ కూడా వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ మేరకు కొత్త నేర విచారణ చట్టాల సంబంధిత వార్తా కథనాలు, కార్యక్రమాలు సహా న్యాయశాస్త్ర నిపుణులతో చర్చాగోష్ఠులతోపాటు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కూడా ప్రచారం కల్పించాయి. ఇవేకాకుండా సమగ్ర వివరణాత్మక వీడియోల ద్వారా కూడా ప్రజలకు అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాయి.

   అలాగే పరివర్తనాత్మక భారతం (ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) వెబ్‌సైట్‌ సహా తన సామాజిక మాధ్యమ విభాగాల్లో సచిత్ర సమాచార ప్రకటనల అప్‌లోడ్ ద్వారా ‘మైగవ్’ (MyGov) కూడా తనవంతు కృషి చేసింది. అంతేగాక పౌరులకు అవగాహన కల్పన లక్ష్యంగా 2024 ఫిబ్రవరి 19న సుమారు 7 కోట్ల మందికి ఒక ఇ-మెయిల్ పంపింది. మరోవైపు తన వేదిక ద్వారా అవగాహన కల్పన, పౌర భాగస్వామ్యం నిమిత్తం  2024 మార్చి 14, జూన్ 12 తేదీల్లో ఒక ప్రశ్న-జవాబుల కార్యక్రమం కూడా నిర్వహించింది.

   పరివర్తనాత్మక సంస్కరణలు: ప్రజలపై... ముఖ్యంగా మహిళలు/పిల్లలపై వాటి సానుకూల ప్రభావం గురించి పౌరులకు వివరించేందుకు కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలు హిందీ భాషలో సంయుక్త వెబినార్‌ నిర్వహించాయి. ఈ మేరకు 2024 జూన్ 21న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. అటుపైన 2024 జూన్ 25న ఆంగ్ల భాషలో నిర్వహించిన మరో వెబినార్‌లో దాదాపు 50 లక్షల మంది పాలుపంచుకున్నారు.

   ఇక విశ్వవిద్యాలయ నిధి వితరణ సంస్థ (యుజిసి) దేశంలోని 1,200 విశ్వవిద్యాలయాలు,  40వేల కళాశాలలకు సచిత్ర సమాచార ప్రకటనలను జారీచేసింది. కొత్త నేర చట్టాలపై అధ్యాపకులు, విద్యార్థులకు అవగాహన కోసం అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) దాదాపు 9,000 సంస్థలకు సూచన పత్రాలు పంపింది. తదనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు 2024 జూలై 1న నిర్దిష్ట బృందాలతో చర్చాగోష్ఠులు, కార్యశాలలు, సదస్సులు, క్విజ్‌ల వంటి కార్యక్రమాలను రోజు పొడవునా  నిర్వహించాయి. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది విస్తృత భాగస్వామ్యంతో కొత్త నేర విచారణ చట్టాల్లోని వివిధ నిబంధనలు, వాటితో వచ్చిన కీలక పరివర్తన గురించి ఈ సందర్భంగా విశదీకరించారు.

   దేశవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలోనూ 2024 జూలై 1న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగస్వాములు, ప్రజలకు కొత్త నేర విచారణ చట్టాల్లోని ముఖ్యాంశాలను వివరించే ద్విభాషా కరదీపికను ప్రదర్శించారు.

   దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు గువహటి, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాల్లో పోలీసు, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్, జైలు ప్రతినిధులతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణులతో కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం ఐదు సమావేశాలు నిర్వహించింది. కొత్త నేర విచారణ చట్టాలపై జాతీయ నేర రికార్డుల సంస్థ (ఎన్‌సిఆర్‌బి)‘సంకలన్’ పేరిట వెబ్ అనువర్తనాన్ని ప్రారంభించి, తన వెబ్‌సైట్‌తోపాటు గూగుల్, ఐఒఎస్ ప్లే స్టోర్లలోనూ అప్‌లోడ్ చేసింది.

   అలాగే ప్రస్తుత ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్’ (సిసిటిఎన్ఎస్) అనువర్తనంలో 23 ఆచరణాత్మక సవరణలు చేసింది. అంతేగాక ఈ కొత్త వ్యవస్థలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నిరంతర సంధానం కోసం సాంకేతిక సాయం చేస్తోంది. మరోవైపు రాష్ట్రాలు/యూటీల నిరంతర సమీక్ష, చేయూత దిశగా 36 సహాయక బృందాలుసహా కాల్ సెంటర్‌ను కూడా ‘ఎన్‌సిఆర్‌బి’ ఏర్పాటు చేసింది. ఇక నేర ప్రదేశాలు/దృశ్యాల వీడియో/ఫోటోగ్రఫీ సౌలభ్యం కోసం  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) ‘‘ఇసాక్ష్య, న్యాయ్‌శ్రుతి, ఇసమన్’’ (eSakshya, NyayShruti, eSummon) అనువర్తనాలను రూపొందించింది. వీటి సాయంతో ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా న్యాయ విచారణ; కోర్టు సమన్‌లను వరుస క్రమంలో ఎలక్ట్రానిక్‌ రూపంలో జారీచేయడం, రాష్ట్రాలు/యూటీలతోపాటు ఇతర భాగస్వాములతో పంచుకోవడం వంటివి ఇకపై సులభమవుతాయి.

   కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

***


(Release ID: 2036601) Visitor Counter : 143