నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నైపుణ్య శిక్షణ పథకాలు

Posted On: 24 JUL 2024 3:18PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ (ఎస్ఐం) కింద నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు/కళాశాలలు/సంస్థలు మొదలైన విస్తృత యంత్రాంగంతో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), జన్ శిక్షణ్ సంస్థాన్ (జేఎస్ఎస్), నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్), కళాకారుల శిక్షణ పథకం (సీటీఎస్) వంటి వివిధ పథకాల కింద పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐల) ద్వారా దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు నైపుణ్యం, కొత్త నైపుణ్యాలు, నైపుణ్యోన్నతుల్లో శిక్షణ అందిస్తుంది. దేశంలోని యువతను పారిశ్రామిక నైపుణ్యాలతో భవిష్యత్ సంసిద్ధులుగా తీర్చిదిద్దడం స్కిల్ ఇండియా మిషన్ లక్ష్యం. ఈ పథకాల సంక్షిప్త వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై): ఇది దేశవ్యాప్తంగా యువతకు స్వల్పకాలిక శిక్షణ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి; ముందస్తు అభ్యసనను గుర్తించడం ద్వారా నైపుణ్యోన్నతితో పాటు, కొత్త నైపుణ్యాలు నేర్పించడానికి ఉద్దేశించిన పథకం.

జన శిక్షణ సంస్థాన్ (జేఎస్ఎస్) పథకం: 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కుల్లో అక్షరాస్యులు కానివారు, నవ అక్షరాస్యులు, ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారు, 12వ తరగతి వరకు బడి మానేసిన వారికి వృత్తి నైపుణ్యాలను అందించడం జేఎస్ఎస్ ప్రధాన లక్ష్యం. దివ్యాంగులు, అర్హులైన ఇతర వ్యక్తులకు వయసస్సు విషయంలో సడలింపు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ అల్పాదాయ ప్రాంతాల్లోని మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

జాతీయ అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహక పథకం (ఎన్ఏపీఎస్): ఈ పథకం అప్రెంటిస్‌షిప్ శిక్షణను ప్రోత్సహించడం, స్టైఫండ్ చెల్లింపుతో ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా అప్రెంటిస్‌ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినది. శిక్షణలో పరిశ్రమలోని పని ప్రాంతంలో ప్రాథమిక శిక్షణ, ఉద్యోగ శిక్షణ / ప్రయోగాత్మక శిక్షణలు ఉంటాయి.

కళాకారుల శిక్షణ పథకం (సీటీఎస్): దేశవ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ) ద్వారా దీర్ఘకాలిక శిక్షణను అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అందించడంతో పాటు యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐటీఐలు అనేక రకాల ఆర్థిక రంగాల పరిధిలో వృత్తి/ నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి.

నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ జయంత్ చౌదరి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ రోజు ఈ సమాచారం అందించారు.

***


(Release ID: 2036595)
Read this release in: English , Urdu , Hindi