రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు భారత సాయుధ దళాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
సాయుధ దళాల దృఢ నిశ్చయం, నిస్వార్థం, భీకర ధైర్యసాహసాలకు కార్గిల్ యుద్ధం పర్యాయపదంగా మారింది.
Posted On:
18 JUL 2024 6:03PM by PIB Hyderabad
ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు భారత సాయుధ దళాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. గ్రహించిన ముప్పును దృష్టిలో ఉంచుకుని మన యుద్ధ సన్నాహాలు, వ్యూహాలు, భావనలను మెరుగుపరుస్తున్నారు. కార్గిల్ విజయ్ దివస్‌కు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా 2024 జూలై 18న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి(సీడీఎస్) అనిల్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కార్గిల్ వీరులకు అవార్డులు సీడీఎస్.. యుద్ధంలో సైనికులు, వీరనారీలు చేసిన అపారమైన సహకారం, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ప్రయోజనానికి మద్దతు ఇచ్చినందుకు భారత రక్షణ పరిశ్రమను ఆయన ప్రశంసించారు.
భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న సాయుధ దళాలను తయారు చేసేందుకు దేశీయ మార్గాల ద్వారా మౌలిక సదుపాయాలు, బలమైన నిర్వహణ సౌకర్యాలు కల్పించేందుకు సామర్థ్య అభివృద్ధి కోసం ప్రగతిశీల పద్ధతిలో ప్రయత్నిస్తున్నట్లు జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. యుద్ధ సామర్థ్యాన్ని, సమర్థతను పెంపొందించడానికి బహుళ పునర్వ్యవస్థీకరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
బహుళ-డొమైన్, బహుళ-స్పెక్ట్రమ్ సవాళ్లకు సాయుధ దళాలు సిద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకతను భవిష్యత్తులో రానున్న సైనిక, సైనికేతర భద్రతా సవాళ్లు తెలుపుతున్నాయని నొక్కి చెప్పారు. భూమి, సముద్రం, గగనతలం, అంతరిక్షం, సమాచారం, సైబర్ స్పేస్ ఇలా అన్ని రంగాలు నిరంతరాయంగా ఏకీకృతం కావటం, నిర్వహణ విషయంలో సాయుధ దళాలకు చెందిన వివిధ శాఖల మధ్య సమన్వయ వ్యవస్థలను ప్రవేశపెట్టడం అనివార్యమని అన్నారు.
బలమైన, ప్రతిస్పందించే రక్షణ వ్యూహ అవసరాన్ని కార్గిల్ యుద్ధం నొక్కిచెప్పిందని అన్నారు. 'మన సరిహద్దులను రక్షించడానికి అప్రమత్తత, సంసిద్ధతను కొనసాగించే ప్రాముఖ్యతను కార్గిల్ యుద్ధం తెలిపింది. శత్రు దేశాల తటస్థతను కాపాడటానికి , ప్రపంచ దేశాల మద్దతును పొందడానికి సమర్థవంతంగా ఉపయోగపడే ప్రజా, అంతర్జాతీయ దౌత్య ప్రాముఖ్యతను కూడా ఇది నొక్కి చెప్పింది." అని సీడీఎస్ తెలిపారు.
సాయుధ దళాల ఏకీకరణ దిశగా తీసుకున్న చర్యల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ.. త్రివిధ దళాలు ఇప్పుడు ఉమ్మడి సంస్కృతిని పెంపొందించడానికి, అనేక రంగాలలో తమను తాము ఏకీకృతం చేసుకోవడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భారతదేశంలో స్వేచ్ఛాయుత, బహిరంగ మీడియా ఉన్న మొదటి టెలివిజన్ యుద్ధంగా కార్గిల్‌ను వర్ణించిన ఆయన.. వివిధ దృక్పథాల మధ్య సంఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా చూసే కోణాన్ని రూపొందిస్తున్నాయని, దీనితో 'ఇన్ఫర్మేషన్ డొమైన్' మరొక కీలక యుద్ధ వేదికగా ఆవిర్భవించిందని నొక్కి చెప్పారు.
సాయుధ దళాల దృఢసంకల్పం, నిస్వార్థం, భీకర ధైర్యసాహసాలకు కార్గిల్ యుద్ధం పర్యాయపదంగా మారిందని, భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులు, సవాళ్లపై దృష్టి సారించాలని దేశాన్ని సమిష్టిగా ప్రోత్సహిస్తుందని అన్నారు.
(Release ID: 2034330)
Visitor Counter : 101