వ్యవసాయ మంత్రిత్వ శాఖ

అంకుర సంస్థలు.. వ్యవసాయ పారిశ్రామికులకు ప్రభుత్వం చేయూత; త్వరలోనే ‘అంకుర-గ్రామీణ పరిశ్రమల వ్యవసాయ నిధి’ ప్రారంభం


ముంబైలో సన్నాహక భాగస్వామ్య సమావేశం సందర్భంగా
‘సుస్థిర వ్యవసాయం-హరిత పరిష్కారాలు’ హ్యాకథాన్ ప్రారంభం;

రూ.750 కోట్లతో కేటగిరీ-II ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఎఐఎఫ్) ఏర్పాటు;
ఈ నిధి ద్వారా వాటా మూలధనం/రుణం రూపేణా పెట్టుబడులతో
అంకుర సంస్థలు-వ్యవసాయ పారిశ్రామికులకు తోడ్పాటు;

ఈ మిశ్రమ మూలధన నిధి కోసం వ్యవసాయ-రైతు సంక్షేమ
శాఖ.. నాబార్డ్‌ నుంచి రూ.250 కోట్ల వంతున సమాన వాటా;

మిగిలిన రూ.250 కోట్లు ఆర్థిక సహాయ సంస్థల ద్వారా సమీకరణ;

నాబార్డ్‌ సంపూర్ణ యాజమాన్య అనుబంధ సంస్థ ‘నాబ్‌వెంచ‌ర్స్’ ద్వారా నిధి నిర్వహణ

Posted On: 12 JUL 2024 6:41PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు, వ్యవసాయ పారిశ్రామికులకు చేయూత దిశ‌గా కేంద్ర ప్రభుత్వం  ‘అంకుర-గ్రామీణ పరిశ్రమల వ్యవసాయ నిధి’ (అగ్రిష్యూర్)ని త్వరలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం నిర్దిష్ట, విభిన్న రంగాల వారీగానే కాకుండా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఎఐఎఫ్)లో పెట్టుబడులు పెడుతుంది. అలాగే వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలకు ప్రత్యక్ష వాటా మూలధనం రూపేణా ఆర్థిక సహాయం అందిస్తుంది. భారత వ్యవసాయ రంగంలో ఆవిష్కరణ-సుస్థిరతలను ప్రోత్సహించే ఈ వినూత్న కార్యక్రమ లక్ష్యంలో భాగంగా రూ.750 కోట్లతో కేటగిరీ-II ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఎఐఎఫ్)ని ఏర్పాటు చేస్తోంది. ఈ నిధి ద్వారా ఇటు వాటా మూలధనం, అటు రుణం రూపేణా పెట్టుబడులతో అంకుర సంస్థలకు, వ్యవసాయ పారిశ్రామికులకు తోడ్పాటునిస్తుంది. అంతేగాక వ్యవసాయ రంగ విలువ శ్రేణిలో అధిక-నష్టభయంగల, అధిక-ప్రభావం చూపే కార్యకలాపాలు సజావుగా సాగేవిధంగా నిశిత దృష్టి సారిస్తుంది.

   ముంబైలోని నాబార్డ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో సన్నాహక భాగస్వామ్య సమావేశం సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సహాయ సంస్థల, ‘ఎఐఎఫ్’ నిర్వాహక సంస్థల, వ్యవసాయ అంకుర సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు తదితర కీలక భాగస్వాములందరూ పాల్గొన్నారు. దీనికి హాజరైన ప్రత్యేక అతిథులలో వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అజీత్ కుమార్ సాహు; నాబార్డ్ చైర్మన్ శ్రీ షాజీ కె.వి; నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీ గోవర్ధన్ సింగ్ రావత్, డాక్టర్ అజయ్ కుమార్ సూద్ కూడా ఉన్నారు.

   ఈ సందర్భంగా శ్రీ అజీత్ కుమార్ సాహు ప్రసంగిస్తూ- దేశంలో వ్యవసాయ రంగానికి నిధుల లభ్యతను పెంచే పర్యావరణ వ్యవస్థ సృష్టిలో ఈ నిధికిగల సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దిశగా అనుసరించే వినూత్న విధానాలు చిన్న-సన్నకారు రైతులకూ లబ్ధి చేకూరుస్తాయని ఆయన వివరించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఉన్నతస్థాయి వృద్ధి సాధించే కృషిలో ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య సన్నిహిత సహకారం ఆవశ్యకతను శ్రీ షాజీ కె.వి., నొక్కిచెప్పారు.

   ఈ వినూత్న ‘అగ్రిష్యూర్’ నిధి ముఖ్యాంశాలను ‘నాబ్‌వెంచ‌ర్స్’ సీఈవో వివరించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నాబార్డ్  నుండి రూ.250 కోట్ల చొప్పున రూ.500 కోట్లు, ఇతర ఆర్థిక సహాయ సంస్థల నుంచి మరో రూ.250 కోట్ల వాటా ద్వారా రూ.750 కోట్ల మూలనిధితో ఇది ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో నవ్యావిష్కరణలు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ శ్రేణి మెరుగు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి సృష్టిసహా రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పిఒ)కు చేయూతపై ఈ నిధి ప్రధానంగా దృష్టి సారిస్తుంది. రైతులకు అద్దె యంత్రాల సరఫరా, సమాచార సాంకేతికత ఆధారిత పరిష్కార సేవల ప్రదానాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. నాబార్డ్‌ సంపూర్ణ యాజమాన్య అనుబంధ సంస్థ ‘నాబ్‌వెంచ‌ర్స్’ ఈ నిధి నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ‘అగ్రిష్యూర్’ నిధి పదేళ్లపాటు కొనసాగనుండగా, అవసరమైతే మరో రెండేళ్లకుపైగా పొడిగించే వీలుంది.

   ఆవిష్కరణలకు ప్రోత్సాహంపై తమ నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తూ ‘అగ్రిష్యూర్ గ్రీన్‌థాన్‌-2024’ను నాబార్డ్ ఏర్పాటు చేసింది. మూడు కీలకాంశాల్లో సమస్యల పరిష్కారాన్వేషణ ఈ హ్యాక‌థాన్‌ లక్ష్యం. ఈ మేరకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతల అనుసరణలో అధిక వ్యయ భారంవల్ల చిన్న-సన్నకారు రైతుల వెనుకంజ సమస్యకు ‘‘పరిమిత బ‌డ్జెట్‌తో ఆధునిక వ్యవసాయం’’ కింద పరిష్కారం సూచించడం మొదటి అంశం. అలాగే ‘‘వ్యవసాయ వ్యర్థాలను లాభదాయక వ్యాపార అవకాశంగా మార్చడం’’పై దృష్టి సారిస్తూ వ్యర్థాల వినియోగ పరిశ్రమలను ప్రోత్సహించడం రెండోది. కాగా, భూసార పునరుద్ధరణ వ్యవసాయ పద్ధతుల అనుసరణలో అవరోధాలను అధిగమించే దిశగా ‘‘భూసార పునరుద్ధరణ వ్యవసాయాన్ని లాభదాయకం చేసే సాంకేతిక పరిష్కారాన్వేషణ’’ మూడో అంశంగా ఉంది.

   భారత వ్యవసాయ రంగ పురోగమనానికి అనేక సమస్యలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి వినూత్న ఆవిష్కరణలతో ముందుకు రావాలని యువ పరిశోధకులకు నాబార్డ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. తద్వారా ‘వికసిత భారత్’ గమ్యంవైపు జాతి పయనంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

 

***



(Release ID: 2033048) Visitor Counter : 55