కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘గ్రామీణ ప్రాంతాల పరివర్తన : 5జి ఇంటలిజెంట్ గ్రామాల రూపకల్పన’ అనే అంశం పై వర్క్ షాప్ నిర్వహించిన టెలికమ్యూనికేషన్ల శాఖ.
సుస్థిరాభివృద్ధి,ఆవిష్కరణలను ప్రోత్సహించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన 5జి ఇంటెలిజెంట్ గ్రామాల వర్క్ షాప్.
వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పాలన, సుస్థిరత వంటి కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ఈ వర్క్ షాప్ లక్ష్యం.
గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడ సాంకేతికతను సమకూర్చి వాటిని 5జి అవగాహన కలిగిన గ్రామాలుగా
తీర్చిదిద్దేందుకు పరిశ్రమ వర్గాలు, టిఎస్ పిలు ముందుకు రావాలని టెలికం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిత్తల్ పిలుపు.
Posted On:
10 JUL 2024 3:56PM by PIB Hyderabad
‘గ్రామీణ ప్రాంతాల పరివర్తన : 5జి అవగాహన కలిగిన గ్రామాలకు రూపకల్పన’ అనే అంశం పై ఈరోజు ఢిల్లీలో వర్క్ షాప్ జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజల జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రాగల ,పరివర్తనాత్మక శక్తిగల భవిష్యత్ సాంకేతికతలైన 5జి వంటి వాటిపై ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఈ వర్క్ షాప్ ను డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి.ఒ.టి) ఏర్పాటు చేసింది . గ్రామీణ అభివృద్ధి కోసం 5జి సాంకేతికత సామర్ధ్యాన్ని సద్వినియోగం చేసే కృషికి ఈ విభాగం నాయకత్వం వహిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల పరివర్తన
5జి అవగాహన కలిగిన గ్రామాల రూపకల్పనపై వర్క్ షాప్
ప్రధాన లక్ష్యం
నెట్ వర్క్ అభివృద్ధి – వైఫై రోమింగ్ – కామన్ ఇంటెలిజెంట్ విలేజ్ అప్లికేషన్ వ్యవస్థ- భద్రమైన లావాదేవీలకు నెట్ వర్క్ స్లైసింగ్
యూజ్ కేసెస్ – స్మార్ట్ హెల్త్ – స్మార్ట్ అగ్రికల్చర్ – స్మార్ట్ ఎడ్యుకేషన్ – స్మార్ట్ పంచాయత్
గ్రామీణాభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం ప్రభుత్వ ప్రాధాన్యత అన్న విషయాన్ని ఈ వర్క్ షాప్ మరింత నొక్కిచెప్పింది. అనుసంధానత ను మెరుగుపరచడంతో పాటు, డిజిటల్ అక్షరాస్యత, గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను గణనీయమైన స్థాయిలో పెంచే సుస్థిర విధానాలకు సంబంధించి తీసుకున్న చర్యలను ఈ వర్క్ షాప్ ప్రముఖంగా ప్రస్తావించింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిత్తల్ ఈ వర్క్షాప్ లో ప్రారంభోపన్యాసం చేస్తూ, ఇంటలిజెంట్ గ్రామాల దార్శనిక లక్ష్యాన్ని సాధించేందుకు, సమష్టి కృషికి గల ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన స్మార్ట్ గ్రామాలు, ఇంటెలిజెంట్ గ్రామాల భావన గురించి చర్చించారు. ఆయా కమ్యూనిటీలు పరస్పరం చర్చించుకోవడానికి, తమ పరిసరాల విషయంలో ఎరుక కలిగి ఉండడానికి , డాటా పంపడానికి, విజ్ఙానాన్ని అందిపుచ్చుకోవడానికి , సరైన సమాచారం ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాజాలకు గల సామర్ధ్యం గురించి ఆయన ప్రస్తావించారు.. పరిశ్రమ వర్గాలు, టి.ఎస్.పి లు ముందుకు వచ్చి, గ్రామాలను దత్తత తీసుకోవాలని, ఆయా గ్రామాలను ఇంటెలిజంట్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సాంకేతికతను అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ వర్క్ షాప్ , మన గ్రామీణ ప్రాంతాల సుసంపన్న, సుస్థిర భవిష్యత్కు అవసరమైన స్మార్ట్ పరిష్కారాలను, టెస్ట్ యూజ్ కేస్ లను రూపొందించగలదన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
టెలికం విభాగం సభ్యులు శ్రీమతి మధు అరోరా మాట్లాడుతూ, నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాలకు గ్రామీణ ప్రాంతాలలో అన్ని ప్రజా జీవన రంగాలు అంటే విద్య, ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, సహజవనరులను జాగ్రత్తగా వాడుకోవడం వంటి అన్నిరంగాలను ఉన్నత స్థాయికి తీసుకుపోగల శక్తి ఉందని అ న్నారు.
డి.డి.జి , శ్రీ ఎ. రాబర్ట్ జె.రవి మాట్లాడుతూ, సాంకేతికత గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల జీవనానికి వాస్తవంగా మరింత విలువ చేకూర్చేదిగా ఉండాలని అన్నారు. ఇందుకు మనం 5జి ఇంటెలిజెంట్ గ్రామాలను రూపొందించేందుకు, ఇంటెలిజెంట్ డిస్ప్లే నుంచి మైక్రో రోబోట్స్ వరకు, వినూత్న పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ఇవి అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందని , మొత్తంగా ఇది సమాజానికి , ప్రత్యేకించి గ్రామీణ ప్రజానీకానికి ఉపకరిస్తుందని చెప్పారు.
ఈ వర్క్ షాప్లో పలు సెషన్లు నిర్వహించారు. అందులో ‘ గ్రామీణ అనుసంధానతకు అండగా నిలవడం’, వాస్తవ ప్రపంచంలో పరీక్షించి చూసిన అంశాలు, ఆవిష్కరణలు, కృత్రిమ మేథ ఆధారిత రియల్ టైమ్ పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో 5 జి నెట్ వర్క్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సెషన్లు జరిగాయి. ఇంటెలిజెంట్ గ్రామాలకు రూపకల్పనకు సంబంధించి ప్యానల్ చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ లిటరసీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రజెంటేషన్ లు , చర్చలు జరిగాయి. ఈ వర్క్ షాప్ కు హాజరైన వారు, పరిశ్రమకు చెందిన నిపుణులతో, తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కింది. అలాగే ఈ సాంకేతికతలు తమ కమ్యూనిటీలలో ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగ పడతాయన్న విషయాన్ని తెలుసుకోవడానికీ ఇది ఉపయోగపడింది.
డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు చెందిన సీనియర్ అధికారులు, పరిశ్రమకు చెందిన వారు, చిన్న, మధ్య తరహా, సూక్ష్మ ఎంటర్ ప్రైజ్లు, స్టార్టప్ లు, విద్యా రంగానికి చెందిన వారు, ఈ రంగానికి చెందిన ఇతరులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సాంకేతికత, గ్రామీణాభివృద్ధిని సమ్మిళితం చేయడం ఈ వర్క్ షాప్ లక్ష్యం. అత్యధునాతన ఆవిష్కరణలు అంటే 5జి వంటి వాటిని గ్రామీణ సంప్రదాయ విధానాలతో అనుసంధానం చేయడాన్ని సుస్థిర ప్రగతి సాధనకు , గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు ఒక మార్గంగా ఈ వర్క్షాప్ లో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది.
డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చేపట్టిన 5జి ఇంటెలిజెంట్ కార్యక్రమం అన్ని రంగాలలో సమాంతర సాంకేతిక అభివృద్ధి అవసరానికి తగిన విధంగా స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 5జి సాంకేతికతకు గల పరివర్తనాత్మక శక్తిని వినియోగించుకుంటుంది. “అనుసంధానత అంతరాలనుంచి స్మార్ట్ పరిష్కారాల వరకు: గ్రామీణ ఆవిష్కరణల కోసం 5జి నెట్ వర్క్ ల రూపకల్పన– 5జి ఇంటెలిజెంట్ గ్రామాలు”అనేది వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పాలన, సుస్థిరత వంటి కీలక అంశాలకు సంబంధించిన సమస్యలకు కృషిచేయనుంది. ( లింక్.......)
ఇలాంటి పురోగామి చర్యల ద్వారా ప్రభుత్వం , గ్రామీణ ప్రాంతాలు అంతర్జాతీయ సాంకేతిక పురోగతి, సుస్థిరతలో వెనుకబడకుండా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామీణ ప్రాంతాలకు సాధికారత కల్పించడంలో ఇంటెలిజంట్ గ్రామాలకు సంబంధించి నిర్వహించిన వర్క్ షాప్ కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఇది భవిష్యత్ సాంకేతికతలను, సుస్థిర విధానాలను ఇంటెలిజెంట్ గ్రామాల అభివృద్ధిలో సమ్మిళితం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందన్న విషయాన్ని సుస్ఫష్టం చేస్తోంది.
(Release ID: 2032601)
Visitor Counter : 100