సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కంబోడియా సివిల్ సర్వెంట్లకు ప్రభుత్వ విధానం, పాలనపై 5వ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ఢిల్లీలోని జాతీయ సుపరిపాలన కేంద్రంలో విజయవంతంగా పూర్తైంది.
పౌరసేవల మంత్రిత్వ శాఖ, కంబోడియా సెనేట్ కు చెందిన 40 మంది సీనియర్ అధికారులు ఈ 2 వారాల కార్యక్రమంలో పాల్గొన్నారు
కంబోడియాకు చెందిన 196 మంది సివిల్ సర్వెంట్లకు జాతీయ సుపరిపాలన కేంద్రంలో ఇప్పటివరకు శిక్షణ ఇచ్చారు.
Posted On:
06 JUL 2024 3:49PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని జాతీయ సుపరిపాలన కేంద్రం (NCGG) కంబోడియా సివిల్ సర్వెంట్లకు ప్రభుత్వ విధానం, పాలనపై ఐదో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో 2024 జూన్ 24 నుంచి జూలై 5 వరకు రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంబోడియా నుంచి 40 మంది సివిల్ సర్వెంట్లు హాజరయ్యారు. వారిలో సివిల్ సర్వీసెస్ మంత్రిత్వ శాఖ, కంబోడియా సెనేట్ జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రటరీ ఉన్నారు. విధాన చర్చలు, ఉత్తమ ఆచరణ విధానాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమం వేదికను అందించింది. సంస్థాగత పరివర్తన, పౌరుల భాగస్వామ్యంపై భాగస్వాములకు విలువైన భావనలను అందిస్తుంది.
ముగింపు సభకు సుపరిపాలన కేంద్రం డైరెక్టర్ జనరల్, భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి వి. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక, చారిత్రక సంబంధాల ప్రాధాన్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పౌరులకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను సరళీకృతం చేయడం ప్రభుత్వోద్యోగుల పాత్ర అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని అనుకూలీకరిస్తూ పౌరులను ప్రభుత్వానికి మరింత చేరువ చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని, ఫిర్యాదుల పరిష్కార నమూనా ద్వారా ఉదాహరణలను ఉటంకిస్తూ వివరించారు. అద్భుత ప్రదర్శన ఇచ్చారంటూ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను అభినందించారు.
గౌరవ అతిథి కంబోడియా హైకమిషనర్ కోయ్ కువోంగ్ రెండు దేశాల నాగరికతల మధ్య ప్రాచీన సంబంధాల గురించి మాట్లాడారు. తమ అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారత ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాలు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని; తీర్థయాత్రలు, వైద్య అవసరాల కోసం ప్రజలు దేశాల మధ్య ప్రయాణిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనవారు దీని ద్వారా గ్రహించిన అంశాలను ఆకర్షణీయంగా ప్రదర్శించడం ప్రోత్సాహకరంగా ఉందన్నారు. మానవ మూలధన నిర్మాణం లక్ష్యంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఇరుదేశాల మధ్య సహకారానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు. సాధారణ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి అవి ఆవశ్యకం, తద్వారా సుపరిపాలనను సాధించడంలో దోహదపడతాయి.
ఈ అవకాశం కల్పించిన భారత ప్రభుత్వానికి కంబోడియా సెనేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, కంబోడియా ప్రతినిధి బృందం అధిపతి సే పగ్న్వతే కృతజ్ఞతలు తెలిపారు. కంబోడియా సివిల్ సర్వీస్ అధికారులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎన్సీజీజీ డైరెక్టర్ జనరల్ శ్రీ వి.శ్రీనివాస్, శిక్షణ బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విధానం, పాలన రంగంలోని అనేక ఉత్తమ ఆచరణలపై వారు ఎలా నేర్చుకున్నారో, దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆమె వివరించారు. ఇలాంటి అనుభవం కోసం తాము ఎదురు చూస్తున్నామని, దీనివల్ల అధికారులు తమ దేశ ప్రజలకు మెరుగైన సేవలు అందించి, సుపరిపాలనకు దోహదపడుతారని ఆమె అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తమ అభ్యసన ఫలితాల్లో భాగంగా ‘కంబోడియాలో విధాన రూపకల్పన, అమలులో పౌర సేవల పాత్ర’, ‘కంబోడియాలో సామాజిక రక్షణ’, ‘మిశ్రణ సాంకేతికత దిశగా కంబోడియా, 2050’, ‘విధాన రూపకల్పన, అమలులో కంబోడియా పార్లమెంటు పాత్ర’ అనే అంశాలపై నాలుగు విస్తృతమైన, విలువైన ప్రదర్శనలు అందించారు.
ఎన్సీజీజీ అసోసియేట్ ప్రొఫెసర్, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ బి.ఎస్.బిష్త్ ఈ కార్యక్రమంపై సవివరమైన సమాచారాన్ని అందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం - మొదటి వారంలో ప్రభుత్వ విధానం, నిర్వహణ సహా వివిధ అంశాలపై శిక్షణలో దృష్టి సారించారు. ప్రభుత్వ సేకరణలో పారదర్శకత, భారత రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంటు, భారత్-కంబోడియా సంబంధాలు, మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, సుపరిపాలన సాధనంగా ఆధార్, ఆరోగ్య పాలన, పాలనపై పార్లమెంటరీ సాధనాల ప్రభావం, వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఉత్తమ విధానాలు, 2023 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే విధానాలు మొదలైనవి అందులో ఉన్నాయి. వికసిత భారత్: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలలో విధానాలు, అభివృద్ధి; ఆర్థిక సమ్మిళితత్వం, పాలన, నాయకత్వం, కమ్యూనికేషన్ లో మారుతున్న నమూనా; పట్టణ పాలన మరియు సుస్థిర నగరాలు, భారతదేశంలో పౌరసేవలు, ఇంటివద్దకే సేవలందించడం, ఈ-గవర్నెన్స్ మరియు ప్రజాసేవలను సాంకేతికంగా అందించడం, లింగ సమానత, పాలనలో నైతికత, ఫసల్ బీమా యోజన ఆదర్శవంతమైన అమలుపై పీఎం అవార్డు మొదలైనవి ఉన్నాయి.
రెండో దశలో డెహ్రాడూన్ లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, సమాచార సాంకేతికాభివృద్ధి సంస్థ; ఉత్తరప్రదేశ్ లోని గౌతమబుద్ధ నగర్ పాలన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, భారత పార్లమెంటుల క్షేత్ర పర్యటన నిర్వహించారు. ప్రధాని సంగ్రహాలయ, బుద్ధ ఆలయం, తాజమహల్ సందర్శన సందర్భంగా దేశ చరిత్ర, సంస్కృతిని ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.
బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, నేపాల్, భూటాన్, మయన్మార్, ఇథియోపియా, ఎరెట్రియా, కంబోడియా వంటి 17 దేశాల సివిల్ సర్వెంట్లకు జాతీయ సుపరిపాలన కేంద్రం శిక్షణ ఇవ్వడం గమనార్హం.
ముగింపు వేడుకకు ఎన్సీజీజీ సీఈవో ప్రిస్కా మాథ్యూస్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమాన్షి రస్తోగి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గజాల హసన్ తదితరులు హాజరయ్యారు. ఎన్సీజీజీ సామర్థ్య నిర్మాణ బృందంతో పాటు కోర్సు సమన్వయకర్త డా. బి.ఎస్. బిష్త్, సహ సమన్వయకర్త డా. సంజీవ్ శర్మ, శిక్షణ సహాయకుడు బ్రిజేశ్ బిష్త్, యువ అధికారి మోనీషా బహుగుణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
***
(Release ID: 2031438)
Visitor Counter : 69