కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రాతో ఇండస్ట్రీ ఇంటరాక్షన్
"డెమోగ్రఫిక్ డివిడెండ్, కార్మిక సంస్కరణలు భవిష్యత్ అభివృద్ధికి చోదకాలు”: శ్రీమతి దావ్రా
గడిచిన ఐదేళ్లలో (2021-22 వరకు) భారతదేశంలో 8 కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి
2023-24 కాలంలో 1 కోటికి పైగా ఉద్యోగ ఖాళీలు ఎన్.సి.ఎస్. పోర్టల్‌పై సమీకరించబడ్డాయి
పరిశ్రమలో నాణ్యమైన ఉపాధి కల్పనను సులభతరం చేయడం, కార్మిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించిన సి.ఐ.ఐ., ఇ.ఎఫ్.ఐ.
Posted On:
06 JUL 2024 4:04PM by PIB Hyderabad
కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సి.ఐ.ఐ.), ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఇ.ఎఫ్.ఐ.)ల ఆధ్వర్యంలో 5 జూలై 2024న హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌లో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా పాల్గొన్నారు.
ఈ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో, కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా భారతదేశం యొక్క వేగవంతమైన వృద్ధి రేటును ప్రధానంగా ప్రస్తావించారు, తయారీ, సేవా రంగ విస్తరణ, మౌలిక సదుపాయాలు మొదలైన ఇతర వృద్ధి ఇంజిన్‌లతో పాటు భవిష్యత్ వృద్ధి కోసం భారతదేశం యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్, కార్మిక సంస్కరణలు కీలకమైనవని పేర్కొన్నారు.
ఆర్.బి.ఐ. యొక్క కె.ఎల్.ఇ.ఎమ్.ఎస్ డేటాను ఉటంకిస్తూ, భారతదేశంలో గత ఐదేళ్లలో [2021-22 ముగింపు సమయానికి] దాదాపు 8 కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయని, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా గల వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు (పి.ఎల్.ఐ., మేక్ ఇన్ ఇండియా వంటివి), సేవా రంగం విస్తరణ, మైక్రో క్రెడిట్ యాక్సెస్, పెట్టుబడులు, గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జి.సి.సి.లు), స్టార్టప్స్ మొదలైనటువంటి కొత్త రంగాల ఆవిర్భావం వంటి వాటి ద్వారా ఇది సాధ్యమైందన్నారు. 2030 నాటికి దాదాపు 2.3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందనే అంచనాలు గల గిగ్ ఎకానమీని గురించి ఆమె మరింత ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కార్మిక చట్టాలను నేరరహితం చేయడం సహా నిబంధనలు మరియు పరిపాలనా ప్రక్రియలను సులభతరం చేయడం తద్వారా వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, అనుమతుల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా 29 కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్‌లుగా ఏకీకృతం చేయడం గురించి దావ్రా చర్చించారు. మెరుగైన దేశీయ, విదేశీ పెట్టుబడులు, సప్లయ్ చైన్స్, గ్లోబల్ వాల్యూ చైన్స్ భారతదేశానికి తీసుకురావడంలో ఇది ఆకర్షణీయంగా ఉంటుందని ఆమె తెలిపారు. సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని, మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని పెంచుతాయని, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమంలో మెరుగుదల సాధ్యపడుతుందని, ఇవన్నీ భారతదేశాన్ని సమ్మిళిత వృద్ధి సాధన దిశగా నడిపిస్తాయని ఆమె అన్నారు. ప్రస్తుతం, భారతదేశ జిడిపి 3 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని అయితే కార్మిక సంస్కరణలు సహా వివిధ కార్యక్రమాల కారణంగా ఇది 2047 నాటికి 33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఐ.సి.), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇ.పి.ఎఫ్.ఓ.)లలో పాలనాపరమైన సంస్కరణల అవసరాన్ని గుర్తిస్తూనే అసంఘటిత మరియు అనధికారిక రంగాలకు సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడం యొక్క ప్రాముఖ్యతను శ్రీమతి దావ్రా ప్రధానంగా ప్రస్తావించారు. ఆమె ఇ.ఎస్.ఐ.సి., ఇ.పి.ఎఫ్.ఓ.లలో క్లెయిమ్‌ల స్వయంచాలక పరిష్కారం, తిరస్కరణలను తగ్గించడం, ఇ.పి.ఎఫ్.ఓ.లో క్లెయిమ్‌ల పరిష్కార వేగాన్ని మెరుగుపరచడం, అలాగే ఇ.ఎస్.ఐ.సి.లో సేవల కవరేజ్ మరియు నాణ్యతను మెరుగుపరచడం వంటి వివిధ విధానపరమైన సంస్కరణలను కూడా హైలైట్ చేశారు.
ఈ ఇంటరాక్షన్ సందర్భంగా, ఇ.ఎస్.ఐ.సి. మరియు ఇ.పి.ఎఫ్.ఓ.లలో వివిధ విధానపరమైన సంస్కరణలను గురించి డిజిటలైజేషన్, ఇ-గవర్నెన్స్, అనుమతులను సులభతరం చేయడం వంటి అంశాలను వివరిస్తూ ప్రజెంటేషన్స్ ఇవ్వబడినవి, ఈ విధానాలను మరింత మెరుగుపరచడానికి పార్టిసిపెంట్స్ సూచనలను స్వీకరించే లక్ష్యంతో చర్చలు జరిగాయి.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్.) పోర్టల్ కూడా కెరీర్ కౌన్సెలింగ్, ఉపాధి నెట్‌వర్కింగ్ కోసం సమగ్ర పరిష్కారంగా చూపబడింది. 2023-24లో ఎన్.సి.ఎస్. పోర్టల్‌లో 1 కోటి కంటే ఎక్కువ ఉద్యోగాల ఖాళీలు సమీకరించబడినట్లు ప్రధానంగా ప్రస్తావించబడింది. లేబర్ మార్కెట్‌లో నైపుణ్య అంతరాన్ని తగ్గించడానికి పోర్టల్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చేయడానికి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నుండి ఎస్.ఐ.డి.హెచ్. డేటాబేస్‌ను పోర్టల్ ఏకీకృతం చేస్తుంది. రెండు మంత్రిత్వ శాఖల డేటాబేస్‌ల నిరంతర ఏకీకరణ యువతను నైపుణ్యాలు, ఉపాధి రెండింటినీ సమర్థవంతంగా అనుసంధానిస్తుంది, ఫలితంగా లేబర్ మార్కెట్లో డిమాండ్-సరఫరా అంతరాన్ని సమలేఖనం చేస్తుంది.
ఆర్థికాభివృద్ధి, ఉపాధి వృద్ధి కోసం సానుకూల వాతావరణాన్ని కల్పించుటకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకార ప్రయత్నాలను ఈ సెషన్ ప్రధానంగా ప్రస్తావించింది. పరిశ్రమ, ఇతర వాటాదారుల అభిప్రాయాన్ని పొందడంతో పాటు, అవగాహన కల్పించేందుకు, సంస్కరణలను సమర్థంగా అమలు చేయడానికి ఇటువంటి ఇంటరాక్షన్స్ కీలకమైనవి అవుతాయి.
సెషన్‌లో పాల్గొన్న 300 మందికి పైగా పరిశ్రమల ప్రతినిధులు భారతదేశ ఆర్థిక దృశ్య రూపకల్పనలో కీలకమైన కార్మిక మరియు ఉపాధి సంస్కరణల గురించి ఆసక్తిగా చర్చించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఇ.పి.ఎఫ్.ఓ., ఇ.ఎస్.ఐ.సి., తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
భారతదేశంలో ఉపాధి కల్పన, కార్మిక సంస్కరణలు, సులభతర వ్యాపారం చేయడం గురించి ప్రభుత్వ అధికారులు మరియు పరిశ్రమల వాటాదారుల మధ్య చర్చలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.
***
(Release ID: 2031292)
Visitor Counter : 111