నీతి ఆయోగ్
స్టోరీస్ ఆఫ్ చేంజ్ ఎడిషన్ 2’ ఆవిష్కరణతో పాటు సామాజిక విద్యార్థి ఆవిష్కర్తల పట్టభద్రతను నిర్వహించిన అటల్ ఆవిష్కరణల మిషన్
Posted On:
05 JUL 2024 6:22PM by PIB Hyderabad
నీతిఆయోగ్ మొదలుపెట్టిన అటల్ ఆవిష్కరణల మిషన్ (అటల్ ఇన్నొవేషన్ మిషన్ - AIM)లో జూలై 5న కీలక ఘట్టం చోటుచేసుకుంది. మిషన్ రెండో బ్యాచ్ విద్యార్థి సామాజిక ఆవిష్కర్తల బృందం పట్టభద్రతను పొందింది. అంతేకాకుండా, ‘స్టోరీస్ ఆఫ్ చేంజ్ ఎడిషన్ 2’ను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. మెరుగైన ప్రపంచానికి ఆవశ్యకమైన మార్పులను తమ అభిరుచిగా చేసుకుని జీవించే ధైర్యవంతులపై ఇది దృష్టి సారించింది.
క్షేత్రస్థాయి ఆవిష్కరణలు, దేశవ్యాప్తంగా వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ దృఢనిశ్చయాన్ని నిర్ధారిస్తూ భాగస్వాముల పరివర్తన గమనం పరాకాష్టకు చేరింది. దేశంలో సేవలు పొందని/తక్కువ సేవలు పొందుతున్న ప్రాంతాలకు అటల్ సామాజిక ఆవిష్కరణ కేంద్రాల (ACIC) ద్వారా సేవలందించాలని, క్షేత్రస్థాయిలో ప్రతి ఆవిష్కర్తకు మద్దతు అందించాలని, 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి త్వరితగతిన మార్గం సుగమం చేయాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకున్నది.
విశిష్ట వక్తలు ఈ కార్యక్రమంలో తమ విలువైన సందేశాలు అందించారు. స్థానిక ఆవిష్కరణలు, సామాజిక పురోగతిని నడిపించడంలో సహకార భాగస్వామ్యాల ఉత్ప్రేరక పాత్రను క్యాప్‌జెమినీ ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ & సీఎస్ఆర్ లీడర్ అనురాగ్ ప్రతాప్ సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు.
‘‘ఈ ఆవిష్కర్తలు తమ సమూహాలకే కాకుండా విస్తృతంగా సమాజానికి కూడా ఆదర్శవంతమైన వ్యక్తులుగా నిలుస్తారు. ఒక్కో వ్యాపారమూ అభివృద్ధి చెందడం నాకు చాలా ఆనందాన్నిస్తోంది – ఇది ముడి బంగారాన్ని ఆభరణంగా మార్చడం వంటిది. వారి ప్రయాణం ప్రశంసనీయమైనది, నిరంతర మద్దతు, సౌలభ్యాల కల్పన ద్వారా ప్రభావవంతమైన మార్పు దిశగా వారి సమర్థతను ఇది నిరూపించింది’’ అని సింగ్ అన్నారు.
సామాజిక సవాళ్లను పరిష్కరించడంలో సామాజిక వ్యవస్థాపకత ప్రభావాన్ని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ లీడ్ సీఎస్ఆర్ & డైరెక్టర్ డాక్టర్ సురేష్ రెడ్డి కొనియాడారు. వినూత్న పరిష్కారాలు, సుస్థిరమైన మార్పును సాధించేందుకు అంకితభావంతో ఉన్నారంటూ సామాజిక విద్యార్థి ఆవిష్కర్తలను (సీఐఎఫ్) ఆయన అభినందించారు.
‘‘ప్రధాన సూత్రం ‘నీకు నువ్వే యజమానివి’. ఏటీఎల్, ఇంక్యుబేషన్ కేంద్రాలు, ఏసీఐసీ కేంద్రాలు, సామాజిక నిర్మాణాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయి నుంచి అంకుర సంస్థల కోసం నీతి ఆయోగ్ పుష్కలమైన అవకాశాలు అందించింది. సమష్టితత్వం ద్వారా స్థిరత్వంతో పాటు ఆవిష్కరణలను నడిపించగలం, బలమైన, స్థితిస్థాపకమైన దేశాన్ని నిర్మించగలం’’ అని డాక్టర్ రెడ్డి అన్నారు.
టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో సీఐఎఫ్ కార్యక్రమాన్ని అభినందిస్తూ అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ కీలకోపన్యాసం చేశారు. ఆరోగ్య రక్షణ, విద్య, వ్యవసాయం, ఆర్థిక సేవలలో పరిష్కారాలను సుస్థిరాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
“మనమిప్పుడు వ్యాపార ఉద్భవనాన్ని విద్యారంగంతో ఏకీకృతం చేసే శక్తిమంతమైన సంస్థలను స్థాపించాం. ఉత్తమంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. సామాజిక సమస్యలపై లోతైన అవగాహన సామాజిక ఆవిష్కర్తల ప్రత్యేకత. ఆవిష్కరణ, అంకుర సంస్థలలో సాంప్రదాయక హద్దులు చెరిపేయాలని ఉవ్విళ్లూరుతున్న యువత ఆకాంక్షలను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. ఇందులో కాఠిన్యం, ఔచిత్యం రెండూ ఉన్నాయి. దాని లక్ష్యం, ప్రభావం స్ఫూర్తిదాయకమైనవి’’ అని డాక్టర్ వైష్ణవ్ అన్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్టోరీస్ ఆఫ్ చేంజ్ ఎడిషన్ 2’ ప్రారంభోత్సవంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సంకలనంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ వ్యవస్థలోని క్షేత్రస్థాయి ఆవిష్కర్తల ఆకర్షణీయమైన కథనాలున్నాయి. ప్రతి కథ స్థితిస్థాపకత, సృజనాత్మకత, పరివర్తనాత్మక ప్రభావానికి నిదర్శనం.
‘స్టోరీస్ ఆఫ్ చేంజ్’ గురించి -
ఈ సంకలనంలోని కొన్ని విశిష్టమైన కథలు:
- స్టాన్జిన్ జోర్డెన్ లడాఖ్ బాస్కెట్ – ఇది స్థానిక కళానైపుణ్యం, సుస్థిర జీవనోపాధిని ప్రోత్సహించడం ద్వారా లడాఖ్ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే కార్యక్రమం. రైతులు, చేతివృత్తుల వారి సహకారంతో లడాఖ్ బాస్కెట్ ప్రామాణికత, నాణ్యతను ప్రతిబింబించే స్వదేశీ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది.
- యోషా గుప్తా స్థాపించిన మెమెరకి – ముంబైకి చెందిన ఈ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంప్రదాయక హస్తకళలతో మిళితం చేసి భారతదేశ వారసత్వ కళలను పునరుద్ధరిస్తుంది. ఈ సాంస్కృతిక సాంకేతిక వేదిక నైపుణ్యాల సాంకేతికీకరణ, అంతర్జాతీయ అవకాశాలను అందించడం, సుస్థిర ఆర్థిక అవకాశాలను సృష్టించడం ద్వారా చేతివృత్తుల వారికి సాధికారత కల్పిస్తుంది.
- అతుల్ కుమార్ శిల్పకారి కార్యక్రమం – రాంచీ, బంకురాలో చేతివృత్తులకు వేదికను అందించడం ద్వారా గిరిజన చేతివృత్తుల ప్రజలకు మద్దతిస్తున్నది. ధోక్రా కళ నుండి వెదురు హస్తకళల వరకు, కళాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహిస్తూ, జీవనోపాధిని కల్పిస్తూ సాంస్కృతిక సంప్రదాయాలను శిల్పకారి పరిరక్షిస్తున్నది.
- బీరేన్ సింగ్ పవర్ హ్యాండ్లూమ్ – మణిపూర్ లో సాంప్రదాయక వస్త్రోత్పత్తిని ఆధునికీకరించింది. శతాబ్దాల నాటి నేత పద్ధతులను మెరుగుదిద్దుతూ, ఈ విప్లవాత్మక యంత్రం ఉత్పాదకతను పెంచుతుంది. స్థానిక నేత కార్మికులకు సాధికారత కల్పించి, ప్రాంతీయ వస్త్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోంది.
- రామ్ మిలన్ సైకిల్ తో నడిచే రైస్ డీహస్కింగ్ మెషిన్ – ఇది గోరఖ్పూర్ కు చెందిన ఆవిష్కరణ. దీనిద్వారా విద్యుత్తు లేకుండానే సమర్థవంతంగా వరి పొట్టు తొలగించవచ్చు. గ్రామీణ భారతదేశం కోసం ఉపయోగపడే ఆవిష్కరణ ఇది. ఈ పెడల్ ఆధారిత ఆవిష్కరణ రైతులకు సమయం, శ్రమ ఆదా చేయడమే కాకుండా, సుస్థిర వ్యవసాయ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తుంది.
విద్యార్థి సామాజిక ఆవిష్కర్తల (కమ్యూనిటీ ఇన్నొవేటర్ ఫెలోస్- సీఐఎఫ్) ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ కార్యక్రమం ముగిసింది. తమ వ్యవస్థాపక ప్రయాణాలు, వ్యక్తిగత సంఘటనలు, తమ భావాలను వారు పంచుకున్నారు. వారి కథలు ఆకాంక్ష, స్థితిస్థాపకత, క్షేత్రస్థాయి ఆవిష్కరణల పరివర్తన శక్తికి సంబంధించి గొప్ప సందేశాన్ని ప్రతిబింబిస్తాయి.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి:
నీతి ఆయోగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశమంతటా ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థాపకతను ప్రేరేపిస్తుంది. ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడం, సహకార వ్యవస్థలను ప్రోత్సహించడం ద్వారా ఇది సామాజిక పురోగతిని ఇది వేగవంతం చేస్తుంది, ఉన్నత ఆవిష్కరణల ద్వారా భవిష్యత్తును నిర్మిస్తుంది.
***
(Release ID: 2031289)
Visitor Counter : 105