కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
5జీ, 6జీ టెక్నాలజీస్ హ్యాకథాన్, డబ్ల్యూటీఎస్ఏ ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసిన టెలీకమ్యూనికేన్ల శాఖ
దిల్లీ, హైదరాబాద్, బెంగళూరులోని 5జీ ల్యాబ్‌లలో 30 గంటల కార్యక్రమ నిర్వహణ
"5జీ/6జీ హ్యాకథాన్", "డబ్ల్యూటీఎస్ఏ అవగాహన కార్యక్రమాలు" నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అభ్యర్థనను జారీ చేసిన టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
Posted On:
05 JUL 2024 6:04PM by PIB Hyderabad
భారత్ రానున్న సెప్టెంబర్ నెలలో 'డబ్ల్యూటీఎస్ఏ24 (వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేష్ అసెంబ్లీ) ప్రచార సెషన్ల'తో పాటు '5జీ/6జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ హ్యాకథాన్'కు ఆతిథ్యం ఇవ్వనుంది. రేపటితరం టెలికాం సాంకేతికత సరిహద్దులను అన్వేషించేందుకు ఆవిష్కర్తలను, పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీఎస్ఏ 2024 దిల్లీ వేదికగా అక్టోబర్ 15 నుండి 24 వరకు జరగనుంది. ఇది 5 జి, 6 జి నెట్‌వర్క్‌ల పురోగతికి ఒక ప్రధానమైన ముందడుగు. ఇది ప్రపంచ సాంకేతిక రంగంలో దేశం యొక్క పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. డబ్ల్యూటీఎస్ఏ అనేది ఒక చాతుర్వార్షిక (నాలుగేళ్లకు ఒకసారి) కార్యక్రమం, ఇది ఐటియు (ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్), స్టాండర్డైజేషన్ సెక్టార్ (ఐటియు-టి) యొక్క పాలక సమావేశంగా పనిచేస్తుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్వహించే మూడు ప్రపంచ సదస్సులలో ఇది ఒకటి. భారతదేశం డబ్ల్యూటీఎస్ఏ సదస్సును నిర్వహించి, ప్రపంచ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఈ సమావేశాల్లో డబ్ల్యూటీఎస్ఏ 2024తో పాటు ఐటీయూ కెలిడియోస్కోప్ సదస్సు (21-23 అక్టోబర్ 2024 ), ఐటీయూ ప్రదర్శనలు (14-24 అక్టోబర్ 2024), నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ (17 అక్టోబర్ 2024), ఏఐ ఫర్ గుడ్ (18 అక్టోబర్ 2024) వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
సమావేశాలు ప్రారంభం అయ్యే కన్నా ముందే ఒక హ్యాకథాన్ నిర్వహించనున్నారు. ఇది డెవలపర్లకు భిన్నమైన పరిష్కారాలను ప్రదర్శించేందుకు ఒక వేదికగా నిలువనుంది.
టెలికాం శాఖ, ఇదే సమావేశాల్లో అక్టోబర్ 15 నుంచి 19, 2024 వరకు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ 2024)ను కూడా నిర్వహించనుంది. ఈ ఏడాది కృత్రిమ మేథ, క్వాంటమ్ సాంకేతికత, సర్క్యులర్ ఎకానమీతో పాటు 6జీ, 5జీ యూజ్-కేస్ షోకేస్, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, ఐవోటీ, సెమీకండక్టర్స్, సైబర్ భద్రత, గ్రీన్ టెక్, శాట్‌కామ్, ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి అంశాలపై దృష్టి సారించనుంది.
రేపటి తరం నవీకరణాల కోసం 5జీ/6జీ హ్యాకథాన్
ఆసియా ఖండంలో అతిపెద్ద సాంకేతిక ఫోరమ్, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024కు అనుబంధంగా నిర్వహించే ఈ హ్యాకథాన్ టెలికమ్యూనికేషన్స్ లో అత్యాధునిక ఆవిష్కరణలకు కేంద్రంగా పనిచేస్తుంది. 5జీ, 6జీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంపై దృష్టి సారించిన, ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, విద్యావేత్తలు, అంకుర సంస్థల నుంచి భాగస్వాములను ఆకర్షించనున్నారు.
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులోని ప్రత్యేక 5జీ ల్యాబ్ లలో 30 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ ఆలోచనలను క్రియాశీలక వాతావరణంలో అభివృద్ధిపరుచుకునేందుకు సహకారం అందించుకుంటారు. సృజనాత్మకత, సంఘటిత శ్రమను పెంపొందించడం ఈ హ్యాకథాన్ లక్ష్యం, ఈ కార్యక్రమం ఐఎంసి 2024 లో ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించడం ద్వరా విజేతలను ప్రకటించడంతో ముగుస్తుంది.
డబ్ల్యుటిఎస్ఎ ప్రచార సెషన్‌లు: టెలికాం ప్రమాణాల భవిష్యత్తు రూపకల్పన
హ్యాకథాన్ నిర్వాహణతో పాటు, టెలికమ్యూనికేషన్లు, ఐసిటి కోసం ప్రమాణాలను స్థాపించే ప్రపంచ వేదిక అయిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యుటిఎస్ఎ) గురించి లోతైన అవగాహన కల్పించేందుకు డబ్ల్యుటిఎస్ఎ ప్రచార సెషన్లు రూపొందించబడ్డాయి. టెలికమ్యూనికేషన్ల పరిశ్రమలో ప్రామాణికీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు, పరిశోధకులకు అవగాహన కల్పించడంలో ఈ సెషన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
దిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించనున్న ఈ ప్రచార సెషన్లు పరిశ్రమ నిపుణులతో పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకునేందుకు విలక్షణమైన వేదికను అందిస్తుంది. ఈ సెషన్లు అర్థవంతమైన చర్చలను నిర్వహించడం, జ్ఞాన వినిమయాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రతిపాదనల కొరకు అభ్యర్థన
టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (టిసిఒఇ) "5 జి / 6 జి హ్యాకథాన్" "డబ్ల్యుటిఎస్ఎ అవగాహన సెషన్లు" నిర్వహించడానికి దరఖాస్తుల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పీ)ను జారీ చేసింది.
https://tcoe.in/uploads/notification_attachment/notification_attachment_66855d8d8dc9c.pdf.
కార్యక్రమంలో పాల్గొనడం, తాజా సమాచారం, మరిన్ని వివరాల కొరకు, అధికారిక టిసిఒఇ భారత్ వెబ్‌సైట్ (https://www.tcoe.in/) సందర్శించండి.
***
(Release ID: 2031273)
Visitor Counter : 117