శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆస్ట్రేలియా-ఇండియా స్ట్రాటజిక్ రిసర్చ్ ఫండ్ ఫలితాల ను ప్రకటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
04 JUL 2024 11:17AM by PIB Hyderabad
ఆస్ట్రేలియా-ఇండియా స్ట్రాటజిక్ రిసర్చ్ ఫండ్ (ఎఐఎస్ఆర్ఎఫ్) పదిహేనో విడత ఫలితాల ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పృథ్వీ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ), అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి చేశారు.
విజేతలుగా నిలచిన ప్రాజెక్టులకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా నిధులను ఇచ్చిన సంగతిని ఈ రోజున ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడమైంది.
ఆస్ట్రేలియా-ఇండియా స్ట్రాటజిక్ రిసర్చ్ ఫండ్ (ఎఐఎస్ఆర్ఎఫ్) ఒక ద్వైపాక్షిక కార్యక్రమం, ఇది ఆస్ట్రేలియాకు, భారతదేశానికి మధ్య సహకార పూర్వక పరిశోధన ప్రాజెక్టులకు దన్నుగా నిలుస్తోంది. రెండు దేశాల మధ్య శాస్త్ర పరమైన సంబంధాన్ని బలపరచడం, సంయుక్త పరిశోధనల ద్వారా ఉమ్మడి సవాళ్ళను పరిష్కరించడం ఈ కార్యక్రమం ధ్యేయం.
ఈ సంవత్సరం లో, వేరు వేరు విభాగాలలో అయిదు ప్రాజెక్టులకు ఎఐఎస్ఆర్ఎఫ్ నిధులను ఇచ్చింది. ఆయా విభాగాలలో కృత్రిమ మేధ (ఎఐ), మెషిన్ లెర్నింగ్, బయోటెక్నాలజీ, పట్టణ ప్రాంతాలలో గనుల త్రవ్వకంలతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలింగ్, చౌకైన సౌర, స్వచ్ఛ ఉదజని సాంకేతికతలు భాగంగా ఉన్నాయి. కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ను అనుసరించి ఈ ప్రాజెక్టులను ఎంపిక చేసి, ఈ ప్రాజెక్టులు శాస్త్రీయపరమైన ఉత్కృష్టత తాలూకు అత్యున్నత ప్రమాణాలకు తులతూగేటట్టుగాను, గణనీయమైన ప్రభావాన్ని ప్రసరించేవిగాను శ్రద్ధ తీసుకోవడమైంది.
ఎంపిక చేసిన ప్రాజెక్టులు ఆస్ట్రేలియా కు చెందిన శాస్త్రవేత్తలు, భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న అనేక అధునాతన పరిశోధనలకు అద్దం పడతాయి. ఈ కార్యక్రమాలు రెండు దేశాలతో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉండే విలువైన ఫలితాలను అందించగలుగుతాయన్న అంచనాలు ఉన్నాయి.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పృథ్వీ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల పరంగా అంతర్జాతీయ సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘‘ప్రపంచంలో అనేక కీలక సవాళ్ళను పరిష్కరించడం కోసం, సుస్థిర అభివృద్ధిని పెంపొందింప చేయడం కోసం ఈ ఆధునిక యుగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తుందని నేను అనుకుంటున్నాను. భారతదేశానికి, ఆస్ట్రేలియా కు మధ్య చిరకాలిక భాగస్వామ్యానికి ఒక ప్రమాణంగా ఎఐఎస్ఆర్ఎఫ్ ఉంది. ఈ సహకారం ద్వారా తెర మీదకు వచ్చిన ప్రాజెక్టులు పరస్పరం ప్రయోజనకరమైన రంగాలలో శాస్త్రీయ కోణంలో ముఖ్యమైన ఆవిష్కారాలకు, సాంకేతిక పురోగతులకు దారితీస్తాయని నేను నమ్ముతున్నాను. ఆస్ట్రేలియా లో ఒక చైతన్యవంతమైన నూతన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా నేను పునరుద్ఘాటిస్తున్నాను. సమృద్ధమైన, స్థిరమైన భవిష్యత్తును అందించడం కోసం ఈ ప్రాజెక్టులలో పాల్గొంటున్న పరిశోధకులను అందరినీ నేను అభినందిస్తున్నాను.’’ అన్నారు.
ఆస్ట్రేలియా కు చెందిన పరిశ్రమ, శాస్త్రాల శాఖ మంత్రి ఎడ్ హుసిక్ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రపంచంలో అనేక క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. దేశాల మధ్య సహకారం శాస్త్రీయపరమైన అవరోధాలను దాటి ఒక మేలైన స్థితిని తీసుకు రావడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది. సూక్ష్మక్రిములలో ఒక పట్టాన కొలిక్కి రానటువంటి జాతులు మొదలుకొని ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి కృత్రిమ మేధ (ఎఐ) వరకు పరిశీలిస్తే, మన ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళకు ఉత్తమ పరిష్కారాలను కనుగొనడానికి ఆస్ట్రేలియాలోని మెరికల వంటి ప్రతిభావంతులను ద్వైపాక్షిక పరిశోధన ప్రధానమైన భాగస్వామ్యం రంగంలోకి దింపింది. ఆస్ట్రేలియా-ఇండియా స్ట్రాటజిక్ రిసర్చ్ ఫండ్ (ఎఐఎస్ఆర్ఎఫ్) గత 18 సంవత్సరాలలో 360కి పైగా సహకార పూర్వక పరిశోధన ప్రాజెక్టులను ప్రసాదించింది. ఈ క్రమంలో మా దేశంలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు ప్రపంచ పరిశోధన కార్యాలలో ముందు వరుసలో నిలబడడానికి మార్గం సుగమం అయింది.’’ అన్నారు.
ఈ సంవత్సరం నిధుల కేటాయింపులో దృష్టి ని కేంద్రీకరించిన రంగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. భూమిలో నుండి కర్బనాన్ని వేరు చేసే ప్రక్రియను పర్యవేక్షించడం కోసం కృత్రిమ మేధ (ఎఐ) ఆధారంగా పనిచేసే ఒక వేదికను ఏర్పాటు చేయడం.
2. కాలం చెల్లిన మొబైల్ ఉపకరణాలలో నుండి అత్యవసర లోహాలను పర్యావరణ మైత్రీపూర్వకమైన పద్ధతిలో రాబట్టడం.
3. నానోమెటీరియల్స్ హంగు ను జతపరచిన వ్యవస్థల ద్వారా చౌకైన పద్ధతిలో సోలార్ థర్మల్ డిశాలినేషన్ ను అమలులోకి తీసుకురావడం.
4. సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థ యొక్క శక్తిని ఉపయోగంలోకి తీసుకురావడం.
5. సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే అంటురోగాలను కనిపెట్టగలిగిన పురోగామి రోగ నిర్ధారణ రీతులను, ఆ తరహా అంటువ్యాధులపై పోరాడగలిగిన సరికొత్త చికిత్సా పద్ధతులను రూపొందించడం.
ఎఐఎస్ఆర్ఎఫ్ నుండి నిధులను స్వీకరించిన సంస్థలలో లూథియానా లోని పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ (ఐఐటి) ఢిల్లీ, ఐఐటి బోంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) బెంగళూరు లతో పాటు పుణె కు చెందిన అబ్‌జెనిక్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు ఉన్నాయి.
***
(Release ID: 2030670)
Visitor Counter : 153