మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
21వ పశుగణన విషయంలో అనుసరించే వ్యూహానికి సంబంధించి వర్క్ షాప్ నిర్వహించనున్న పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ
ఒకరోజు వర్క్‌షాప్‌ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
అధిక-నాణ్యత డేటా సేకరణ జరిగేలా చూసేందుకు డేటా తయారు చేయటంపై పాల్గొన్నవారికి అందనున్న నైపుణ్య శిక్షణ, వివిధ రిజిస్టర్డ్ జాతుల గురించి తెలుసుకోనున్న పాల్గొన్నవారు.
Posted On:
24 JUN 2024 2:17PM by PIB Hyderabad
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ (డీఏహెచ్‌డీ) రాబోయే 21వ పశుగణన కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యూహరచన, సాధికారత కల్పించే లక్ష్యంతో కీలకమైన వర్క్ షాప్‌ను నిర్వహించనుంది. 2024, జూన్ 25న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, శ్రీ జార్జ్ కురియన్.. డీఏహెచ్‌డీ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ కూడా పాల్గొననున్నారు.
21వ పశుగణనను సమర్థవంతంగా నిర్వహించడానికి మొబైల్ యాప్, సాఫ్ట్‌వేర్‌తో సహా అవసరమైన సాధనాలతో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులను సన్నద్ధం చేయడం ఈ వర్క్‌షాప్ ప్రాథమిక లక్ష్యం. అధిక-నాణ్యత డేటా సేకరించేలా పాల్గొనేవారికి డేటా తయారీ వ్యూహాలపై శిక్షణ అందనుంది. వివిధ రిజిస్టర్డ్ జాతులపై ఈ వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించనున్నారు.
1919 లో ప్రారంభమైనప్పటి నుంచి పశుసంవర్ధక రంగంలో విధాన రూపకల్పనకు, అనేక కార్యక్రమాల అమలుకు వెన్నెముకగా ఉంటూ, ప్రతి ఐదేళ్లకు ఒకసారి చేపట్టే పశుగణన ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో దేశవ్యాప్తంగా పెంపుడు జంతువులు, పక్షులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగనున్న 21వ పశుగణనలో డేటా సేకరణ, బదిలీ కోసం మొబైల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇది దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఈ ప్రక్రియ కచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంచుతుంది.
వర్క్‌షాప్ ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. తరువాత పశు జన గణన విధానంపై వివరణాత్మక సెషన్లు డుంటాయి. మొబైల్ అప్లికేషన్, సాఫ్ట్‌వేర్ డ్యాష్‌బోర్డ్‌పై శిక్షణ ఇస్తారు. పాల్గొన్న వారి నుంచి ప్రశ్నలు, అనుమానాలను నివృత్తం చేయటానికి ఓపెన్ హౌస్ చర్చ ఉంటుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, జార్జ్ కురియన్ పాల్గొంటారు. డీఏహెచ్ డీ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ్, డీఏహెచ్‌డీ సీనియర్ అధికారులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు, 21వ పశుగణనకు సంబంధించిన టెక్నికల్ కమిటీ సభ్యులు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పాల్గొంటారు.
21వ పశుగణనను విజయవంతంగా జరిగేలా చూడటానికి ఈ కీలకమైన వర్క్‌షాప్‌లో పాల్గొనాలని భాగస్వాములందరినీ పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ ఆహ్వానిస్తోంది.
***
(Release ID: 2028472)