కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

నాలుగు కార్మిక కోడ్ లకు అనుగుణంగా ముసాయిదా నిబంధనలు రూపొందించడంలో 36 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంసిద్ధతను; భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ కార్యక్రమాల అమలులో పురోగతి గురించి తెలుసుకునేందుకు కేంద్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

Posted On: 20 JUN 2024 9:38PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన (i) నాలుగు కార్మిక కోడ్ లకు అనుగుణంగా ముసాయిదా నిబంధనలు రూపొందించడంలో 36 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంసిద్ధత; సామర్థ్యాల నిర్మాణం, కార్మిక సంస్కరణలకు ఐటి చొరవల గురించిన సమాచారం తెలుసుకోవడం (ii)  భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన సెస్ నిధి వినియోగంలో పురోగతిని మదింపు చేయడం అనే రెండు అంశాల అజెండాతో 2024 జూన్ 20వ తేదీన అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 36 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల అదనపు ప్రధాన కార్యదర్శులు/ప్రిన్సిపల్ కార్యదర్శులు/కార్యదర్శులు/లేబర్ కమిషనర్లు; కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

కార్మిక  కోడ్ ల లక్ష్యాలైన కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం; పని ప్రదేశాల్లో ఆరోగ్యవంతమైన, సురక్షితమైన వాతావరణ కల్పన; వ్యవస్థీకృత ఉపాధిని ప్రోత్సహించడం; కార్మికులకు నైపుణ్యాల కల్పన; వలస కార్మికులకు పోర్టబులిటీ ప్రయోజనాల కల్పన వంటి  అంశాలపై సమావేశం చర్చించింది. కార్మిక చట్టాల సరళీకరణ, హేతుబద్ధీకరణ ద్వారా ఉపాధి అవకాశాల కల్పనపై కూడా చర్చించారు.

దేశంలోని పలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే కార్మిక కోడ్ ల కింద నిబంధనలను ప్రచురించగా కేవలం కొన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఇంకా నిబంధనలు రూపొందిస్తున్నాయి. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిబంధనల మధ్య సామరస్యం తెచ్చేందుకు కేంద్ర నిబంధనలు, రాష్ర్ట నిబంధనల మధ్య వ్యత్యాసంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. లాజిస్టిక్స్, ఐటి, మౌలిక వసతులు, మానవ వనరుల సామర్థ్యాల నిర్మాణంపై దృష్టి సారించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. ఈ సంభాషణ అంతా ఇంటరాక్టివ్ గా, ఉత్పాదకంగా జరిగింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు వేసిన ప్రశ్నలపై కూడా చర్చించడంతో పాటు కార్మిక సంస్కరణల తదుపరి అజెండాపై చర్చించేందుకు త్వరలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వర్క్ షాప్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అంతే కాదు  (i) కార్మిక కోడ్ లకు అనుగుణంగా ముసాయిదా నిబంధనల సమీక్షించాలని (ii) ఇప్పటివరకు నిబంధనలు ప్రకటించని రాష్ర్టాలు అందుకు సంబంధించి అవసరమైన మద్దతు తీసుకోవాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

భవన నిర్మాణం, ఇతర నిర్మాణ రంగ కార్మికుల (బిఓసి) సంక్షేమ పథకాల అమలులో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పురోగతిపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. బిఓసి కార్మికుల సెస్  నిధి నుంచి బిఓసి కార్మికుల పిల్లల కోసం విద్యా సంస్థలు, పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన అంశాలను; బిఓసి పనివారి డేటాబేస్ ను ఇశ్రమ్ పోర్టల్ లో అవ్యవస్థీకృత కార్మికుల డేటాబేస్ తో అనుసంధానం చేయడం; కార్మికుల ప్రయోజనాల డూప్లికేషన్ నివారణ, పోర్టబులిటీ వంటి అంశాలపై కూడా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన సామాజిక భద్రతా పథకాలైన జీవితబీమా కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), వ్యక్తిగత ప్రమాద బీమా కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్ బివై), ఆరోగ్య సంరక్షణ బీమా కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎం-జెఏవై) కింద బిఓసి కార్మికులకు కవరేజిపై కూడా చర్చించారు. బిఓసి కార్మికుల సెస్ ఫండ్ కింద చేసిన వ్యయాలపై సోషల్ ఆడిట్, సిఏజి ఆడిట్ నిర్వహించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

ప్రభుత్వ నిర్వహణలోని వివిధ సంక్షేమ, సామాజిక భద్రతా పథకాల కింద బీడీ కార్మికుల నమోదును పెంచడం ద్వారా బీడీ కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. 

దేశంలో కనివిని ఎరుగని రీతిలో వడగాలులు వీస్తున్న నేపథ్యంలో అవసరమైన వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడం ద్వారా కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితిలో అయినా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

***



(Release ID: 2027771) Visitor Counter : 22


Read this release in: English , Urdu , Hindi