బొగ్గు మంత్రిత్వ శాఖ

10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


వేలం లో 8 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 67 బొగ్గు గనులు

వేలం వేసిన బొగ్గు బ్లాకుల ద్వారా వచ్చే ఆదాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది

Posted On: 21 JUN 2024 6:15PM by PIB Hyderabad

   కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇవాళ వాణిజ్య బొగ్గు గనుల 10వ విడత వేలం ప్రారంభించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మొత్తం 67 బొగ్గు గనులను వేలంలో పెట్దింది. గౌరవనీయ బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కతో కలసి 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా తెలంగాణ తో పాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలో పూర్తి-పాక్షిక అన్వేషణ ముగిసిన 3 కోకింగ్ గనులు సహా 67 గనులను వేలం వేస్తోంది.

 

   దేశ ఇంధన అవసరాలు తీర్చడంతోపాటు బొగ్గు రంగం శరవేగంగా వృద్ధి సాధించే దిశగా బొగ్గు మంత్రిత్వశాఖ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మునుపటి 9 విడతల తరహాలోనే  ప్రస్తుత 10వ విడతలోనూ రక్షిత ప్రాంతాల పరిధిలోగలవి, వన్యప్రాణుల అభయారణ్యాలు, సంక్లిష్ట ఆవాసాలు, అటవీ విస్తీర్ణం 40 శాతానికిపైగాగల ప్రాంతాలు సహా భారీ సంఖ్యలో నిర్మాణాలున్న ప్రదేశాల పరిధిలోని గనులు వేలం నుంచి మినహాయించబడ్డాయి. బొగ్గు గనుల తవ్వకంపై ఆసక్తి పెంచడంలో భాగంగా దట్టమైన ఆవాసం, అధిక పచ్చదనం లేదా సంక్లిష్ట మౌలిక సదుపాయాలుగల కొన్ని బొగ్గు గనుల సరిహద్దులు సవరించబడ్డాయి.

 

 

   వేలం ప్రక్రియ ప్రారంభం సందర్భంగా కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ-  పారిశ్రామిక రంగానికి జీవనాడి అయిన బొగ్గు, మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తదనుగుణంగా బొగ్గు పారిశ్రామికవేత్తలంతా సమష్టి కృషితో దేశ ప్రగతికి సహకరించాలని కోరారు. అలాగే బొగ్గు రంగంలో భారత్ స్వయం సమృద్ధం కావాలన్న గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా  దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అవసరమని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధి దిశగా దేశీయ బొగ్గు ఉత్పాదకతను పెంచుకోవడంలో ప్రాధాన్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఆ మేరకు బొగ్గు రంగంలో పురోగతికి శ్రమించడం చాలా కీలకమని, నేటి మన కృషి భవిష్యత్తును ఉజ్వలం చేస్తుందని చెప్పారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికీ అందుతుందని తెలిపారు.

   గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ- బొగ్గు దిగుమతిని గణనీయంగా తగ్గించి, దాదాపు 1 బిలియన్ టన్ను (బిటి) ఉత్పాదన ద్వారా ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధికి కృషి చేస్తున్న బొగ్గు మంత్రిత్వ శాఖకు అభినందనలు తెలిపారు. ఈ చురుకైన కృషి ఫలితంగానే గత ఆర్థిక సంవత్సరంలో స్వదేశీ బొగ్గు మన దేశ ఇంధన అవసరాలు తీరాయన్నారు.

   గౌరవనీయ బొగ్గు-గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ- వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న వారికి వాణిజ్య సౌలభ్యం మెరుగుద్వారా ప్రభుత్వం అవసరమైన మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు బొగ్గు రంగంపై ఆసక్తి పెంచడంలో భాగంగా పరిశ్రమలో కొనసాగుతున్న సంస్థల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతదేశం స్వయం సమృద్ధం కావడంలో బొగ్గు గనుల రంగం ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు.

 

   వేలం ప్రక్రియ ప్రారంభానికి ముందు కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా ప్రధానోపన్యాసం చేశారు. దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండును తీర్చడం కోసం బొగ్గు ఉత్పత్తిని పెంచడంపై నిశితంగా దృష్టి సారించామన్నారు. అదే సమయంలో ఉత్పాదన సందర్భంగా కార్మికుల భద్రతతో రాజీ పడరాదని, తప్పనిసరిగా సురక్షిత పని పరిస్థితులు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి ఉత్తమ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అంతేగాక అత్యున్నత పారదర్శకత ప్రమాణాలతో బొగ్గు గనుల వల్ల జీవావరణంపై దుష్ప్రభావాన్ని అరికట్టే కచ్చితమైన, సుస్థిర పర్యావరణ పరిరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బొగ్గు రంగంలో వాణిజ్య సౌలభ్య క్రమబద్ధీకరణకు రాష్ట్ర స్థాయిలోనూ బలమైన మద్దతు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు కార్యకలాపాలు సజావుగా సాగేలా సానుకూల వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడంలో ఇటువంటి మద్దతు అత్యంత కీలకమని ఆయన సూచించారు.

 

   బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అథారిటీ అయిన శ్రీ ఎం.నాగరాజు మాట్లాడుతూ- బొగ్గుకు డిమాండ్ నానాటికీ పెరుగుతున్నందున మరిన్ని బొగ్గు క్షేత్రాల అన్వేషన ఎంతయినా అవసరమన్నారు. పెరుగుతున్న ఇంధన అవసరాలే తీర్చడంతోపాటు వివిధ పరిశ్రమలకు బొగ్గు సరఫరా స్థిరంగా సాగడానికి అనువుగా ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానం, నైపుణ్య వినియోగం చాలా కీలకమని నొక్కి చెప్పారు. బొగ్గు అన్వేషణ కోసం మరిన్ని క్షేత్రాలను అందుబాటులోకి తేవడమే కాకుండా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కూడా అధికోత్పత్తి లక్ష్యాల సాధనలో బొగ్గు రంగానికి దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.

 

   కాగా, టెండర్ పత్రాల విక్రయం నేడు.. అంటే- 2024 జూన్ 21నుంచే ప్రారంభమైంది. గనుల వివరాలు, వేలం నిబంధనలు, కాలవ్యవధి తదితర వివరాల కోసం ‘ఎంఎస్‌టిసి’ వేలం వేదికతోపాటు బొగ్గు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. రాబడిలో ఆదాయ వాటా శాతం ప్రాతిపదికగా ఈ వేలం రెండు దశల ప్రక్రియ ద్వారా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది.

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2026605

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2025297

 

******



(Release ID: 2027711) Visitor Counter : 69


Read this release in: English , Urdu , Hindi