వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పడిన ఇండియా-కంబోడియా ఉమ్మడి కార్యాచరణ సంఘం (జెడబ్ల్యు జిటిఐ) రెండో సమావేశం- ఢిల్లీలో నిర్వహణ
యుపిఐ, మందుల తయారీ, సంప్రదాయ వైద్య అంశాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సహకారం పెంపొందించుకోవడంపైన ప్రత్యేక దృష్టి
Posted On:
20 JUN 2024 12:33PM by PIB Hyderabad
వాణిజ్యం, పెట్టుబడులపై ఏర్పడిన ఇండియా-కంబోడియా ఉమ్మడి కార్యాచరణ సంఘం తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్ వేదికగా ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరపుణ కేంద్ర వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విభాగ కార్యదర్శి శ్రీ సిద్దార్థ మహాజన్ , కంబోడియావాణిజ్య మంత్రిత్వశాఖ కు చెందిన అంతర్జాతీయ వాణిజ్యం డైరెక్టర్ జనరల్ శ్రీ లాంగ్ కెమ్‌విచెట్ పాల్గొన్నారు. సంబంధిత మంత్రిత్వశాఖల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి శ్రీ సిద్ధార్థ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పరస్పర ప్రాధాన్యం కలిగిన రంగాల్లో సహకారం కోసం తగిన వ్యవస్థను తయారు చేసుకోవడంపైనా ప్రత్యేకంగా మాట్లాడారు.
సంప్రదాయ వైద్యం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ , వాణిజ్య విస్తరణ, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, మందుల తయారీ రంగాలపైన ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) ఆధారిత డిజిటల్ చెల్లింపుల రంగంలో సహకారంపై కొనసాగుతున్న కృషి ఎంతవరకు వచ్చిందో ఈ కార్యక్రమం చర్చించింది.
భారతదేశ వ్యాపార వాణిజ్యవర్గాలు కంబోడియాలో పెట్టుబడులు పెట్టగలిగే పలు అవకాశాల గురించి కంబోడియా అధికారులు వివరించారు. అత్యధిక వృద్ధి సామర్థ్యం కలిగి వివిధ రంగాల్లో అవకాశాల గురించి తెలియజేశారు.
జెడబ్ల్యుజిటిఐ మొదటి సమావేశం జులై 2022లో విర్చువల్ గా నిర్వహించారు. ఈ సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత భౌతికంగా సమావేశమవ్వడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్యన వ్యాపార వాణిజ్యాల విస్తరణ, పెట్టుబడుల ప్రోత్సాహం, వాటి విలువ, పరిమాణం తదితర అంశాలపై చేపట్టాల్సిన చర్యల గురించి జెడబ్ల్యుజిటిఐ చర్చించింది. పరస్పరం గణనీయమైన లబ్ధి పొందాలంటే ఇరు దేశాలు కలిసి మరిన్ని చర్చలు చేయాలని రెండు దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి.
***
(Release ID: 2027273)
Visitor Counter : 65