గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్ సి ఇ ఎస్ ) 2022-23 పైన ఈ నెల 19న న్యూఢిల్లీలో డాటా యూజర్ సమావేశం.
Posted On:
18 JUN 2024 4:42PM by PIB Hyderabad
కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖకు చెందిన ది నేషనల్ శాంపిల్ సర్వే ( ఎన్ ఎస్ ఎస్ ఓ) కార్యాలయంవారి ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా గృహ వినియోగ వ్యయ సర్వేలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ ఏర్పడిన 1950 సంవత్సరంనుంచీ ఈ సర్వే జరుగుతోంది. ఈ మధ్యనే ఎన్ ఎస్ ఎస్ ఓ వారు హెచ్ సిఇఎస్ ను ఆగస్ట్ 2022నుంచి జులై 2023వరకూ నిర్వహించారు. ఈ సర్వే ద్వారా దేశంలో ప్రతి ఇంటికి సంబంధించి నెలవారీ తలసరి ఆదాయ వినియోగ వ్యయమనేది ( ఎంపీ సీఇ), గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోను, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోను, వివిధ సామాజిక ఆర్థిక వర్గాల్లోను ఎలా వుందనేది తెలుస్తుంది. హెచ్ సి ఇ ఎస్ 2022-23కు సంబంధించిన వాస్తవ పట్టికను ఈ ఏడాది ఫిబ్రవరి 24న విడుదల చేయడం జరిగింది. సర్వేకు సంబంధించిన వివరణాత్మక ఫలితాలు, యూనిట్ స్థాయి సమాచారం ఈ నెల 7న ప్రచురించడం జరిగింది.
ఈ నేపథ్యంలో హెచ్ సి ఇ ఎస్ 2022-23పై ఒక రోజు డాటా యూజర్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశాన్ని ఈ నెల 19న న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ సంబంధిత డాటా వినియోగదారులు/ భాగస్వాములతో చర్చించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. ఈ సమావేశంలో హెచ్ సిఇఎస్‌కు సంబంధించిన పలు కీలకమైన అంశాలు, నిర్వచనాలు, కీలక ఫలితాలు, యూనిట్ స్థాయి సమాచారం, సమాచార నాణ్యత గురించి చర్చించడం జరుగుతుంది.
ఈ సమావేశానికి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ వివేక్ దేవరాయ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జాతీయ గణాంకాల కమిషన్ ( ఎన్ ఎస్ సి) అధ్యక్షులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. జాతీయ శాంపిల్ సర్వే స్టీరింగ్ కమిటీ సభ్యులు, గణాంకాల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, గణాంకాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు, ఇంకా ఇతర కేంద్ర మంత్రిత్వశాఖ అధికారులు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధనా విద్యార్థులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నవారు కింది యూట్యూబ్ లింక్ ద్వారా కూడా హాజరు కావచ్చు.
https://www.youtube.com/live/Wyk6ZOswwKg?si=ZopKVXmS67Wr8o7o
***
(Release ID: 2026388)
Visitor Counter : 94