వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖరీఫ్ సీజన్ సంసిద్ధతను సమీక్షించిన కేంద్ర వ్యవసాయ, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారకాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని మంత్రి పిలుపు

టెక్నలాజికల్ క్రిమి సంహారకాల సమర్థ వినియోగంతో వ్యవసాయ రంగంలో విప్లవం వస్తుంది : శ్రీ చౌహాన్

Posted On: 14 JUN 2024 5:35PM by PIB Hyderabad

ఖరీఫ్ సీజన్ కు అవసరం అయిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారకాలను సకాలంలో అందుబాటులో ఉంచాలని కేంద్ర వ్యవసాయ, వ్యవసాయదారుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి  శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు ఇచ్చారు. న్యూఢిల్లీలోని కృషి భవన్ లో ఆయన ఖరీఫ్ సీజన్ 2024 పంట సంసిద్ధతను విభిన్న శాఖల అధికారులతో  సమీక్షించారు. పంటలకు అవసరం అయిన నాణ్యమైన వ్యవసాయ ఉపకరణాలు సకాలంలో అందుబాటులో ఉంచి, పంపిణీ చేయాలని శ్రీ చౌహాన్ వారిని ఆదేశించారు. సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నా పంటలు జాప్యం అయి ఉత్పత్తి ప్రభావితం అవుతుందంటూ అలాంటి పరిస్థితి ఎదురు కావడాన్ని నివారించాలని ఆయన సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి, సమీక్షిస్తూ వ్యవసాయదారులకు ఎలాంటి కష్టాలు కలుగకుండా నివారించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా మెరుగ్గా ఉంటాయన్న అంచనాల పట్ల శ్రీ చౌహాన్ హర్షం ప్రకటించారు. ఎరువుల శాఖ, కేంద్ర జల సంఘం, భారత వాతావరణ శాఖ తమ సంసిద్ధతను తెలియచేస్తూ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. వ్యవసాయం, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహూజా, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఖరీఫ్ సీజన్ సంసిద్ధతను గురించి మంత్రికి వివరించారు. 

అంతకు ముందు వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డేర్) పనితీరును సమీక్షిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ఈ రంగంలో యాంత్రికీకరణను పెంచాలని మంత్రి పిలుపు ఇచ్చారు. వ్యవసాయ విద్యను  వృత్తితో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ దీని వల్ల వ్యవసాయ శాస్ర్తాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారు వ్యవసాయ రంగంలోని ఆచరణీయ విధానాలతో కూడా అనుసంధానం అవుతారని ఆయన అన్నారు. కిసాన్ వికాస్ కేంద్రాలు (కెవికె) చిట్టచివరి రైతుకు కూడా అందుబాటులో ఉండే విధంగా వాటి వినియోగాన్ని మెరుగుపరచడంపై విస్తృతంగా చర్చించాలని శ్రీ చౌహాన్ నొక్కి చెప్పారు. టెక్నలాజికల్ విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవం వస్తుందంటూ ఉత్పాదకత పెంచేందుకు, కొత్త వంగడాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆయన శాస్ర్తవేత్తలకు పిలుపు ఇచ్చారు. అలాగే ప్రకృతి వ్యవసాయ విధానాలు మరింత సరళం చేయాలని, దాని వల్ల మరింత ఎక్కువ మంది రైతులు అందులో ప్రవేశించే వీలు కలుగుతుందని శ్రీ చౌహాన్ అభిప్రాయపడ్డారు. డేర్ కార్యదర్శి, ఐసిఏఆర్ డిజి శ్రీ హిమాంశు పాఠక్ తమ విభాగం కార్యకలాపాలను వివరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) 100 రోజుల ప్రణాళికను కూడా ఆయన వివరించారు. 100 పంట రకాల అభివృద్ధి,  100 కొత్త టెక్నాలజీస సర్టిఫికేషన్  ఐసిఏఆర్ నూరు రోజుల ప్రణాళికలో ఉన్నట్టు ఆయన తెలియచేశారు. 

వ్యవసాయం, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్ నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
 

***


(Release ID: 2025791) Visitor Counter : 81