ఆయుష్

హైదరాబాద్‌లోని ‘సిసిఆర్ఎఎస్-ఎన్ఐఐఎంహెచ్’ను సంప్రదాయ వైద్య పరిశోధనలకు సహకార కేంద్రంగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఒ


‘‘సంప్రదాయ వైద్యంలో ప్రాథమిక-సాహితీ పరిశోధన’’కు
తొలి ‘డబ్ల్యుహెచ్ఒ’ సహకార కేంద్రంగా ‘ఎన్ఐఐఎంహెచ్’

Posted On: 14 JUN 2024 4:35PM by PIB Hyderabad

   కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్రీయ ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి విభాగమైన భారతీయ వైద్య వారసత్వ జాతీయ సంస్థ-హైదరాబాద్ (ఎన్ఐఐఎంహెచ్)కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. ఈ సంస్థను ‘‘సంప్రదాయ వైద్యంలో ప్రాథమిక-సాహితీ పరిశోధన’’కు (సిసి ఐఎన్‌డి-177) తమ తొలి సహకార కేంద్రం (సిసి)గా ‘డబ్ల్యుహెచ్ఒ’ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు 2024 జూన్ 3 నుంచి నాలుగేళ్లపాటు అమలులో ఉంటుంది.

   కేంద్ర ప్రభుత్వం 1956లో ‘ఎన్ఐఐఎంహెచ్’ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా-రిగ్పా, హోమియోపతి, బయో-మెడిసిన్ సహా భారతదేశంలోని ఇతర సంబంధిత ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో వైద్య-చారిత్రక పరిశోధనల పత్రీకరణ, ప్రదర్శన లక్ష్యంగా ఈ ప్రత్యేక సంస్థ రూపుదిద్దబడింది. ఈ నేపథ్యంలో ‘సిసిఆర్ఎఎస్’ డైరెక్టర్ జనరల్, ‘ఎన్ఐఐఎంహెచ్’-‘డబ్ల్యుహెచ్ఒ’ల సహకార కేంద్ర (సిసి) విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ వైద్య రబినారాయణ ఆచార్య శ్రద్ధాపూర్వక నేతృత్వాన నిరంతర శోధన, అంకితభావం ఫలితంగా ఈ అద్భుత విజయం దక్కింది.

   దీనిపై ప్రొఫెసర్ ఆచార్య మాట్లాడుతూ- ‘‘డ‌బ్ల్యుహెచ్ఒ ద్వారా ఈ హోదా ల‌భించ‌డం ఓ కీల‌క విజ‌యం. సంప్రదాయ వైద్యం-చారిత్రక పరిశోధన రంగంలో మా నిరంత‌ర కృషికి ఈ గుర్తింపు ఒక ప్ర‌తీక‌’’ అన్నారు. ఆయుష్ సంబంధిత పలు డిజిటల్ కార్యక్రమాల నిర్వహణలో ఈ సంస్థ అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు ‘అమర్’ (ఎఎంఎఆర్) పోర్టల్ కింద 16,000 ఆయుష్ చేతిరాత ప్రతులు, 4,249 డిజిటలీకరించిన రాతప్రతులు, 1,224 అరుదైన గ్రంథాలు, 14,126 జాబితాలు, 4,114 పత్రికలను సంకలనం చేసింది. అలాగే ‘సాహి’ (ఎస్ఎహెచ్ఐ) పోర్టల్ కింద 793 వైద్య-చారిత్రక కళాఖండాలను ప్రదర్శిస్తోంది. మరోవైపు ఆయుష్ సంబంధిత ప్రాచీన శాస్త్రీయ పాఠ్యపుస్తకాలను ‘‘ఇ-బుక్స్ ఆఫ్ ఆయుష్’’ ప్రాజెక్టు కింద డిజిటల్ రూపంలో అందిస్తోంది. అలాగే ‘నమస్తే’ (ఎన్ఎఎంఎఎస్‌టిఇ) పోర్టల్ కింద 168 ఆసుపత్రుల నుంచి సేకరించిన సంచిత అనారోగ్య గణాంకాలను ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా ఆయుష్ పరిశోధన పోర్టల్ ద్వారా  42,818 ఆయుష్ పరిశోధన కథనాలను అనుక్రమణం చేసింది.

   ‘ఎన్ఐఐఎంహెచ్’లో 500కుపైగా భౌతిక చేతిరాత ప్రతులున్నాయి. వీటితోపాటు వైద్య వారసత్వ ప్రదర్శనశాల, గ్రంథాలయం కూడా ఉన్నాయి. వీటిలో 15వ శతాబ్దానికి చెందిన అరుదైన పుస్తకాలు, చేతిరాత ప్రతులు లభ్యమవుతాయి. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్‌’ పేరిట పత్రికను కూడా ప్రచురిస్తోంది. సంస్థకు సంబంధించిన మరింత సమాచారం కోసం ‘ఎన్ఐఐఎంహెచ్’ అధికారిక వెబ్‌సైట్ (http://niimh.nic.in)లో చూడవచ్చు. బయో-మెడిసిన్, అనుబంధ శాస్త్రాల సంబంధిత వివిధ విభాగాల్లో ‘డబ్ల్యుహెచ్ఒ’ సహకార కేంద్రాలు భారతదేశంలో సుమారు 58 ఉన్నాయి. వీటిలో ‘సిసిఆర్ఎఎస్-ఎన్ఐఐఎంహెచ్’, హైదరాబాద్ సంప్రదాయ వైద్యానికి సంబంధించి ‘డబ్ల్యుహెచ్ఒ’ 3వ సహకార కేంద్రంగా ఉంది. కాగా, జామ్‌నగర్‌లోని ‘ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్’, న్యూఢిల్లీలోని ‘మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా’ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

   ‘‘సంప్రదాయ వైద్యంలో ప్రాథమిక-సాహితీ పరిశోధన’’కు తొలి సహకార కేంద్రం హోదాలో ఆయుర్వేదం, యునాని, సిద్ధ, సోవా-రిగ్పా వైద్య విధానాల పరిభాషల ప్రామాణీకరణ బాధ్యత ‘ఎన్ఐఐఎంహెచ్’కి అప్పగించబడింది. దీంతోపాటు వ్యాధుల అంతర్జాతీయ వర్గీకరణ 11వ సంచిక (ఐసిడి-11) కోసం సంప్రదాయ వైద్య మాడ్యూల్-II నవీకరణలో ‘డబ్ల్యుహెచ్ఒ’కు తోడ్పడుతుంది. అంతేకాకుండా సంప్రదాయ వైద్యవిధానాల పరిశోధన పద్ధతుల రూపకల్పనలో ‘డబ్ల్యుహెచ్ఒ’ సభ్య దేశాలకు ఈ సహకార కేంద్రం సాయం అందిస్తుంది.

   ‘ఎన్ఐఐఎంహెచ్’కి ఈ హోదా దక్కడం అన్నది- కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా నాయకత్వ పటిమ, కృషితోపాటు న్యూఢిల్లీలోని ‘డబ్ల్యుహెచ్ఒ-ఎస్ఇఎఆర్ఒ’ సాంకేతిక అధికారి డాక్టర్ పవన్ గొడాత్వర్ సాంకేతిక మార్గనిర్దేశం సహా ‘డబ్ల్యుహెచ్ఒ ప్రధాన కార్యాలయంలోని ‘టిఎం’ యూనిట్ సాంకేతికాధికారి డాక్టర్ ప్రదీప్ దువా మద్దతు ఫలితమనడంలో సందేహం లేదు.

   ఈ నేపథ్యంలో ‘‘సంప్రదాయ వైద్యంలో ప్రాథమిక-సాహితీ పరిశోధన’’కు తొలి సహకార కేంద్రానికి ‘సిసిఆర్ఎఎస్’ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వైద్య రబినారాయణ ఆచార్య నేతృత్వం వహిస్తారు. ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్, యూనిట్ అధిపతి డాక్టర్ జి.పి.ప్రసాద్, ఆయుర్వేద పరిశోధనల విభాగం అధికారి వైద్య సాంకేత్ రామ్ త్రిగుళ్ల  ప్రత్యేక బృందం ఉంటుంది. సాకేత్ రామ్ త్రిగుల్లా, రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేదం), ‘ఎన్ఐఐఎంహెచ్’ ఆయుర్వేద విభాగం పరిశోధనాధికారి డాక్టర్ సంతోష్ మానే తదితరుల బృందం ఆయనకు సహకరిస్తుంది. ‘సిసిఆర్ఎఎస్’ ప్రధాన కార్యాలయ ‘సాహిత్య-ప్రాథమిక పరిశోధన బృందంతో ఈ జట్టు సమన్వయం చేసుకుంటూ తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది.

***



(Release ID: 2025411) Visitor Counter : 75