శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత ప్రగతి పయనం కొనసాగింపు దిశగా తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక


కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయమంత్రిగా
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి;

‘‘ప్రధాని మోదీ నేతృత్వాన శాస్త్ర-సాంకేతిక రంగాల్లో
ప్రపంచ నాయకత్వానికి భారత్ ముందువరుసలో ఉంది’’;

‘‘పౌరులకు జీవన సౌలభ్యం దిశగా ఇంటింటికీ శాస్త్ర-సాంకేతికత
లక్ష్యసాధనలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు’’;

‘‘జీవవైవిధ్య... నీలి... అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలలో ఆవిష్కరణలకు సదా ప్రాధాన్యం’’

Posted On: 11 JUN 2024 7:29PM by PIB Hyderabad

   కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యతగల) స‌హాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూ ఢిల్లీలోని శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) ప్రధాన కార్యాలయంలో ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం ముగిసిన తక్షణం ఆయన ఆరు శాస్త్రవిజ్ఞాన సంబంధ మంత్రిత్వ శాఖలు/విభాగాల సిబ్బందితోపాటు వాటి కార్యదర్శులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన అమలు చేయనున్న తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- ‘‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత ప్రగతి పయనం కొనసాగింపు దిశగా తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయబడుతుంది’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.

   పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా- ‘‘ప్రధాని మోదీ నేతృత్వాన శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి  నాయకత్వం వహించేందుకు భారత్ ముందువరుసలో ఉంది’’ అని పేర్కొన్నారు. అలాగే ‘‘గత పదేళ్ల ప్రధాని మోదీ పాలనలో అంకుర సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. కాబట్టే, 2014నాటికి దేశంలో 350 అంకుర సంస్థలు మాత్రమే ఉండగా 2024కల్లా వాటి సంఖ్య 1.5 లక్షలకు చేరింది. దీంతోపాటు ఇవాళ 110కిపైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయని ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు.

   దేశంలో జీవవైవిధ్య ఆర్థిక వ్యవస్థ అనేక రెట్లు వృద్ధి సాధించిందని, మూడోదఫా ప్రభుత్వ హయాంలో ఈ ప్రగతి కొనసాగుతుందని మంత్రి చెప్పారు. అలాగే రోడ్ల నిర్మాణ సాంకేతికత, కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ వంటి ఆవిష్కరణాత్మక సాంకేతికతల రూపకల్పన సహా సరికొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టడంలో ప్రధాని మోదీ ప్రోత్సాహం కీలకపాత్ర పోషించినట్లు డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. మన దేశం 2047లో పాదం మోపేనాటికి రాబోయే 20 ఏళ్లపాటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలమని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ తన స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆవిష్కరణలు అంతర్భాగంగా ఉంటాయన్నారు.

   ఈ ప్రభుత్వం తన రెండోదఫా పదవీ కాలం ముగిసేనాటికి ‘అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ’ (ఎన్ఆర్ఎఫ్) చట్టం తెచ్చిందని, ఇది శాస్త్ర-సాంకేతిక రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.

   అంతరిక్ష రంగంలో భారత్ ప్రగతిని ప్రస్తావిస్తూ- ‘‘చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగడంతోపాటు భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్రకు ఉద్దేశించిన ‘గగన్ యాన్’ కార్యక్రమంలో సుస్థిర పురోగమనం వంటి విజయాల వల్ల ప్రపంచంలో భారతదేశానికి గౌరవం ఇనుమడించింది’’ అని డాక్టర్ సింగ్ గుర్తుచేశారు. దేశంలో శాస్త్రవిజ్ఞాన ప్రతిభకు కొరత లేదని, విధానపరంగా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటే దృక్కోణం మాత్రమే లోపించిందని మంత్రి వ్యాఖ్యానించారు.

   దేశంలో జీవవైవిధ్య, నీలి, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలలో ఆవిష్కరణలకు సదా ప్రాధాన్యం ఉంటుందని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత ప్రభుత్వ శాస్త్ర వ్యవహారాల ముఖ్య సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్, శాస్త్ర-సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలేతోపాటు ‘ఐఎస్ఆర్ఒ, సిఎస్ఐఆర్’ సీనియర్ శాస్త్రవేత్తలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నిర్దేశించిన తొలి 100 రోజుల ప్రణాళికపై డాక్టర్ జితేంద్ర సింగ్ సీనియర్ అధికారులకు అవగాహన కల్పించారు. అలాగే దేశ పురోగమనంలో ‘సిఎస్ఐఆర్’ సామర్థ్యం, సహకారాలను పెంచే దిశగా సంస్థకు నూతనోత్తేజం కల్పించే ప్రణాళికలపైనా ఆయన చర్చించారు.

***


(Release ID: 2024522) Visitor Counter : 146