శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఐఐటీ దిల్లీలో 'వాతావరణ మార్పులపై సదస్సు' నిర్వహించిన కేంద్ర 'శాస్త్ర & సాంకేతికత విభాగం'
Posted On:
28 MAY 2024 4:17PM by PIB Hyderabad
దిల్లీలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'లో, ఈ నెల 27-28 తేదీల్లో, 'వాతావరణ మార్పులపై సదస్సు' జరిగింది. కేంద్ర 'శాస్త్ర & సాంకేతికత విభాగం' (డీఎస్‌టీ) ఈ సదస్సును నిర్వహించింది.
దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ రంగం నిపుణులు ఈ సదస్సు ద్వారా ఒకే వేదికపైకి వచ్చారు. వాతావరణ పరిశోధనలు, సమాచార నాణ్యత నియంత్రణ, వాతావరణ అంచనాలను మెరుగుపరచడం కోసం భారతదేశానికి సరిపోయేలా కృత్రిమ మేధస్సులో (ఏఐ) పునాది స్థాయి నమూనాలను అభివృద్ధి చేయవలసిన అవసరంపై సదస్సులో చర్చించారు. మెరుగైన వాతావరణ అనుకూల పరిష్కారాల కోసం ప్రజలను భాగస్వాములుగా చేసే చర్యలను బలోపేతం చేయడంపైనా మాట్లాడారు.
"శాస్త్ర & సాంకేతికత విభాగానికి చెందిన 'నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్', 'నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్' మిషన్లు 19 సీవోయీలు, 37 కీలక ఆర్&డీ కార్యక్రమాలకు ఊతమిచ్చాయని డీఎస్టీ కార్యదర్శి ప్రొ. అభయ్ కరాండీకర్ చెప్పారు. భారతీయ అవసరాలకు సరిపోయే ఏఐ పునాదులను అభివృద్ధి చేయడంపై మరింత దృష్టి పెట్టవలసిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా, ‘డిస్ట్రిక్ట్ లెవెల్ క్లైమేట్ రిస్క్ అసెస్‌మెంట్ ఫర్ ఇండియా’ ముసాయిదా సారాంశాన్ని ప్రొ. అభయ్ కరాండీకర్ విడుదల చేశారు. 'సమాచార ఆధారిత స్వదేశీ వాతావరణ నమూనాలు' వాతావరణ మార్పు ఆందోళనలను పరిష్కరించడంలో మెరుగైన అవగాహన కల్పిస్తాయని చెప్పారు. సమగ్ర విధానం దిశగా పరిశోధకులు, పరిశ్రమ వాటాదార్లు చేసే సమష్టి ప్రయత్నాలు వాతావరణ మార్పు, వ్యవసాయం, నీరు, పర్యావరణంపై ప్రభావాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో సాయం చేస్తాయని వివరించారు.
ప్రొ. అభయ్ కరాండికర్, కేంద్ర శాస్త్ర & సాంకేతికత విభాగం కార్యదర్శి
డీఎస్‌టీ సీనియర్ అడ్వైజర్ డా. అఖిలేష్ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. 'వాతావరణ మార్పుల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక' (ఎన్‌ఏపీసీసీ) కోసం డీఎస్‌టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు, వాతావరణ మార్పుల విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి, మార్గదర్శనం, దేశవ్యాప్తంగా పరిశోధన కార్యక్రమాలు వంటి అంశాలను వివరించారు.
వాతావరణ మార్పులను నియంత్రించేందుకు తీసుకువచ్చే పరిష్కారాలు భవిష్యత్ తరాలను సురక్షితంగా ఉంచుతాయని చెప్పిన డా.గుప్తా, దీనికోసం అన్ని ప్రజాసంఘాలు ఏకం కావాలని & సమస్యలను విశ్లేషించడమే కాకుండా పరిష్కారాల కోసం పరస్పర సహకారంతో పని చేయాలని కోరారు.
డీఎస్‌టీలో క్లైమేట్, ఎనర్జీ & సస్టైనబుల్ టెక్నాలజీ విభాగం అధిపతి డా.అనితా గుప్తా మాట్లాడుతూ, ప్రపంచంలో 40% జనాభా వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎన్‌ఏపీసీసీ కింద డీఎస్‌టీ ప్రారంభించిన రెండు మిషన్లు అలాంటి పరిష్కారాల కోసం ఎలా పని చేస్తున్నాయో ఆమె వివరించారు. శుద్ధ ఇంధన పరిష్కారాల కోసం 2015లో ప్రారంభించిన అంతర్జాతీయ కార్యక్రమం 'మిషన్ ఇన్నోవేషన్' గురించి కూడా డా.అనితా గుప్తా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌టీ భాగస్వామిగా ఉంది.
బొగ్గును మిథనాల్‌గా మార్చడం, నీలి హైడ్రోజన్ ఉత్పత్తి, కార్బనాలను ఒడిసిపట్టి నిల్వ చేయడం వంటి వినూత్న సాంకేతికతల్లో ఐఐటీ దిల్లీలోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' చేస్తున్న ప్రయత్నాలను ఐఐటీ దిల్లీ డైరెక్టర్ ప్రొ. రంగన్ బెనర్జీ వివరించారు.
ఐఐటీ దిల్లీ, ఐఐటీ భువనేశ్వర్, బనారస్ హిందు విశ్వవిద్యాలయం, దిల్లీ విశ్వవిద్యాలయం, కశ్మీర్ విశ్వవిద్యాలయం, ఐఐఎస్‌సీ, అలహాబాద్ విశ్వవిద్యాలయం, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, భారత వాతావరణ విభాగం, ఇక్రిశాట్, డీఎస్‌టీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నిపుణులతో పాటు డీఎస్‌టీ అధికార్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2022028)
Visitor Counter : 189