ఉప రాష్ట్రపతి సచివాలయం
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వస్నాతకోత్సవంలోఉప రాష్ర్టపతి ప్రసంగం పూర్తి పాఠం
Posted On:
27 APR 2024 9:40PM by PIB Hyderabad
సోదర సోదరీమణులారా,
నమస్కారం.
ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు అమిత ఆనందంగా ఉంది. నేను తిరుపతిలో దిగి దేవాలయ దర్శనం చేసుకున్నాను.
మిత్రులారా,
ఈ తిరుపతి పవిత్రత, ఆధ్యాత్మికత, విశిష్టతల నిలయం. దర్శనం సమయంలో నేను అది అనుభవించాను. అద్భుతమైన ఆశీర్వాదం పొందాను. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాను.
ఈ విశ్వవిద్యాలయం 3వస్నాతకోత్సవంలో పాల్గొనడం ప్రత్యేక గౌరవంగా నేను భావిస్తున్నాను. మీరు ఆచరించే “తమసోమాజ్యోతిర్గమయ” సూత్రం నన్ను అంధకారం నుంచి జీవితంలోకి నడిపింది. ఇది అత్యంత స్ఫూర్తిదాయకం. నాగరికత చిహ్నం. జీవనసారాన్ని ప్రతిబింబిస్తుంది. మీరందరూ ఈ సూత్రానికి దీటుగా జీవించాలి.
గత నాలుగు దశాబ్దాలుగా తిరుమల సాంస్కృతిక విద్యా పీఠం సంస్కృతం, ఇతర పారంపరిక విద్యాశాస్ర్తాల బోధన, అధ్యయనానికి విశిష్ట కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ రంగానికి సంబంధించిన విశిష్ట ప్రదేశం ఇది. నాకు న్యాయశాస్ర్తాలపై మక్కువ అధికం. ఇప్పుడు నేను పార్లమెంటుతో కూడా అనుబంధం కలిగి ఉన్నాను. ఈ రెండింటినీ అనుసంధానం చేసి చూస్తే నాకు ఈ విశ్వవిద్యాలయమే గుర్తుకు వస్తుంది.
ఈ విశ్వవిద్యాలయం అధ్యక్షులుగా పని చేసిన వారెవరో తెలుసా? భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ పతంజలి శాస్ర్తి, విశిష్ట వ్యక్తి శ్రీ వి.రాఘవన్, లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీ వి. అయ్యంగార్ వంటి వారు పని చేశారు. ప్రస్తుతం సమర్థుడైన శ్రీ ఎం.గోపాలస్వామి విశ్వవిద్యాలయానికి మార్గదర్శకం చేస్తున్నారు.
విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. మీరందరూ నేడు మీ డిగ్రీలు పొందుతున్నారు. మీ అందరి జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన రోజు. మీకు, మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీ మిత్రులకు ఇది ఒక మైలురాయి. మీరు ఇప్పుడు మరింత పెద్ద ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. భారతదేశం వెలుగులు ప్రసరింపచేస్తున్న తరుణంలో మీరందరూ ఒక పెద్ద అడుగు వేయడం మీ అదృష్టం. ఈ వృద్ధిని ఏ శక్తీ ఆపలేదు. మనం ప్రపంచ శక్తి అయ్యే దిశగా ముందుకు సాగుతున్నాం. ఇందుకు మనందరం అదృష్టవంతులం.
మీ అంకిత భావం, కఠోర శ్రమ, సంస్కృత భాషపై పట్టుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
ఈ అమృత కాలంలో జరుగుతున్న ఈ స్నాతకోత్సవం మరింత మహత్వపూర్ణమైనది. ఇక్కడ నుంచి పట్టా అందుకోవడం మీకు కొత్త గుర్తింపు తెస్తుంది. మీరందరూ సంస్కృత భాష రాయబారులుగా మారాలి. సంస్కృతం దేవభాష. ప్రపంచంలో తొలి భాష ఇదే. మన వేదాల్లోని భాష. అన్ని భాషలకు మాతృక సంస్కృతమే. ఏ భాష కూడా సంస్కృతాన్ని ప్రభావితం చేయలేదు. అందుకే అది ఉత్తమమైన భాష.
మన రాజ్యాంగం శతాబ్దాల కాలం నాటి సంస్కృత భాషా సారాన్ని వివరిస్తుంది. సంస్కృత భాష సాంప్రదాయాన్ని నేర్పుతుంది. మన భాషా సాన్నిహిత్యాన్ని కాపాడుకోవడం మనందరి విధి. భారత్ వంటి దేశం ప్రపంచంలోనే లేదు. ఎన్నో భాషల ఆలవాలం ఈ దేశం. భారత రాజ్యాంగంలో 22 భాషలకు గుర్తింపు ఉంది. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా వంటి భాషలకు‘‘ప్రాచీన భాషలహోదా (క్లాసికల్ లాంగ్వేజెస్)హోదా కల్పించింది.
మిత్రులారా,
సంస్కృతం అన్ని భాషలకు మాతృక. భారతీయ భాషల పరిణామక్రమంలో సంస్కృతానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ భాషలకువిస్తృతమైన వైరుధ్యం ఉన్నప్పటికీ అవి భాషా, సాహితీ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. అవి ఐక్యతా శక్తులుగా ఉంటాయి. చరిత్ర పొడవునా భారతీయ భాషలు, సాహిత్యం నడుమన నిర్మాణాత్మకమైన అనుసంధానత ఉంది. సంస్కృత వ్యాకరణం, నిర్మాణం, పదజాలం అన్నీ హిందీ సహా పలు భారతీయ భాషల్లో ప్రవేశించాయి. అంతేకాదు, ఆగ్నేయాసియాలో మాట్లాడే అన్ని భాషల్లోను సంస్కృత భాషా పదాలున్నాయి. ప్రాంతీయ భాషలపై సంస్కృత భాషా ప్రభావానికి ఇది చక్కని ఉదాహరణ.
ఏ భాష అయినా సమాజంలో ఉపయోగంలో ఉన్నప్పుడే దాని మనుగడ కొనసాగుతుంది. లేదంటే అది అదృశ్యం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే అందులో సాహిత్యం రావాలి. ఈ కోణంలో పరిశీలించినట్టయితే సంస్కృత వినియోగం విశేషంగా పెరగాలి. మీరే ఇందుకు సమర్థులు. సంస్కృత భాషా వినియోగాన్ని పెంచడమే మీ అందరి లక్ష్యం కావాలి.
మిత్రులారా,
ప్రపంచ యవనికపై అతి పెద్ద పాత్ర పోషించేందుకు భారతదేశం సంసిద్ధం అవుతున్న తరుణంలో దేశంలోని విద్యావ్యవస్థ స్థానిక అవసరాలకే కాకుండా ప్రపంచ అవసరాలకు కూడా దీటుగా ఉండాలి. మనం ఆ దిశగా వేగంగా కదులుతున్నాం.
విద్యావిధానం అభివృద్ధి, వారసత్వం మధ్య సమతుల్యత సాధించేందుకు భారత్ లో అర్ధవంతమైన ప్రయత్నం జరిగింది. భారతీయ సమాజానికి సంస్కృతం మూలాధారం. సంస్కృతం తెలియని వారు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంస్కృత భాషలోని ‘‘సత్యమేవ జయతే’’, ‘‘యతో ధర్మస్తతో జయః’’ అనే వాక్యాలు భారతీయులకు శిరోధార్యం. భగవద్గీత ఎందరో మహానుభావులకు మార్గదర్శకంగా నిలిచింది. ‘‘వసుధైవ కుటుంబకం’’ సిద్ధాంతం మన విశ్వదర్శనానికి ప్రతీక. మనం గత ఏడాది జి-20ని విజయవంతంగా నిర్వహించాం. జి-20క మనం ఇచ్చిన నినాదం ‘‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’. దీనికి కూడా వసుధైవ కుటుంబకం సిద్ధాంతమే మూలం. దాన్ని ప్రపంచం యావత్తు స్వీకరించింది. సమున్నతమైన భారత చరిత్ర, 5000 సంవత్సరాల నాటి భారత నాగరిక విలువలు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. విదేశీ అతిథులను ఆహ్వానించేందుకు ప్రధానమంత్రి ఎంచుకున్న నేపథ్యం చూసి మీరంతా ఆనందించి ఉంటారు.
సంస్కృత సాహిత్యం మానవజాతి వారసత్వ సంపద. అదే సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనం ఆకళింపు చేసుకున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు మన జీవితాల్లోకి లోతుగా ప్రవేశించాయి. మనం వాటితో మనుగడ సాగించాలి. సాంకేతికత విస్తరించాలంటే దానికి ఏదైనా భాష అండ ఉండాలంటారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అలా అన్నింటిలో ఒదిగిపోయేదే సంస్కృత భాష. ఈ భాషలో ద్వంద్వార్ధాలుండవు. సంక్లిష్టమైన సందర్భాల్లో టెక్నాలజీకి కావలసినది కూడా ఇదే.
త్రిభాషా ఫార్ములాలో భాగంగా పాఠశాల స్థాయిలో సంస్కృత భాష నేర్చుకోవడం ఒక ఆప్షన్ గా ఎన్ఇపిలో పొందుపరచడం ఆనందదాయకమైన అంశం.క్షేత్రస్థాయిలో అది సాకారం కావాలంటే సంస్కృత భాషకు సరళత కల్పించాలి. సంస్కృతం నేర్చుకోవడం, మాట్లాడడం చాలా కష్టంఅనే భావన ప్రస్తుతం సమాజంలో ఉంది. మీరంతా ఇప్పుడు కీలకమైన కూడలిలో ఉన్నారు. ఈ దశను దాటడం కొంత కష్టమే. ఆ దశ దాటినట్టయితే ప్రయాణం సరళం, ఆనందదాయకం అవుతుంది. సంస్కృతం పరిస్థితి కూడా అంతే.
మూడు దశాబ్దాల విరామం అనంతరం రూపొందించిన విద్యావిధానం మన సాంస్కృతిక, సాహిత్య, హస్తకళా, మేధో వారసత్వాన్ని కాపాడేదిగా ఉంది. భాగస్వామ్య వర్గాలన్నింటి అభిప్రాయాలు సేకరించి దాన్ని రూపొందించారు.
చాలా దేశాల్లో సంస్కృతం పట్ల ప్రేమ పెరుగుతోంది. ఇది మన సంస్కృతి వైశాల్యానికి నిదర్శనం. సంస్కృతం జాతీయ ప్రాధాన్యంగా మారాలి. అందులో మీ అందరి సహకారం చాలా కీలకం. వైవిధ్యభరితమైన సాహితీ విలువలు సంస్కృతంలో ఉన్నాయి. వైద్యం, డ్రామా, సంగీతం, సైన్స్ ఏ విభాగంలో అయినా విశేషమైన జ్ఞాన సంపద సంస్కృతంలో ఉంది. ఇంకెక్కడా అది లభించదు.
సంస్కృతంలోని విస్తారమైన పదజాలం వేదాల నుంచి రామయణం వంటి పౌరాణిక గాథలు, అర్థశాస్ర్తం వంటి ఆచరణీయ శాస్ర్తాల్లో భావ వ్యక్తీకరణకు సహాయకారిగా ఉంది. అద్భుతమైన విస్తృతి కలిగి ఉన్నప్పటికీ ప్రధాన విద్యా స్రవంతిలో ఆ భాష అనుసంధానత పరిమితంగానే ఉంది. వలసవాద భావాలు ఇప్పటికీ భారతీయ మేథో వ్యవస్థకు సవాలుగానే ఉన్నాయి.
భారతీయ జ్ఞాన పరంపరనుపునరుద్ధరించడంలో, దానిపై పరిశోధనలో మీ సంస్థల వంటివి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు బాగా రాణిస్తారు. మీరు అసలైన సంస్కృత ప్రతులను చదివి వాటికి సరైన అనువాదం, అర్ధం అర్ధం కనుగొనవచ్చు.వాటిని ఇతర భారతీయ భాషలలోకి అనువదించవచ్చు.తద్వారా అన్ని భారతీయ భాషల పురాతన గ్రంథాలు, వాటిలో ఉన్న జ్ఞానంపై లోతైన పరిశోధన చేయవచ్చు. ఈ పురాతన ప్రతులు, గ్రంథాలను అమూల్యమైన డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చడంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం డిజిటల్ టెక్నాలజీలను నేర్చుకోవాలని నేను విద్యార్థులను కోరుతున్నాను. నేడు మీకు అందుబాటులో ఉన్న నాయకత్వం ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉండడం మీ అదృష్టం.
సంస్కృతం దేవభాష. ఆధ్యాత్మికత, పవిత్రతలను అనుసంధానం చేసే వారధి సంస్కృతం.
స్వరం లేదా నాద అనేవి బ్రహ్మాండం నుంచే ఉద్భవించాయని భారతీయ సాంప్రదాయంలో విశ్వసిస్తారు. స్వరానికి ఉచ్ఛారణ కూడా కీలకమే. అందుకే సంస్కృతం వాటికి ఉచ్ఛారణ కల్పిస్తుంది. ఓం అన్న స్వరంతో యావత్ పర్యావరణమే మారిపోతుంది. ఏ భాషకూ ఇంత బలం లేదు.
భాషలకు సంబంధించినంత వరకు సంస్కృతానికి అణువంత సామర్థ్యం ఉంది. 140 కోట్ల జనాభా, శక్తివంతమైన ప్రజాస్వామ్యం, ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి త్వరలో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరగల అవకాశం ఉన్న భారతజాతి కోసం మనం సంస్కృత భాష సామర్థ్యాన్ని వెలికి తీయాలి.
మనం అజెండా తయారుచేస్తే చాలు. అమలు దానికదే జరిగిపోతుంది. జాతి ప్రయోజనాల దృష్ట్యా అది చాలా అవసరం. అది మనకి ప్రపంచంలో కొత్త తరహా ఉన్నతిని కల్పిస్తుంది. వేద మంత్రాల ప్రతిధ్వనులు, ఉపనిషత్ శ్లోకాలు, దేవాలయాల్లో పఠించే మంత్రాలు అన్నీ వాతావరణంలో ప్రశాంతతను నింపుతాయి. పరమార్ధాన్ని దర్శింపచేస్తాయి. ప్రముఖ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రతినిధులైన మీరు ఉన్నత విద్యలో భారతీయ విజ్ఞాన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పెంచడంలో కీలక భాగస్వాములుగా నిలుస్తారు.
అన్వేషణాత్మక బోధనాంశాలను అభివృద్ధి చేయడం, విభిన్న విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా మీరు సమున్నతమైన సంస్కృత వారసత్వ సంపదకు, ఆధునిక విద్యావసరాలకు మధ్య గల వ్యత్యాసాన్ని పూడ్చడంలో కీలక పాత్ర పోషించగలుగుతారు.
పవిత్రమైన సంస్కృత భాష మనని భగవంతునితో అనుసంధానం చేయడమే కాకుండా ప్రపంచాన్ని సమగ్రంగా అర్ధం చేసుకునే దిశలో మన బాటను వెలుగులతో నింపుతుంది. నేటి సుడిగాలి ప్రపంచంలో సాంత్వన చేకూర్చగల ప్రత్యేక స్థానం సంస్కృతానికి ఉంది. ఆధ్యాత్మిక పవిత్రత, లోతైన ఆత్మ అనుసంధానత కల్పించే శక్తి సంస్కృతం. తుపానులో ఇది ఒక బలమైన లంగరు వంటిది.
పట్టభద్రులందరికీ అభినందనలు. మీలోని అంకిత భావమే మిమ్మల్ని ఈ మైలురాయికి చేర్చింది.
విద్యారంగానికి చెందిన జ్ఞానంగానే కాకుడా పరివర్తిత శక్తిగా సంస్కృత వారసత్వాన్ని ముందుకు నడపండి. ఈ విజ్ఞాన ఖని భవిష్యత్ తరాలకు అందడానికి వీలుగా అమూల్యమైన ఈ సాంస్కృతిక వారసత్వానికి ప్రచారకర్తలుగా మారండి.
సంస్కృతం చదవడం సాధారణ విద్య కన్నా చాలా విశిష్టమైనది. ఆత్మ జ్ఞానం, చైతన్యం కలిగిస్తుంది. ప్రజలు సాధారణంగా సంతృప్తత, ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటారు. అటువంటి చైతన్యాన్ని కల్పించే మాధ్యమం సంస్కృత భాష. ప్రాచీన శ్లోకాలు ఎంతో విలువైన మేథోజ్ఞానాన్ని కలిగిస్తాయి. జీవితంలోని ఆంతర్యాన్ని తెలియచెప్పి ప్రపంచంలో మన స్థానం ఏమిటో తెలియచేస్తాయి. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడమే మన సిద్ధాంతం.
సంస్కృత భాషా జ్ఞానం మనందరి మనస్సులు, హృదయాల్లో వెలుగులు నింపాలి. మనందరినీ ఆత్మ చైతన్యం, ఆధ్యాత్మిక సంతృప్తత స్థాయికి చేర్చాలి. ప్రజలు గుండె గురించి జాగ్రత్త తీసుకుంటారు, మనసు గురించి జాగ్రత్త తీసుకుంటారు. కాని మీరు ఆత్మ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మన నాగరికత లోతుల్లోకి వెళ్లి సంస్కృత భాషను గుర్తు తెచ్చుకోవాలి. ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. ఆ స్థాయికి మనని చేర్చగల మాధ్యమం సంస్కృతమే.
పట్టభద్రులైన విద్యార్థులందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. సంస్కృత భాషా జ్ఞానంతో మీరు ఈ క్యాంపస్ దాటి అసలైన ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మన ప్రాచీన వారసత్వానికి మీరే వెలుగు దివ్వెలు అవుతారని గుర్తుంచుకోండి. ఇది కేవలం విద్యాపరమైన విజయం కాదు, పరివర్తిత మార్గం.
సంస్కృత భాషకు అసలు, సిసలు వారధులుగా, కస్టోడియన్లుగా, చాంపియన్లుగా మారాలని మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్ తరాలు మన సమున్నతమైన, అమూల్యమైన వారసత్వ సంపదను అందుకోవాలంటే దాన్ని పరిరక్షించి, ప్రాచుర్యంలోకి తీసుకురావలసిన బాధ్యత మనందరిపై ఉంది.
మనందరం సంస్కృత భాష, ప్రాచీన నాగరికత ట్రస్టీలుగా మారదాం. దానికి విలువ జోడించి భవిష్యత్ తరాలకు అందించుదాం.
మరోసారి మీ అందరికీ అభినందనలు.
దన్యవాదాలు, జైహింద్.
***
(Release ID: 2019248)
Visitor Counter : 173