ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆహార భద్రతపై దిల్లీ మార్కెట్లలో అవగాహన ప్రచారం ప్రారంభించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ


సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యత, పచ్చి కాయలు & ముడి ధాన్యాల పరీక్షలు, పురుగు మందు అవశేషాలు, కృత్రిమంగా పండించడం, మైనపు పూత వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన ప్రచారం

Posted On: 08 APR 2024 7:59PM by PIB Hyderabad

ఆహార భద్రతపై, 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దేశ రాజధాని దిల్లీలోని ప్రధాన మార్కెట్లలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దిల్లీలోని ఆహార భద్రత విభాగం సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దిల్లీలోని ఖాన్ మార్కెట్, ఐఎన్‌ఏ మార్కెట్ నుంచి ఈ నెల 08న అవగాహన ప్రచారం ప్రారంభమైంది. ఆహార ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, కల్తీలను గుర్తించడం, వాటిని తగ్గించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.

ప్రధానంగా, పండ్లు, కూరగాయల్లో పురుగు మందుల అవశేషాల వల్ల ఆరోగ్యానికి కలిగే హాని, పురుగు మందుల అవశేషాలను పరీక్షించాల్సిన అవసరంపై మార్కెట్ సంఘాలు, వ్యాపారులకు అధికార్లు అవగాహన కల్పించారు. "ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్" పేరిట ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రారంభించిన చలన ప్రయోగశాల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. వివిధ ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, తృణధాన్యాల్లో దాదాపు 50 రకాల పురుగు మందుల అవశేషాలను గుర్తించగల సామర్థ్యం ఈ ప్రయోగశాలకు ఉంది. ఈ పరీక్షల ఫలితాలు కొన్ని గంటల్లోనే తెలుస్తాయి, ఆహార భద్రత విషయంలో వేగంగా చర్యలు తీసుకోవచ్చు.

వేగవంతమైన పరీక్షల కోసం, మార్కెట్‌లో విక్రయించే ఉత్పత్తుల భద్రత & నాణ్యత తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగశాలను ఉపయోగించుకోవాలని అధికార్లు వ్యాపారులకు సూచించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి తీసుకోవడం, ఆహార భద్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం వంటి చాలా అంశాలపైనా అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నమోదిత వ్యాపారుల నుంచి పచ్చి కాయలు, ముడి ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలు కొనాలని వ్యాపారులకు సూచించారు.

అనుమతి లేని రసాయనాలను ఉపయోగించి పండ్లు, కూరగాయలను కృత్రిమంగా పండించడం, మైనంతో పూత పూయడం వంటి చట్టవ్యతిరేక పనుల గురించి; సేంద్రియ వ్యవసాయం పాత్ర గురించి అధికార్లు అవగాహన కల్పించారు. దిల్లీ, సమీప ప్రాంతాల్లో ఉన్న ఆహార ఉత్పత్తుల పరీక్ష కేంద్రాల గురించి తెలియజేశారు.

"ఆహార భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత" అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగింది. మన దేశంలో, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలను అమలు చేసే అత్యున్నత స్థాయి నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ. దేశవ్యాప్తంగా పటిష్టమైన ఆహార భద్రత ప్రమాణాలను అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిబద్ధతతో పని చేస్తోంది.

 

***



(Release ID: 2017919) Visitor Counter : 62


Read this release in: English , Urdu , Hindi , Punjabi