ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజాస్వామ్య సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 20 MAR 2024 9:34PM by PIB Hyderabad

ఎక్సలెన్సీస్,

నమస్కార్.

ఈ చొరవను కొనసాగిస్తున్నందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు నా అభినందనలు. ప్రజాస్వామ్య దేశాలు తమ అనుభవాలు తెలియచేసుకునేందుకు, పరస్పరం నేర్చుకునేందుకు ‘‘ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు’’ ఒక ముఖ్యమైన వేదికగా రూపాంతరం చెందింది.

ఎక్సలెన్సీస్,

నేటి నుంచి కొద్ది వారాల వ్యవధిలో భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం నిర్వహించుకుంటోంది. మానవాళి చరిత్రలోనే అతి పెద్దదైన ఎన్నికల ప్రక్రియలో సుమారుగా వంద కోట్ల మంది ప్రజలు ఓటు వేయబోతున్నారు. భారత ప్రజలు మరోసారి ప్రజాస్వామ్యం పట్ల తమ విశ్వాసం ప్రకటించబోతున్నారు. భారతదేశానికి ప్రాచీన, అవిచ్ఛిన్న ప్రజాస్వామ్య  సంస్కృతి ఉంది. భారత నాగరికతకు జీవం అదే. భారత చరిత్ర పొడవునా ఏకాభిప్రాయ నిర్మాణం, దాపరికం లేని చర్చ, స్వేచ్చాయుత సంభాషణలు ప్రతిధ్వనించాయి. అందుకే నా దేశ పౌరులు భారతదేశాన్ని ప్రజాస్వామ్య మాతృకగా భావిస్తారు.

ఎక్సలెన్సీస్,

గత దశాబ్ది కాలంలో భారతదేశం ‘‘సబ్  కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ మంత్రంతో అంటే సమ్మిళిత వృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతోంది. అసలు సిసలైన సమ్మిళిత స్ఫూర్తితో పేదలు, మహిళలు, యువత, రైతులు సహా సమాజంలోని అన్ని వర్గాలను చేరుతున్నాం. కొరత, అవినీతి, వివక్ష స్థానంలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తూ పనితీరు ఆధారిత పాలనకు మేం పరివర్తన చెందాం. ఇందులో టెక్నాలజీ ప్రధాన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వ డిజిటల్  మౌలిక వసతుల్లో భారతదేశం సాధించిన వేగవంతమైన పురోగతి ప్రజాసేవల అందించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంచింది. యువశక్తి, టెక్నాలజీ మద్దతుతో భారతదేశం ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్  వ్యవస్థగా అభివృద్ధి చెందింది. సుమారు 14 లక్షలకు పైగా ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధులు అట్టడుగు స్థాయిలో మహిళా ఆధారిత అభివృద్ధికి చోదకులుగా ఉన్నరారు.

ఎక్సలెన్సీస్,

నేడు భారతదేశం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు తీర్చడమే కాదు...ప్రజాస్వామ్యం పని చేస్తుంది, ప్రజాస్వామ్యం సాధికారం చేస్తుంది అనే ఆశ ప్రపంచంలో రేకెత్తించింది. మహిళలకు కనీసం మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించి తద్వారా ప్రజాస్వామిక ప్రపంచంలోని మహిళలందరిలోనూ ఆశలు కల్పించింది. గత 10 సంవత్సరాల కాలంలో 25 కోట్ల మందిని పేదరికం రేఖ నుంచి వెలుపలికి తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్యం సానుకూల పరివర్తన తీసుకురాగలదన్న నమ్మకం ప్రపంచంలో కలిగించింది. 150కి పైగా దేశాలకు భారతదేశం కోవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు అందించినప్పుడు బాధలు ఉపశమింపచేయడంలో ప్రజాస్వామ్య శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రమండల ఉపరితలంపై  చంద్రయాన్ విజయవంతంగా దిగినప్పుడు అది ఒక్క భారతదేశ విజయం మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్య విజయం. జి-20కి అధ్యక్షత వహించిన సమయంలో భారతదేశం ప్రపంచ దక్షిణ ప్రాంత వాక్కుగా మారినప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో సంప్రదింపుల ద్వారా విధాన నిర్ణయాల ప్రాధాన్యం ఏమిటో చాటి చెప్పింది. నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సంసిద్ధమవుతున్న తరుణంలో ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు కల్పించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్  గా అవతరించాలన్న సంకల్పం చేసుకున్న సమయంలో ప్రజాస్వామ్యం ఆశించగలదు, స్ఫూర్తి పొందగలదు, సాధించగలదు అని సంకేతిస్తోంది.

ఎక్సలెన్సీస్,

సంక్షోభాలు, పరివర్తనల శకంలో ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. అంతర్జాతీయ వ్యవస్థలు మరింత సమ్మిళితం, ప్రజాస్వామికం, భాగస్వామ్యయుతం, నిజాయతీ గలవిగా మార్చే ప్రయత్నంలో ప్రజాస్వామ్య దేశాలన్నీ నాయకత్వ పాత్ర పోషించాలి. అటువంటి భాగస్వామ్య ప్రయత్నాల ద్వారా మాత్రమే మన ప్రజలందరి ఆకాంక్షలు తీర్చగలుగుతాం. రాబోయే తరాలకు భద్రమైన, సుస్థిర, సుసంపన్న భవిష్యత్తుకు పునాదులు వేయగలుగుతాం. ఈ ప్రయత్నంలో తోటి  ప్రజాస్వామ్య దేశాలతో తన అనుభవాలు పంచుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.

ధన్యవాదాలు. 

***


(Release ID: 2015883) Visitor Counter : 202