బొగ్గు మంత్రిత్వ శాఖ
2030 నాటికి పునరావృత ఇంధన సామర్ధ్యాన్ని 9గిగావాట్లకుపైగా పెంచాలని లక్ష్యం పెట్టుకున్న బొగ్గు రంగం
Posted On:
12 MAR 2024 12:53PM by PIB Hyderabad
సిఒపి -26 సందర్భంగా ప్రధానమంత్రి పంచామృత్ ప్రకటనకు అనుగుణంగా, 2070 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా పురోగమించేందుకు, బొగ్గు మంత్రిత్వ శాఖ కర్బన పాదముద్రలను తగ్గించే దిశగా పునరుత్పాదక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంది. పునరావృత ఇంధన సామర్ధ్యాన్ని పెంచడంపై నిశిత దృష్టి పెట్టి, బొగ్గు/ లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో నికర సున్నా విద్యుత్‌ను వినియోగించాలన్న ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. పర్యావరణంపై దుష్ప్రభావాన్ని నివారించడంలో పునరావృత ఇంధనం పోషించే కీలక పాత్రను గుర్తిస్తూ, మైనింగ్ కేంద్రాల వ్యాప్తంగా ఇంటికప్పుపై సోలార్, భూతలంపై సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును మంత్రిత్వ శాఖ చురుకుగా ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా, పునరుద్ధరించిన మైనింగ్ ప్రాంతాలలో, అలాగే ఇతర అనువైన ప్రదేశాలలో సోలార్ పార్కుల అభివృద్ధి ద్వారా స్థిరమైన ఇంధన ఉత్పత్తి కోసం తక్కువగా ఉపయోగించే భూవనరులను ఉపయోగించుకునేందుకు వినూత్న ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ వ్యూహాత్మక చొరవ 2030 నాటికి శిలాజ ఇంధన- ఆధారిత ఇంధన వనరుల నుంచి 50% సంచిత విద్యుత్ ఇంధన వ్యవస్థాపక సామర్ధ్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం తాజాపరిచిన ఎన్‌డిసి లక్ష్యంతో సమలేఖనం చేయడం జరిగింది.
మైనింగ్ తాలూకు కర్బన పాదముద్రలను స్వల్ప స్థాయికి తెచ్చేందుకు, సౌర ఇంధన పరిష్కారాలను అనుసరించడాన్ని వేగిరపరచవలసిందిగా బొగ్గు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ భవనాల కప్పులపై సోలార్ ప్యానెళ్ళను ఏర్పాటు చేయడం, మైనింగ్ కార్యకలాపాలు సాగించలేని ప్రాంతాలు, ఇతర అనువైన భూములలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు, గతంలో ఉపయోగించని ప్రదేశాలలో సౌరసామర్ధ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం సహా పలు చర్యలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సిఐఎల్), ఎస్‌సిసిఎల్ సహా అగ్ర బొగ్గు కంపెనీల ఉమ్మడి సౌర సామర్ధ్యం 1700 మెగావాట్లగా ఉండగా, దీనికి గాలి యంత్రాలు అదనంగా 51 మెగావాట్లను జోడిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బొగ్గు రంగం 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని 9 గిగావాట్లకి పెంచాలని లక్ష్యంగా పెట్టుంది. ఇది సుస్థిరత, పర్యావరణ సారథ్యం పట్ల లోతైన నిబద్ధతను సూచిస్తుంది. నికర సున్నా విద్యుత్ వినియోగానికి ప్రణాళిక అన్నది భవిష్యత్ తరాలకు గాఢమైన హామీని, లాభాలను కలిగి ఉంది. పునరుత్పాదక ఇంధన వనరులను స్వీకరించడం ద్వారా, ఇది కర్బన ఉద్గారాలలో గణనీయమైన తగ్గింపును సులభతరం చేసి, తద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తుంది. అదనంగా, ఈ ప్రాజెక్టు పునరుత్పాదక రంగంలో సాంకేతిక ఆవిష్కరణలను, పురోగతిని ప్రోత్సహించడం ద్వారా ఆర్ధిక వృద్ధి, ఉద్యోగ, ఉపాధి సృష్టిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా, ఆర్ధిక వృద్ధి, ఉద్యోగ సృష్టిని ఉత్రేరణం చేస్తూ, హరిత ఆర్ధిక వ్యవస్థ దిశగా భారత్ పరివర్తనను ప్రోత్సహిస్తుంది. అదనంగా, నికర సున్నా విద్యుత్ వినియోగం ప్రణాళిక అన్నది ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలను ఒకేవిధంగా తీర్చగల స్థితిస్థాపకమైన, స్థిరమైన విద్యుత్ పరిదృశ్యంతో కూడిన ప్రకాశవంతమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్తును అందించే ఒక రూపావళి మార్పుకు నాంది పలుకుతుంది.
భారతదేశ ఇంధన భవిష్యత్తును స్థిరంగా, స్థితిస్థాపకంగా భద్రపరచడానికి నిలకడైన నిబద్ధతతో ఆవిష్కరణలను, ఇంధన రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతతో ఉంది. నికర సున్నా విద్యుత్ వినియోగ చొరవ ద్వారా సుస్థిర ఇంధన పద్ధతుల కోసం ఒక సువర్ణ ప్రమాణాన్ని స్థాపించేందుకు కృషి చేస్తూ, ఇతర రంగాలు అనుకరించడానికి స్ఫూర్తిదాయకంగా పని చేస్తుంది. ఈ చొరవ పర్యావరణ అనుకూల, మరింత స్థిరమైన భారతదేశాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా సామాజిక- ఆర్థిక అభివృద్ధికి, ప్రపంచంతో మన దేశపు పోటీతత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2013969)
Visitor Counter : 134