సహకార మంత్రిత్వ శాఖ
న్యూ ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ ను ప్రారంభించి , నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ 2023: నివేదిక ను ఆవిష్కరించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
“సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఒక కొలిక్కి తీసుకురావడం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నైజం”
“సహకార రంగానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇకపై ఒక్క క్లిక్ తో లభిస్తుంది”
“సహకార రంగంలో విస్తరణ, అభివృద్ధి, డెలివరీని డేటాబేస్ నిర్ధారిస్తుంది”
“సహకార రంగం అభివృద్ధికి నేషనల్ డేటాబేస్ దిక్సూచిలా దిశానిర్దేశం చేస్తుంది”
“జాతీయ డేటాబేస్ మనకు ఎక్కడ తక్కువ సంఖ్యలో సహకార సంఘాలు ఉన్నాయనే అంతరాలను గుర్తిస్తుంది; సహకార రంగ విస్తరణకు సహాయపడుతుంది”
“విధాన నిర్ణేతలు, పరిశోధకులు , వాటాదారులకు సహకార డేటాబేస్ ఒక అమూల్యమైన వనరుగా పనిచేస్తుంది “
“ఈ డేటాబేస్ సహకార రంగం కార్యకలాపాలు అన్నింటికీ సమాధానం ; అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించబడింది”
“డేటాబేస్ పోర్టల్ ద్వారా, చిన్న సహకార సంఘాలు వాటి విస్తరణకు మార్గదర్శకత్వం పొందుతాయి”
“పిఎసిఎస్ లను అపెక్స్ తో, మండీని అంతర్జాతీయ మార్కెట్ తో , రాష్ట్రాన్ని అంతర్జాతీయ డేటాబేస్ తో అనుసంధానించే సామర్థ్యాన్ని డేటాబేస్ కలిగి ఉంది”
Posted On:
08 MAR 2024 6:26PM by PIB Hyderabad
కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుక్రవారం న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ ను ప్రారంభించారు. ‘నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ 2023: ఎ రిపోర్ట్'ను విడుదల చేశారు. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటానీతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా సహకార డేటాబేస్ ప్రారంభోత్సవం జరుగుతున్నందున, సహకార రంగానికి, దాని విస్తరణకు , బలోపేతం చేయడానికి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని అన్నారు.
సహకార రంగ విస్తరణ, దానికి ఊతమివ్వడమే లక్ష్యంగా నేటి కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వేలాది మంది ఏళ్ల తరబడి చేసిన శ్రమతో ఈ రోజు ఈ విజయాన్ని సాధించామని శ్రీ షా పేర్కొన్నారు.
1960వ దశకం తర్వాత జాతీయ విధానం కింద ప్రతి రాష్ట్రంలోని సహకార ఉద్యమాల మధ్య సమన్వయం అవసరమని భావించామని కేంద్ర సహకార శాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై కార్యరూపం దాల్చింద ని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లలో దేశంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరించామని, అన్ని రాష్ట్రాలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఉమ్మడి బైలాస్ ను ఆమోదించాయని తెలిపారు. నేడు అన్ని పి ఎ సి ఎస్ లు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. మోదీ ప్రభుత్వం మోడల్ బైలాస్ అడ్వైజరీలను రూపొందించిందని, దీని కింద పి ఎ సి ఎస్ లు బహుముఖంగా మారాయని, వివిధ పనులను చేపట్టగలవని అమిత్ షా పేర్కొన్నారు. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఈ మోడల్ బైలాస్ ను ఆమోదించాయని, దీంతో పి ఎ సి ఎస్ ల విస్తరణకు మార్గం సుగమమైందని అన్నారు.
పి ఎ సి ఎస్ లకు అనుబంధంగా 20 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టామని, తద్వారా అవి లాభాలను ఆర్జించేందుకు వీలవుతుందని అన్నారు. పిఏసీఎస్ ల కంప్యూటరీకరణతో వాటి అభివృద్ధికి అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2027 నాటికి దేశంలోని ప్రతి గ్రామంలో ఒక పిఏసిఎస్ ఉండాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తరువాత, అంతరాల గురించి వారికి ఖచ్చితంగా తెలియనందున ఒక సవాలు తలెత్తిందని, అప్పుడే ఈ డేటాబేస్ ఆలోచన ఉద్భవించిందని శ్రీ షా తెలిపారు. సమగ్ర విశ్లేషణ ద్వారా అంతరాలను గుర్తించి పరిష్కరించడమే ఈ డేటాబేస్ లక్ష్యం. సహకార రంగం అభివృద్ధికి దిక్సూచిలా నేషనల్ డేటాబేస్ దిశానిర్దేశం చేస్తుందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, సామాన్య ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేశారని, గత పదేళ్లలో 25 కోట్ల మందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తెచ్చారని కేంద్ర హోం, సహకార మంత్రి పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ తోనూ , అభివృద్ధితోనూ లక్షలాది మంది ప్రజలను అనుసంధానం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ చురుగ్గా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. సహకార సంస్థల విస్తరణ, డిజిటల్ అభివృద్ధి, డేటాబేస్ ల ద్వారా డెలివరీలో సహకార డేటాబేస్ కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ షా ఉద్ఘాటించారు. అభివృద్ధిని సరైన దిశలో నడిపించడానికి డేటా పనిచేస్తుందని, అంతరాలను విశ్లేషించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని ఆయన వివరించారు. డేటా గవర్నెన్స్, క్రియాశీల పాలన, ముందస్తు పాలన అనే కొత్త ట్రెండ్ ను ఈ యుగంలో మనం అనుభవిస్తున్నామని శ్రీ షా తెలిపారు. ఈ మూడింటి సమ్మేళనం ఒక కొత్త అభివృద్ధి నమూనా స్థాపనకు దారితీస్తుంది.
నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ పనులు మూడు దశల్లో జరిగాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. మొదటి దశలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ అనే మూడు రంగాల్లోని సుమారు 2.64 లక్షల సొసైటీల మ్యాపింగ్ పూర్తయింది. రెండో దశలో వివిధ జాతీయ సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్యలు, రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్ టి సి బి), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డి సి సి బి), పట్టణ సహకార బ్యాంకులు (యు సి బి) , రాష్ట్ర సహకార వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు (ఎస్ సి ఎ ఆర్ డి బి) , ప్రాథమిక వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు (పి సి ఎ ఆర్ డి బి), సహకార చక్కెర మిల్లులు, జిల్లా యూనియన్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల (ఎం ఎస్ సి ఎస్) ల డేటాను సేకరించారు. మూడో దశలో ఇతర రంగాల్లోని మిగిలిన ఎనిమిది లక్షల ప్రాథమిక సహకార సంఘాల డేటా మ్యాపింగ్ చేపట్టారు. ఆ తర్వాత దేశంలో ఎనిమిది లక్షలకు పైగా రిజిస్టర్డ్ సొసైటీలు ఉన్నాయని, 30 కోట్లకు పైగా పౌరులు వాటితో కనెక్ట్ అయ్యారని వెల్లడి అయినట్టు చెప్పారు. పిఏసిఎస్ లను అపెక్స్ కు, గ్రామాలను నగరాలకు, మండీలను ప్రపంచ మార్కెట్ కు, రాష్ట్ర డేటాబేస్ లను అంతర్జాతీయ డేటాబేస్ లకు అనుసంధానించే సామర్థ్యం ఈ డేటాబేస్ కు ఉందని శ్రీ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ తో ప్రారంభించిన సహకార సంఘాల విస్తరణ ప్రచారంలో, ఈ డేటాబేస్ ఈ దిశగా మార్గం సుగమం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, సహకార రంగంలో కంప్యూటరీకరణకు సంబంధించి మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పిఏ సిఎస్ ల నుంచి అపెక్స్ వరకు మొత్తం సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేసి వాటి సామర్థ్యాన్ని పెంపొందించామన్నారు. భారతదేశంలోని అన్ని సహకార కార్యకలాపాలకు ఈ డేటాబేస్ సమాధానమని ఆయన పేర్కొన్నారు. ఈ నేషనల్ డేటాబేస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించబడిందని, డైనమిక్ వెబ్ ఆధారిత ప్లాట్ ఫామ్ ను కలిగి ఉందని శ్రీ షా పేర్కొన్నారు. ఈ ప్లాట్ఫామ్ సహాయంతో దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన సమస్త సమాచారం ఒక బటన్ క్లిక్ చేస్తే లభిస్తుందని వివరించారు.
విధాన నిర్ణేతలు, పరిశోధకులు , భాగస్వాములకు ఈ సహకార డేటాబేస్ ఒక అమూల్యమైన వనరుగా పనిచేస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ డేటాబేస్ లోని డేటా ప్రామాణికత , దాని రెగ్యులర్ నవీకరణలు సమగ్ర శాస్త్రీయ వ్యవస్థ ద్వారా నిర్ధారించబడతాయని ఆయన అన్నారు. ధృవీకరించిన డేటాను మాత్రమే క్రమం తప్పకుండా ఈ డేటాబేస్ లో అప్ లోడ్ చేసేలా సహకార మంత్రిత్వ శాఖ చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో భౌగోళిక అసమతుల్యత కారణంగా 1975 తర్వాత దేశంలో సహకార ఉద్యమం వేగం మందగించిందని శ్రీ షా వివరించారు. దీనితో పాటు, రంగాల అసమతుల్యత, సామాజిక అసమతుల్యత, క్రియాత్మక అసమతుల్యత కూడా పెరిగాయి. అయితే, ఈ నాలుగు సమస్యలను పరిష్కరించే సాధనాలను ఈ డేటాబేస్ లో పొందుపరిచారు. నేడు వేలాది మంది ప్రజలు, సంస్థలు, రాష్ట్రాలు సమిష్టిగా ఒక బృహత్తర కార్యాన్ని సాధించాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ పునాదిపై వచ్చే నూట యాభై సంవత్సరాలు నిలబడే బలమైన సహకార వ్యవస్థకు నేడు నాందీ అని సహకార మంత్రి అన్నారు.
***
(Release ID: 2013376)
Visitor Counter : 124