వ్యవసాయ మంత్రిత్వ శాఖ

న్యూ ఢిల్లీ లో వ్యవసాయ రంగానికి చెందిన మూడు కీలక సదుపాయాలు - పునర్నవీకరించిన సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్, స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్, సెంట్రల్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ పోర్టల్ - ప్రారంభించిన కేంద్ర మంత్రులు శ్రీ అర్జున్ ముందా, శ్రీ గిరిరాజ్ సింగ్


కృషి సఖి కన్వెర్జెన్స్ కార్యక్రమం ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్

సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్ పునర్నవీకరణ; సాయిల్ శాంపిల్ సేకరణకు మొబైల్ అప్లికేషన్ ప్రారంభం

Posted On: 07 MAR 2024 5:23PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని  కృషి  భవన్  లో కేంద్ర  గ్రామీణాభివృద్ధి  శాఖ మంత్రి  శ్రీ గిరిరాజ్ కిశోర్  తో  కలిసి ఉమ్మడిగా నిర్వహించిన  ఒక  సమావేశంలో  కేంద్ర  వ్యవసాయ,  రైతు  సంక్షేమ  శాఖ  మంత్రి శ్రీ  అర్జున్  ముందా వ్యవసాయ  రంగానికి చెందిన మూడు  ప్రధాన  సదుపాయాలు   ప్రారంభించారు. అవి  పునర్నవీకరించిన  సాయిల్  హెల్త్  కార్డ్  పోర్టల్  అండ్ మొబైల్  అప్లికేషన్; స్కూల్  సాయిల్  హెల్త్  ప్రోగ్రామ్, ఎరువుల  శాంపిల్  టెస్టింగ్  కోసం  సెంట్రల్  ఫర్టిలైజర్  క్వాలిటీ  కంట్రోల్  అండ్  ట్రైనింగ్  ఇన్ స్టిట్యూట్  పోర్టల్. ఇదే  కార్యక్రమంలో  కేంద్ర  మంత్రి  శ్రీ  గిరిరాజ్  సింగ్ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా చేపట్టిన    కృషి  సఖి  కన్వెర్జెన్స్   కార్యక్రమం  కూడా  ప్రారంభించారు. 

దేశంలోని  ప్రత్యేకించి  మారుమూల  ప్రాంతాల్లోని రైతులకు ప్రయోజనం  కల్పించడం, వారు  తేలిగ్గా వ్యవసాయం  చేసుకునేందుకు తోడ్పడడం వీటి  ప్రధాన  లక్ష్యమని ఈ  కార్యక్రమంలో  మాట్లాడుతూ  శ్రీ అర్జున్  ముందా  తెలిపారు. ఇలాంటి సదుపాయాలన్నింటి వాళ్ళ  రైతులు సాధికారం  అవుతారని, తద్వారా  వారు తమకు, దేశానికీ, ప్రపంచానికి కీలకమైన  సేవలు  అందించగలుగుతారని మంత్రి  అన్నారు. సహకారం  ద్వారా  సుసంపన్నత  అనే  మౌలిక మంత్రంతో సహకారం  ఆధారిత భారతదేశాన్ని  నిర్మించడం కోసం  ప్రభుత్వం ఈ కృషి  చేస్తున్నదని అయన  చెప్పారు.  

భూమి  ప్రాధాన్యతను శ్రీ అర్జున్  ముందా ప్రముఖంగా  ప్రస్తావించారు. ఈ నేల  మన  తల్లి  (భూమాత) అని సర్వ ప్రాణుల  సంక్షేమం కోసం భూసార  స్వస్థతను  కాపాడవలసిన బాధ్యత  మనందరిపై  ఉన్నదని చెబుతూ  భూసారం  మెరుగైన  నిర్వహణలో కృషి  సఖి  పాత్ర  కీలకమని  అయన చెప్పారు. ప్రధానమంత్రి  నాయకత్వంలో  ఈ గొప్ప  శక్తి  ఏర్పటయిందని, ఇది భూసారంపై  రైతులను విద్యావంతులను  చేస్తుందని  అన్నారు.  మహిళా సాధికారత  ద్వారా  అర్ధవంతమైన ఫలితాలు  సాధిస్తూ లక్ష్యం దిశగా  అడుగులు  వేస్తున్నామని  మంత్రి తెలిపారు. భూసార   పరిరక్షణలో విద్యార్థులు  పాత్రను  కూడా  అయన  ప్రముఖంగా  ప్రస్తావించారు. ఈ  ఉద్దేశంతోనే భూసారం, పర్యావరణంఫై విద్యార్థులకు మార్గదర్శకం  చేసేందుకు స్కూల్  సాయిల్  హెల్త్  కార్యక్రమం  ప్రవేశపెట్టామన్నారు.  ఈ  కార్యక్రమం  కింద  గ్రామీణ  ప్రాంతాల్లోని  కొన్ని  కేంద్రీయ,  నవోదయ విద్యాలయాల్లో సాయిల్  ల్యాబ్  లు ఏర్పాటు చేసినట్టు  తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు  తాము  నివసిస్తున్న  గ్రామాల అభివృద్ధిలోను, వ్యవసాయ  అభివృద్ధిలోను   భాగస్వాములయ్యేందుకు వీలుగా  శిక్షణ  ఇచ్చినట్టు  చెప్పారు. 

కృషి సఖిలను “పారా  ఎక్స్  టెన్షన్ వర్కర్స్” గా సర్టిఫై  చేసేందుకు ఉమ్మడి  చొరవగా  కృషి  సఖి శిక్షణ  కార్యక్రమం ప్రారంభించినట్టు శ్రీ గిరిరాజ్  సింగ్  ఈ సందర్భంగా  తెలిపారు.  కేంద్రంలో  అధికారంలోకి  వచ్చిన నాటి నుంచి భూమి  స్వస్థతకు అధిక  ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీకి అయన  కృతజ్ఞతలు తెలిపారు.  కృషి సఖి, డ్రోన్ దీదీ వంటి కార్యక్రమాల రూపంలో  ఒక అపూర్వమైన శక్తి  దేశ శ్రేయస్సు కోసం పని  చేస్తున్నట్టు శ్రీ సింగ్ చెప్పారు. భూసారాన్ని  ఆరోగ్యవంతంగా ఉంచడంలో సాయిల్  ఆర్గానిక్  కార్బన్ పాత్ర గురించి  నొక్కి చెబుతూ భూమి, పశు సంపద  ఆరోగ్యం బాగుంటే మానవుల ఆరోగ్యం  కూడా  దానికదే మెరుగు పడుతుందని అయన అన్నారు. 

నేడు ప్రారంభించిన  సదుపాయాల  ద్వారా వాస్తవిక  డేటా  కూడా  అందుబాటులో ఉంటుందని శ్రీ గిరిరాజ్  సింగ్ అన్నారు.  సుస్థిర  వ్యవసాయ  విధానాల గురించి రైతులను చైతన్యవంతులను  చేయడంలో కృషి  సఖిల పాత్ర గురించి  ఆయన  ప్రముఖంగా ప్రస్తావించారు. కృషి సఖీలు వ్యవసాయానికే ప్రయోజనం కలిగించడమే    కాకుండా సమాజం విశ్వసనీయతను, వ్యవసాయదారుల విశ్వాసం పెంచడంలోనూ కీలకంగా నిలుస్తారని అయన చెప్పారు. యావత్ మానవాళి  సంక్షేమం  కోసం ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయ విధానాలు వినియోగించాలని అయన  సలహా  ఇచ్చారు. రాబోయే  రోజుల్లో ఆర్గానిక్  ఉత్పత్తుల మార్కెట్ గణనీయంగా  పెరుగుంతుందన్న ఆశా భావం ఆయన ప్రకటించారు.  ఆర్గానిక్  వ్యవసాయాన్ని  ప్రోత్సహించడంలో కృషి  విజ్ఞాన  కేంద్రాల పాత్ర అధికంగా  ఉండాలని అయన కోరారు. వ్యవసాయ శాఖకు చెందిన సంస్థలు కర్బన  వ్యర్థాలకు  సంబంధిన వాస్తవిక సమాచారం కూడా  అందుబాటులో ఉంచాలని కేంద్ర మంత్రి శ్రీ సింగ్ సూచించారు. ఈ సదుపాయాల ద్వారా ప్రధానమంత్రి కళలు నూరు శాతం సాకారం చేసేందుకు కృషి చేస్తున్నట్టు అయన చెప్పారు.

పునరుద్ధరించిన సాయిల్  హెల్త్  కార్డ్ పోర్టల్, మొబైల్  అప్లికేషన్ :  సాయిల్  హెల్త్  కార్డులను పునరుద్ధరించడంతో పాటు నేల శాంపిల్స్  సేకరించి పరీక్షించడానికి మొబైల్ అప్లికేషన్ ఒకటి ప్రారంభించారు. పోర్టల్ లో సాయిల్  లాబ్ రిజిస్ట్రీ ఉంటుంది. వాస్తవిక ప్రాతిపదికపై లాబ్  ల తాజా స్థితిని  వీక్షించవచ్చు. పోర్టల్   పై జియో కోఆర్డినేట్స్  ఆధారంగా లాబ్ లను మ్యాప్  చేయవచ్చు. అలాగే సాయిల్  శాంపిల్  సేకరణ, లాబ్ లలో పరీక్షలకు సంబంధించిన వాస్తవిక డేటాను కూడా తెలుసుకోవడంతో పాటు సాయిల్ హెల్త్  కార్డులను రూపొందించుకోవచ్చు. సాయిల్  హెల్త్  కార్డ్ మొబైల్ అప్లికేషన్ లోని క్యుఆర్  కోడ్ స్కాన్ చేయడం ద్వారా శాంపిల్  సేకరణ విధానం ప్రవేశపెట్టారు. కొత్త పోర్టల్  లో జాతీయ, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో సెంట్రలైజ్డ్ డాష్ బోర్డ్ లు ఏర్పాటు చేశారు. వాస్తవిక ప్రాతిపదికన జియోగ్రాఫిక్ సమాచార వ్యవస్థ (జిఐఎస్) అనలిటిక్స్  ను ప్రవేశపెట్టారు. రైతులు ఎస్ఎంఎస్  నోటిఫికేషన్  ద్వారా పోర్టల్ లో మొబైల్  నంబర్ ఎంటర్ చేసి  సాయిల్ హెల్త్ కార్డులు (ఎస్ హెచ్ సి) డౌన్ లోడ్  చేసుకోవచ్చు. పోర్టల్ లో ఎరువుల నిర్వహణ, ఎమోజీల ఆధారిత సాయిల్  హెల్త్  కార్డులు, పోషకాలకు సంబంధించిన డాష్ బోర్డు, పోషకాలకు సంబంధించిన హీట్ మ్యాప్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వాస్తవిక ప్రాతిపదికన పురోగతిని కూడా పర్యవేక్షించుకోవచ్చు. రైతుల జియో కోఆర్డినేట్స్ సహాయంతో శాంపిల్స్  సేకరించిన ప్రదేశాలను కూడా మొబైల్  అప్లికేషన్  ద్వారా ఆటోమేటిక్ గా కాప్చర్  చేయవచ్చు. ప్లాట్  వివరాలను కూడా యాప్  నమోదు చేస్తుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్  లో కూడా ఇది పని చేస్తుంది. సాయిల్  హెల్త్  కార్డ్ జనరేట్ చేసుకునే వరకు రైతులు తమ సాయిల్ శాంపిల్  స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. 

స్కూల్  సాయిల్  హెల్త్  ప్రోగ్రామ్ :  పాఠశాల, అక్షరాస్యత విద్యా శాఖ సహకారంతో స్కూల్  సాయిల్ హెల్త్  ప్రోగ్రామ్  పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లోని 20 కేంద్రీయ, నవోదయ విద్యాలయ పాఠశాలల్లో 20 సాయిల్  లాబ్ లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం స్టడీ మాడ్యూల్స్  రూపొందించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మొబైల్ అప్లికేషన్ ను పాఠశాల ప్రోగ్రామ్ కు అనుగుణంగా కస్టమైజ్  చేశారు. విద్యార్థులు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను డాక్యుమెంట్  చేస్తూ పోర్టల్  లో ఈ ప్రోగ్రామ్ కు చెందిన ప్రత్యేక విభాగం ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్  ను 1000 పాఠశాలలకు విస్తరించారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్  పాఠశాలలను ఈ ప్రోగ్రామ్  పరిధిలోకి తెచ్చారు. పాఠశాలలను పోర్టల్  లో చేర్చుకుని ఆన్ లైన్ బాచ్ లు ఏర్పాటు చేస్తున్నారు. డిఏఎఫ్ డబ్ల్యు శాఖ జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నబార్డ్) సహాయంతో ఈ పాఠశాలల్లో సాయిల్  లాబ్ లు ఏర్పాటు చేస్తారు. పాఠశాల విద్యార్థులు భూమి శాంపిల్స్  సేకరించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన లాబ్ లలో పరీక్షించి సాయిల్ హెల్త్ కార్డులను రూపొందిస్తారు. 

సాయిల్ హెల్త్  కార్డులను రూపొందించిన అనంతరం వారు రైతుల వద్దకు వెళ్లి సాయిల్  హెల్త్  కార్డుల సిఫారసులపై రైతులను విద్యావంతులను చేస్తారు. విద్యార్థులు ప్రయోగాలు నిర్వహించడానికి, మట్టి శాంపిల్స్ ను విశ్లేషించడానికి, మట్టిలోని అద్భుతమైన జీవవైవిధ్యాన్ని అన్వేషించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది. ప్రాక్టికల్  కార్యకలాపాల ద్వారా విద్యార్థులు కీలకమైన ఆలోచనా నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలు, విభిన్న వాతావరణ వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానత వంటి అంశాలపై అవగాహన పొందుతారు. అంతే కాదు, సాయిల్ లాబ్  ప్రోగ్రామ్  కేవలం శాస్ర్తీయ అన్వేషణలకే కాదు..పర్యావరణ పట్ల బాధ్యతాయుత వైఖరి, పర్యావరణ పట్ల గౌరవ భావం అలవరచుకునేందుకు కూడా సహాయపడుతుంది. సుస్థిర వ్యవసాయ విధానాలు, భూమి ఆరోగ్యంపై మానవ కార్యకలాపాల ప్రభావం, మన పర్యావరణ వ్యవస్థల్లోని సునిశితమైన సమతూకాన్ని కాపాడడంలో మనలో ప్రతీ ఒక్కరి పాత్ర వంటి అంశాలపై విద్యార్థులు నేర్చుకునేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

కృషి  సఖి కన్వర్జెన్స్  ప్రోగ్రామ్ : గ్రామీణ భారతం నడిబొడ్డులో ఒక మౌన విప్లవం చోటు చేసుకుంటోంది. గ్రామీణ పరివర్తనకు కృషి సఖిలు చోదక శక్తిగా ఉన్నారు. ఈ విప్లవాన్ని మరింత ముందుకు నడపడం కోసం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ; గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మధ్య సమన్వయాన్ని మరింత విస్తరించే దిశలో తమ శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నింటినీ సమన్వయపరిచేందుకు ఉభయ శాఖలు 2023 ఆగస్టు 30వ తేదీన ఒక ఎంఓయుపై సంతకాలు చేశాయి. ఈ ఎంఓయులో భాగంగానే కృషి  సఖి శిక్షణా కార్యక్రమం ప్రవేశపెట్టారు. 70,000 మంది కృషి  సఖిలను ‘‘పారా-ఎక్స్  టెన్షన్ కార్యకర్తలు’’గా సర్టిఫై చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. జాతీయ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం (ఎన్ఎంఎన్ఎఫ్), బయో రీసోర్స్  కేంద్రాలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై) వంటి పలు కార్యక్రమాల అమలులో కృషి  సఖిలు కీలక పాత్ర పోషిస్తారు. కట్టుబాటు, అభిరుచి, కఠోర శ్రమ, ఉత్సుకత వంటి లక్షణాలుండడం; స్థానికులు కావడంతో పాటు స్థానిక భాష, సంస్కృతి, ఆచరణలు వంటి అన్నింటి పైన అవగాహన  గల వారు కావడం  కూడా కృషి సఖిల ప్రత్యేకత. అలాగే గ్రామీణులు, రైతుల ఆనందం, విషాదం అన్నింటిలోనూ వారు భాగస్వాములు అవుతూ ఉంటారు. స్థానిక పర్యావరణ వ్యవస్థల పట్ల మెరుగైన అవగాహన కలిగి ఉంటారు. కృషి సఖిలు స్వయంగా రైతులే కావడంతో ప్రాంతీయ అంశాలపై వారికి చక్కని అవగాహన ఉంటుంది. స్నేహితులు, కుటుంబాలు, గ్రామీణులకు భిన్న అంశాలను సమగ్రంగా వివరించగల సామర్థ్యం వారికి ఉంటుంది.   

‘‘తాము ఆచరించేదే వారు బోధిస్తారు. గ్రామీణాభివృద్ధిలో వారి పాత్ర కీలకం’’. 
 
కృషి సఖిలు కేవలం వ్యవసాయ మార్గదర్శకులు కాదు; వారు స్వయంగా రైతులు, రైతు మిత్రలు, సామాజిక వనరులు, చైతన్యం కల్పించే శక్తులు, టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలను పరిశోధన సంస్థలతో కలిపే  అనుసంధానకర్తలు. గ్రామీణ వ్యవస్థలో కీలక పాత్రధారులు కావడంతో పాటు వ్యవసాయం, గ్రామ వ్యవహారాల్లో లోతైన అవగాహన గల వారు కావడం వల్ల గ్రామీణ వ్యవసాయ సేవల్లో గల వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ఎస్ఆర్ఎల్ఎంలు గ్రామాల్లో కృషి సఖిలకు శిక్షణ ఇస్తున్నాయి. వ్యవసాయ రంగం భవిష్యత్తును తీర్చి దిద్దగల సాధికారత, మార్పునకు సంబంధించిన కథనం ఇది.

సర్టిఫైడ్  కృషి సఖిలు రైతుల సామర్థ్యాలు నిర్మించి; రైతులు, కెవికెలు, వ్యవసాయ, అనుబంధ శాఖల మధ్య వారధిగా నిలిచే పారా ఎక్స్ టెన్షన్ కార్యకర్తలు, సామాజిక రీసోర్స్ పర్సన్ లుగా వ్యవహరిస్తారు. నవ్యపథంలో సమస్యల పరిష్కార కర్తలుగా వ్యవహరించే కృషి సఖిలు నైపుణ్యంతో సమాచారం వ్యాపింపచేయగల అసాధారణ వ్యక్తులు. వ్యవసాయ పర్యావరణం, ప్రకృతి వనరుల నిర్వహణ, పంటల వైవిధ్యం; ఆరోగ్య, పోషకాహార భద్రత వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండే కృషి సఖిలు తమ గ్రామాల్లో సుస్థిర వ్యవసాయానికి వెన్నెమెకగా వ్యవహరిస్తారు. 
వ్యవసాయ రంగానికి చెందిన వివిధ కార్యక్రమాల ప్రయోజనాలు రైతులు అందుకునేలా వారికి మార్గదర్శకం చేయగల కీలక వనరులు కృషి సఖిలు. జన్ భాగీదారిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం, భూసార నిర్వహణ, భూసార పరీక్షలు వంటి అంశాలపై వారు చైతన్యం కల్పిస్తారు. కృషి సఖిల జీవనోపాధిపై ఈ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, పథకాలు విస్తారంగం అందరికీ అందుబాటులోకి రావడానికి వీరు సహాయపడతారు.  ఇప్పటివరకు సుమారుగా 3500 మంది కృషి సఖిలకు శిక్షణ ఇచ్చారు. 13 రాష్ర్టాల్లో సమాంతరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
 
పరివర్తిత శక్తిగా కృషి సఖిలు : వ్యవసాయ రంగంలో పరివర్తన తీసుకురాగల శక్తి కృషి సఖిలు. వారు మార్పునకు విత్తనాలుగా వ్యవహరిస్తూ సుస్థిర వ్యవసాయం భవిష్యత్తును తీర్చి దిద్దగలుగుతారు. గ్రామీణ భారతంలో సమూలమైన మార్పు తీసుకురాగల అసాధారణ శక్తి కృషి సఖిలు.
సిఎఫ్ క్యుసిటిఐ పోర్టల్ : పోర్టుల వద్దనే శాంపిల్  సేకరణ, పరీక్షల కోసం ఎరువుల క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ (ఎఫ్ క్యుసిఎస్) పోర్టల్  వన్ టైమ్ పాస్ వర్డ్ (ఒటిపి)/ఎస్ఎంఎస్ అప్లికేషన్ ఫెసిలిటీని ప్రవేశపెట్టారు.  ఈ కొత్త పోర్టల్ సిస్టమ్  ఒటిపిని జనరేట్ చేసి అధీకృత వ్యక్తి మొబైల్  నంబర్ కు పంపుతుంది. ఎఫ్ సిఓ, 1985గా నిర్దేశిత ఫారం-జెలో ఫెర్టిలైజర్ ఇన్ స్పెక్టర్ నింపిన వివరాలన్నింటినీ  సంబంధిత వ్యక్తి పరీక్షించుకోవచ్చు. సమాచారంలో ఏవైనా తేడాలున్నట్టయితే ఒటిపిని ధ్రువీకరించేందుకు నిరాకరించవచ్చు. శాంపిల్  ను ఆటోమేటిక్  గానే సిస్టమ్ సంబంధిత లాబ్  కు కేటాయిస్తుంది. అధీకృత వ్యక్తికి లేదా దిగుమతిదారుకు సంబంధించిన ఇ మెయిల్ ఐడికి నేరుగా విశ్లేషణ నివేదిక పంపుతారు. రెండో దశలో దేశీయంగా తయారైన ఎరువుల శాంప్లిగ్ ను, పోర్టులు/డీలర్ సేల్ పాయింట్ల వద్ద ప్రత్యక్ష శాంపిల్ సేకరణ సదుపాయం కూడా పోర్టల్ లో పొందుపరుస్తారు. 

ఈ సమావేశానికి వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి; గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి;  భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) డైరెక్టర్ జనరల్, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు. అన్ని రాష్ర్టాల వ్యవసాయ శాఖల అధికారులు;  నవోదయ విద్యా సమితులు (ఎన్ విఎస్), కేంద్రీయ విద్యాలయ సంఘటనలు (కెవిఎస్), ఏకలవ్య మోడల్ ఆశ్రమ పాఠశాలలు (ఇఎంఆర్ఎస్) ప్రతినిధులు; కృషి సఖిలు, వ్యవసాయ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కార్యకర్తలు, వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

***



(Release ID: 2012595) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi