వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఓఎన్ డీసీ ప్లాట్ ఫామ్ లో నమోదైన దాదాపు 5,000 రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పిఓ)
10 వేల లక్ష్యానికి గాను 8 వేలకు పైగా ఎఫ్‌పిఓలు నమోదు
10.2 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూ.246.0 కోట్ల విలువైన 1,101 ఎఫ్‌పిఓ లకు రుణ హామీ మంజూరు
Posted On:
01 MAR 2024 4:07PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఆన్ లైన్ లో ఉత్పత్తులను విక్రయించడానికి ఏర్పాటైన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ( ఓఎన్ డీసీ) పోర్టల్ లో దాదాపు 5,000 రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పిఓ) సభ్యత్వం పొందాయి. దేశంలో రిజిస్టర్ అయిన రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పిఓ)ల్లో దాదాపు 5 వేల ఎఫ్‌పిఓలు ఓఎన్ డీసీ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యాయి. . దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తమ కొనుగోలుదారులను ఓఎన్ డిసిలో పోర్టల్ ద్వారా చేరుకోవడానికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓఎన్ డీసీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ చెల్లింపులు , బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-కన్స్యూమర్ లావాదేవీల ద్వారా ఎఫ్‌పిఓలకు సాధికారత కల్పించడం ఈ చర్య లక్ష్యం." 10,000 రైతు ఉత్పత్తి సంస్థల(ఎఫ్‌పిఓ) ఏర్పాటు, ప్రోత్సాహం' కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం లో 8,000 కు పైగా ఎఫ్‌పిఓలు నమోదయ్యాయి.6,865 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో ఈ పధకం 2020 లో ప్రారంభమైంది. చిన్న, సన్నకారు, భూమి లేని రైతులకు ఎఫ్‌పిఓలో సభ్యత్వం కల్పించి వారి ఆదాయం ఎక్కువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా కృషి చేస్తుంది. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, రుణాలు, నాణ్యమైన ముడి సరుకులు అందించి ఉత్పత్తి పెంచడంతో పాటు ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు అందించడానికి ఎఫ్‌పిఓలు కార్యక్రమాలు అమలు చేసి రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి కృషి చేస్తాయి.
పథకంలోకింద ప్రతి ఒక్క ఎఫ్‌పిఓకి 3 సంవత్సరాల కాలానికి 18.00 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తారు. ఇంతేకాకుండా ఎఫ్‌పిఓలో సభ్యత్వం ఉన్న ప్రతి రైతుకి 2,000 రూపాయలను గ్రాంట్ గా అందిస్తారు. ఓక ఎఫ్‌పిఓకి 15 లక్షల రూపాయలకు మించకుండా ఈ గ్రాంట్ అందుతుంది. ఎఫ్‌పిఓలకు సంస్థాగత మూలధన అవసరాల కోసం ప్రతి ఒక్క ఎఫ్‌పిఓ రెండు కోట్ల రూపాయల వరకు రుణం పొందేలా రుణ హామీ కూడా అందిస్తారు. ఇంతవరకు 1,101 ఎఫ్‌పిఓలకు 246 కోట్ల రూపాయల వరకు రుణ హామీ లభించింది. దీని వల్ల 10.2 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. మ్యాచింగ్ గ్రాంట్ గా 145.1 కోట్ల రూపాయలు 3,187 ఎఫ్‌పిఓల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జమ అయ్యింది.
వ్యవసాయ రంగానికి స్వావలంబన షేదించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఎఫ్‌పిఓలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ చేసి ఎఫ్‌పిఓలో సభ్యత్వం కలిగిన ప్రతి రైతు ఆదాయం ఎక్కువ చేయడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ యువతకు వారి స్వస్థలంలో ఉపాధి లభిస్తుంది. రైతుల ఆర్థిక సుస్థిరత అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది.
ఉత్పత్తి సమూహాలుగా ఎఫ్‌పిఓలను అభివృద్ధి చేసి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులను ఎక్కువ చేసి సభ్యులకు మార్కెట్ అవకాశాలు మరింత అందుబాటులోకి తీసుకు రావడానికి కార్యక్రమాలు అమలు జరుగుతాయి. మెరుగైన ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ , ఎగుమతి ప్రోత్సహించడానికి "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" కార్యక్రమం కింద చర్యలు అమలు జరుగుతాయి. వ్యవసాయ విలువ గొలుసు సంస్థలు ఎఫ్‌పిఓలను నెలకొల్పి సభ్యుల ఉత్పత్తికి 60% మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేయడానికి కార్యక్రమాలు అమలు జరుగుతాయి.
పథకం ముఖ్య లక్ష్యాలు:
* సుస్థిరమైన ఆదాయ-ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, మొత్తం సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధించి వ్యవసాయ వర్గాల సంక్షేమం కోసం కొత్త 10,000 ఎఫ్‌పిఓలను నెలకొల్పి వాటి అభివృద్ధికి అవసరమైన సంపూర్ణ , విస్తృత-ఆధారిత సహాయక పర్యావరణ వ్యవస్థ ను అందించడం.
* తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన స్థిరమైన వనరుల వినియోగం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం. ఉత్పత్తులకు సరసమైన ధర లభించేలా చూసేందుకు మార్కెట్ కల్పించి ద్వారా అధిక ఆదాయం సమకూర్చడం, సమిష్టి చర్య ద్వారా ప్రతి ఒక్క సభ్యుడు అభివృద్ధి చెందేలా చూసేందుకు కార్యక్రమాల అమలు
* ఎఫ్‌పిఓ నిర్వహణ, ముడి సరుకులు , ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం లు, క్రెడిట్ లింకేజీ, సాంకేతిక వినియోగం మొదలైన అన్ని అంశాలలో పని ప్రారంభించిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు కొత్త ఎఫ్‌పిఓ లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడం. ఎఫ్‌పిఓలు ఆర్థికంగా నిలదొక్కుకుని స్వయం సమృద్ధి సాధించడానికి అవసరమైన సహకారం అందించడం.
* కంపెనీల చట్టం పార్ట్ IXA కింద లేదా కో-ఆపరేటివ్ సొసైటీ కింద ఎఫ్‌పిఓ నమోదు చేసుకోవచ్చు
***
(Release ID: 2010888)
Visitor Counter : 246