వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు వడ్డీ రహిత రుణాలను ఆమోదించిన భారత ప్రభుత్వం
పొగాకు బోర్డుల వేలాల్లో ఎఫ్‌సీవీ పొగాకు అమ్మకాలకు అనుమతి, కర్ణాటకలో నమోదిత సాగుదార్ల అదనపు ఉత్పత్తిపై & నమోదుకాని సాగుదార్ల అనధికారిక ఉత్పత్తుల అమ్మకాలపై జరిమానా రద్దు
Posted On:
26 FEB 2024 2:22PM by PIB Hyderabad
మన దేశంలో, 'ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా' (ఎఫ్‌సీవీ) పొగాకును ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లో 42,915 ఎఫ్‌సీవీ పొగాకు నమోదిత రైతులు ఉన్నారు, పంట సీజన్ కొనసాగుతోంది. కర్ణాటకలో 39,552 ఎఫ్‌సీవీ పొగాకు సాగుదార్లు ఉన్నారు, పంట వేలం జరుగుతోంది.
2023 డిసెంబర్ 03-05 తేదీల్లో, మిచౌంగ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల వల్ల ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఎఫ్‌సీవీ పొగాకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రస్తుత పంటల సీజన్‌లో, 75,355 హెక్టార్ల విస్తీర్ణంలో ఎఫ్‌సీవీ పొగాకును సాగు చేశారు. వర్షాల కారణంగా 14,730 హెక్టార్ల విస్తీర్ణంలో, అంటే దాదాపు 20% విస్తీర్ణంలో పంట దెబ్బతింది. ఎఫ్‌సీవీ పొగాకు పంట పంటలు కొట్టుకుపోవడం, మునిగిపోవడం, నీరు నిలిచి పాడైపోవడం, ఎండిపోవడం వంటి కారణాలతో ప్రభావితమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ పొగాకు రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, 'గ్రోవర్ వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ పొగాకు బోర్డ్' నిధుల నుంచి రూ.10,000 వడ్డీ రహిత రుణాన్ని పొగాకు రైతులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది, ఆంధ్రప్రదేశ్ పంటల సీజన్ 2023-24 కోసం ఒక్కసారి మాత్రమే అనుమతించిన వడ్డీ రహిత రుణం. ఈ వడ్డీ రహిత రుణ మొత్తాన్ని, 2023-24 ఆంధ్రప్రదేశ్ పంట సీజన్‌లో సంబంధిత పొగాకు వేలం విక్రయాల నుంచి తిరిగి తీసుకుంటారు.
ప్రస్తుతం, కర్ణాటకలో ఎఫ్‌సీవీ పొగాకు వేలం జరుగుతోంది. ఈ రోజు వరకు, దాదాపు 85.12 మిలియన్ కిలోల ఎఫ్‌సీవీ పొగాకును కర్ణాటక ఇ-వేలం వేదికల ద్వారా ఇప్పటికే విక్రయించారు. పొగాకు రైతులు అందుకున్న సగటు ధర 12.49% పెరిగింది. అంటే గతేడాది కిలోకు రూ.228.01గా ఉంటే, ఇప్పుడు కిలోకు రూ.256.48 అందింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీవీ పొగాకును పండించే రెండు తాలూకాలు మినహా మిగిలిన అన్నింటిని కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. దీనివల్ల ఎఫ్‌సీవీ పొగాకు సాగుదార్ల జీవనోపాధి ప్రభావితమైంది. అందువల్ల, కర్ణాటక పంటల సీజన్ 2023-24 కోసం, నమోదిత సాగుదార్ల అదనపు ఉత్పత్తి & నమోదుకాని సాగుదార్ల అనధికారిక ఉత్పత్తి విక్రయాలపై జరిమానాను కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. ఆ మినహాయింపుతో కలిపి పొగాకు బోర్డుల వేలాల్లో ఎఫ్‌సీవీ పొగాకు విక్రయాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
******
(Release ID: 2009160)
Visitor Counter : 317