నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి మార్గనిర్దేశం చేసే భారతదేశపు అతి పెద్ద సౌర-బ్యాటరీ ప్రాజెక్టును ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించిన ఎస్‌ఈసీఐ

Posted On: 24 FEB 2024 7:52PM by PIB Hyderabad

కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎస్‌ఈసీఐ), సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్‌ను నిల్వ చేసే భారతదేశపు అతి పెద్ద 'బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్'ను (బెస్‌) విజయవంతంగా ప్రారంభించింది. 40 మెగావాట్లు (ఎండబ్ల్యూ)/120 మెగావాట్‌ గంటల సామర్యంతో పని చేసే బెస్‌, ఒక సౌర ఫోటోవోల్టాయిక్ (PV) విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం. 152.325 ఎండబ్ల్యూహెచ్‌ స్థాపిత సామర్థ్యంతో, 100 ఎండబ్ల్యూ ఏసీ (155.02 ఎండబ్ల్యూ పీక్ డీసీ) పంపగల సామర్థ్యంతో ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. తద్వారా, హరిత ఇంధనం ద్వారా రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీరుస్తుంది, పునరుత్పాదక ఇంధనాల కొనుగోలు బాధ్యతలను నెరవేరుస్తుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును, ఈ రోజు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.

సౌర ఫలకాలు, బ్యాటరీలో విద్యుత్‌ నిల్వను ఉపయోగించే ఈ ప్రాజెక్టు, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి & వినియోగంలో ఒక మైలురాయి వంటిది. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు సౌర శక్తిని నిల్వ చేయడానికి బ్యాటరీలను ఉపయోగిస్తారు.  సాయంత్రం, రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి ఆ శక్తిని వినియోగిస్తారు. ద్విముఖ సౌర ఫలకాలతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ఫలకాలు భూమి నుంచి కాంతిని పరావర్తనం చెందిస్తాయి, తద్వారా ఏకముఖ ఫలకాల కంటే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తికి వీలవుతుంది. తద్వారా, భారీ స్థాయి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టు ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది.

నిరుపయోగంగా ఉన్న భూమిని వ్యూహాత్మకంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్టులోని మరో ముఖ్యాంశం. దీనికోసం, ఛత్తీస్‌గఢ్ ఇంధన శాఖ, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీఎస్‌పీడీసీఎల్‌), ఎస్‌ఈసీఐ మధ్య త్రైపాక్షిక భూ వినియోగ ఒప్పందం కుదిరింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని డోంగర్‌ఘర్, డోంగర్‌గావ్‌ తహశీళ్లలోని 9 గ్రామాల్లో 451 ఎకరాల బంజరు భూమిని ఈ ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేశారు.

ఈ ప్రాజెక్టు నుంచి ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్‌కు 132 కిలో ఓల్ట్‌ల (కేవీ) డబుల్-సర్క్యూట్ డబుల్ స్ట్రింగ్ ట్రాన్స్‌మిషన్ లైన్ ద్వారా విద్యుత్‌ తరలించేలా ఏర్పాటు చేశారు. తద్వారా, విద్యుత్‌ పంపిణీలో స్థిరత్వం, నమ్మకాన్ని పెంచారు.

ఏటా కొన్ని టన్నుల కార్బన ఉద్గారాలను ఈ ప్రాజెక్టు తగ్గిస్తుందని అంచనా. సీఎస్‌పీడీసీఎల్‌తో ఎస్‌ఈసీఐ కుదుర్చుకున్న దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం, ఈ తరహా ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యతను & పునరుత్పాదక ఇంధన ప్రయత్నాలకు ఇస్తున్న మద్దతును స్పష్టం చేస్తుంది.

ప్రపంచ బ్యాంక్ & 'క్లీన్ టెక్నాలజీ ఫండ్' నుంచి వచ్చిన నిధులు, దేశీయ రుణ సంస్థల నుంచి తీసుకున్న రుణాలతో 'ఇన్నోవేషన్ ఇన్ సోలార్‌ పవర్ & హైబ్రిడ్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్‌' కింద ఈ ప్రాజెక్టును నిర్మించారు.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంపై ఈ ప్రాజెక్టు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, భూ వనరుల బాధ్యతాయుత వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

***(Release ID: 2008942) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi