ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆహారశుద్ధి రంగంలో ఔత్సాహిక అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఏర్పాటైన "సుఫలం " సదస్సు ప్రారంభించిన శ్రీ పశుపతి కుమార్ పరాస్

Posted On: 13 FEB 2024 5:26PM by PIB Hyderabad

ఆహారశుద్ధి రంగంలో ఔత్సాహిక అంకుర సంస్థలు, మార్గదర్శకులు  ప్రోత్సహించడానికి ఏర్పాటైన "సుఫలం " 2024  సదస్సును కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి   శ్రీ పశుపతి కుమార్ పరాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి ఆహార శుద్ధి రంగంలో అంకుర సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.  "సుఫలం "లాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అంకుర సంస్థలకు చేరుతాయని అన్నారు. మెరుగైన నెట్ వర్క్, సమాచార మార్పిడి లాంటి కార్యక్రమాలు  "సుఫలం "ద్వారా అంకుర సంస్థలకు లభిస్తాయని మంత్రి వివరించారు. అంకుర సంస్థల అభివృద్ధికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. అంకుర సంస్థల అభివృద్ధికి అవసరమైన పరిస్థితులు కల్పించి, వర్ధమాన పారిశ్రామిక వేత్తలను గుర్తించి ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆహారశుద్ధి రంగంలో పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పిస్తామని ఆయన తెలిపారు. 

తన ప్రసంగంలో కేంద్ర ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సరఫరా వ్యవస్థ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన కీలక అంశాలను వివరించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం,  ఎగుమతులు ఎక్కువ చేయడం , ఆవిష్కరణలు, ప్రపంచ ఆహార డిమాండ్లను తీర్చడంలో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ప్రముఖంగా నిలబెట్టడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ   దార్శనికతను సాకారం చేయడంలో ఆహార శుద్ధి రంగం పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. 

స్టార్ట్ అప్ ఇండియా పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలు, ఎంఎస్ఎంఈ లు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్ సూచించారు.  వ్యవసాయోత్పత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం లో  వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపుకు ఉన్న విస్తృత అవకాశాలను ఆమె వివరించారు, అంకుర సంస్థలకు పూర్తి సహకారం అందించి  ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారతదేశం) సాధన కోసం మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాల వివరాలను  ఆమె వివరించారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ  అదనపు కార్యదర్శి మిన్హాజ్ ఆలం, నిఫ్టెమ్-కే డైరెక్టర్ డాక్టర్ హరీందర్ సింగ్ ఒబెరాయ్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలు  ప్రోత్సహించడం, సహకారాన్ని అందించడం, ఆహార శుద్ధి రంగం అభివృద్ధి లక్ష్యంగా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా  "సుఫలం " కార్యక్రమాలు అమలు చేస్తుంది. 

ఈ కార్యక్రమంలో 250కి పైగా పారిశ్రామిక భాగస్వాములు, స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలు, ఆర్థిక సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నాలుగు నాలెడ్జ్ సదస్సులు , రెండు పిచింగ్ సదస్సులు , ఎగ్జిబిషన్ ఉంటాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఈఐసీ, అపెడా, స్టార్టప్ ఇండియా, ఫిక్కీ సహకారంతో నాలెడ్జ్ సదస్సులు జరుగుతాయి.  నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బుహ్లర్ ఇండియా, మారికో, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్, ఐటీసీ ఫుడ్స్, ఎల్టీ ఫుడ్స్, టీసీపీఎల్ వంటి పారిశ్రామిక సంస్థల సహకారంతో  పిచింగ్ సదస్సులు  నిర్వహిస్తారు. భారతదేశం వివిధ ప్రాంతాలకు చెందిన  మొత్తం 35 మంది ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఆహారశుద్ధి రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సదస్సు  ద్వారా కృషి జరుగుతుంది. సృజనాత్మకత, సుస్థిరత, సమ్మిళిత వృద్ధి తో  భవిష్యత్తు వైపు ఈ రంగాన్ని నడిపిస్తుంది. ప్రతిభ , దార్శనికతను ప్రదర్శించడానికి అంకుర సంస్థలకు సదస్సు అవకాశం అందిస్తుంది. ప్రతిభను గుర్తించి ఆహారశుద్ధి రంగంలో నూతన అవకాశాలను అందిస్తుంది. 

***



(Release ID: 2005983) Visitor Counter : 69


Read this release in: English , Urdu , Hindi